త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదో? - కిరీటం దక్కేది ఎవరికో?
మరికొన్ని గంటల్లో తేలనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం - త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదో - ధీమాగా ఉన్న ప్రధాన పార్టీలు

Published : November 14, 2025 at 8:03 AM IST
|Updated : November 14, 2025 at 8:09 AM IST
Jubilee Hills bypoll Result : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో ఈ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఫలితం రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాలకు కీలకం కానుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమదైన ముద్రను వేసి ప్రచారం చేశాయి. నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో మూడు పార్టీలు దూకుడును ప్రదర్శించాయి.
పార్టీల నేతలంతా రంగంలోకి దిగగా, అయితే రెండు పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది. ఆ పార్టీల అగ్రనాయకులు ఇది తమ ప్రతిష్ఠకు భంగం కలిగేటట్లు ఉందని వ్యక్తిగతంగా తీసుకుని ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వ్యూహాలు రచించారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు ఎంతో పకడ్బందీగా పోల్ మేనేజ్మెంట్ చేసినా పోలింగ్ 48.49 శాతానికే పరిమితం అయింది. మరోవైపు బీజేపీకి అన్నీ తానై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఓటర్లలో నిరాసక్తత అనేది కనిపించింది. జాబితా కూడా తప్పుల తడకగా ఉండటం పోలింగ్ శాతం తగ్గడానికి మరో కారణంగా చెప్పవచ్చు.
మంత్రుల పనితీరు విశ్లేషించే అవకాశం : రాబోయే ఫలితాలు మంత్రుల పనితీరుపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికలో అధికార పార్టీ పోల్ మేనేజ్మెంట్లో పై చేయిగా కనిపించింది. ఈ నేపథ్యంలో మంత్రులు ఇన్ఛార్జిలుగా ఉన్న డివిజన్లలో ఆధిక్యాలపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్లో కూడా ఇన్‌ఛార్జిల పనితీరు మదింపు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఈ ఉపఎన్నికను మంత్రులు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
ఏ గంటకు ఏం జరుగుతుందంటే :
- ఉదయం 5 గంటలకు - లెక్కింపు కేంద్రాలకు అధికారులు, సిబ్బంది
- ఉదయం 7 గంటలకు - టేబుళ్ల వద్ద పని మొదలు
- ఉదయం 8 గంటలకు - బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
- ఉదయం 8.30 గంటలకు - బ్యాలెట్ ఓట్ల ఫలితం
- ఉదయం 9 గంటలకు - ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలు
- ఉదయం 10 గంటలకు - మొదటి రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం
అప్పటినుంచి ప్రతి 30-40 నిమిషాలకు రౌండ్ల వారీగా ఫలితం వెల్లడికానుంది.
ఆధిక్యాలపైనే పందేలు : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై భారీగా పందేలు కాసినట్లు ప్రచారం అనేది జరుగుతోంది. ఓ సీనియర్ కాంగ్రెస్ నేత పార్టీ అభ్యర్థికి 20 వేల ఆధిక్యం రాదని రూ.10 లక్షలు బెట్టింగ్ కాసినట్లు వార్త హల్చల్ చేస్తోంది. మరో కాంగ్రెస్ నేత 12 వేల లోపు ఆధిక్యం ఉంటుందని పందెం వేశారు. గెలుపు ఓటముల కంటే ఆధిక్యాలపైనే ఎక్కువగా పందెలు కాసినట్లు తెలుస్తోంది. ఏపీలోనూ ఈ ఉపఎన్నికపై జోరుగా పందెలు కాస్తున్నారు. వందల కోట్ల బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం - మధ్యాహ్నానికి తేలనున్న రిజల్ట్!
జూబ్లీహిల్స్ : ఆ కేంద్రాల్లో 60 శాతం దాటిన పోలింగ్ - విన్నర్‌ను డిసైడ్ చేసేవి ఇవే!

