పరకామణి చోరీ అనేది చాలా చిన్న కేసు: వైఎస్ జగన్
హామీలు అమలులో కూటమి ప్రభుత్వం ఘారంగా విఫలమైంది - మెడికల్ కళాశాలలపై ప్రభుత్వాకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 4, 2025 at 7:11 PM IST
|Updated : December 4, 2025 at 8:56 PM IST
YS Jagan Comments on Alliance Govt: ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘారంగా విఫలమైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్, తదితర హామీలు ఎత్తేశారని అన్నారు. హామీ ఇచ్చి మోసం చేసిన ఆ ముగ్గురిపై ఛీటింగ్ కేసు పెట్టి జైలులో వేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలతో సేవ్ ఆంధ్రప్రదేశ్ అనాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. పండుగలా ఉన్న వ్యవసాయం దండగ అయిందని, రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారన్నారని జగన్ విమర్శించారు.
పంటలకు ఉచిత బీమా ఎగ్గొట్టారన్న జగన్ ఇన్పుట్ సబ్సీడీ, పెట్టుబడి సాయం చేయకుండా మోసం చేశారని విమర్శించారు. 19 నెలల చంద్రబాబు పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతులకు ఇవ్వాల్సిన 1100 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని అన్నారు. 19 నెలల్లో ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత ఆహారం, నీరు వల్ల 29 మంది పిల్లలు చనిపోయారని, ఫుడ్ పాయిజన్తో వందల మంది పిల్లలు ఆస్పత్రుల్లో చికిత్స పొందారని ఆక్షేపించారు. ప్రభుత్వంలో అంతా తిరోగమనం, అన్నీ స్కాములే జరుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వానికి మాయ రోగం వచ్చిందని, ఆరోగ్య శ్రీని ఖూనీ చేసి ప్రభుత్వ ఆస్పత్రులను అంతం చేశారని జగన్ ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు: పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం ఓ పెద్ద స్కాం అని విమర్శించారు. వేతనాలు, ఖర్చంతా ప్రభుత్వం భరిస్తూ ప్రైవేటు వ్యక్తులను కళాశాలల ఓనర్లుగా మార్చారని అన్నారు. పీపీపీ విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరిస్తున్నామని, ఈ నెల 16న కోటి సంతకాలను గవర్నర్ను కలసి ఇస్తామని తెలిపారు. తదుపరి పీపీపీ విధానాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కల్తీ మద్యం అమ్మకాలు జరగలేదని, టీటీడీలోనూ కల్తీ నెయ్యి వినియోగించకపోయినా అబద్దాలను నిజం చేసేందుకు సిట్ పేరిట అక్రమ కేసులు బనాయించి నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జగన్ ఆరోపించారు.
అది ఎలా తప్పు అవుతుంది?: తిరుమల పరకామణిలో జరిగిన చోరీ చాలా చిన్నదని వైఎస్ జగన్ అన్నారు. ఆ రోజున హుండీలో కేవలం రూ.72 వేల విలువైన 9 నోట్లు చోరీ జరిగితే ఆ దొంగ కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్ల ఆస్తులను దేవుడికి ఇవ్వడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. చోరీపై కేసు నమోదు చేసి కోర్టుల పరిధిలోనే విచారణ జరిపి కేసులను పరిష్కరించారని అన్నారు. పారదర్శకంగా పరకామణి లెక్కించేలా అధునాతన సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేసి దొంగను పట్టుకున్నామని తెలిపారు. పట్టుబడిన దొంగ 14 ఏళ్లుగా పరకామణిలో పని చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేదని జగన్ ప్రశ్నించారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం - జగన్ హెచ్చరిక
కృష్ణా జలాల్లో వాటాను కాపాడుకునేలా గట్టిగా వ్యవహరించాలి - చంద్రబాబుకు జగన్ లేఖ

