రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గింది - ఆడపిల్లల జోలికొస్తే వారికి అదే చివరిరోజు: హొంమంత్రి అనిత
శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి - మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందన్న అనిత - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 25 శాతం వరకు తగ్గాయని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 6:49 PM IST
Home Minister Vangalapudi Anitha Speech In Assembly Council: శాంతిభద్రతలు కాపాడతామనే నమ్మకంతోనే కూటమి పార్టీలను ప్రజలు గెలిపించారని, శాంతిభద్రతలు కాపాడటమంటే పరిపాలన బాధ్యతే కాదని అని రాజ్యాంగబద్ధమైన కర్తవ్యమని హోంమంత్రి అనిత అన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో శాంతిభద్రతలు లేకనే పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లారని నేడు పరిస్థితులు బాగుండటం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 25 శాతం వరకు తగ్గాయని తెలిపారు.
పోలీసు శాఖ పనితీరులో పురోగతి: ఎన్డీఏ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కచ్చితంగా ఉంటుందని అది తప్పిన వారికి శిక్ష కూడా తప్పదని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో లా ఉంది కానీ ఆర్డర్ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ విమర్శించగా హోం మంత్రి ఆ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. గత ప్రభుత్వంలోని పోలీసుశాఖ పని తీరుపై నివేదికలతో పోల్చితే ప్రస్తుతం పలు అంశాల్లో రాష్ట్రం పురోగతిలో ఉందని అమె అన్నారు. శాంతి భద్రతల్లో రాష్ట్రం చివర్లో ఉందని సాక్షిలో తప్పుగా రాశారని ఆక్షేపించారు.
కేంద్ర నివేదికను సరిగా అర్ధం చేసుకోకుండా వైఎస్సార్సీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని ఆమె ధ్వజమెత్తారు. "యూజ్ ఆఫ్ దిస్ పోర్టల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్లో" ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్న మంత్రి, రికవరీ ఆఫ్ లాస్ మొబైల్స్‌లో 6 వస్థానంలో ఉందన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్లో ఇతర రాష్ట్రాలకు ఎపీ ఆదర్శంగా ఉందని, లైంగిక నేరాలను అదుపు చేయడంలోనూ పురోగతి సాధించిందన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడే ముందు అన్నీ చదువుకుని మాట్లాడాలని సూచించారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలను మంత్రి ఖండించారు.
'మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపాం. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్నవి కేవలం వైఎస్సార్సీపీ వాళ్లు చేస్తున్న ఆరోపణలు మాత్రమే. గంజాయి సాగును పూర్తిగా అరికట్టాం. డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాం.' - అనిత,హోంమంత్రి
అక్రమ వలసదారులు- శాంతిభద్రతలపై ప్రభావంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో అక్రమంగా వలసదారులు ప్రవేశించకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు హోం మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వారి సంఖ్య 125 ఉన్నట్లు తేలిందని, 92 మంది వీసా గడువు ముగియడంతో ఉండిపోయారని తెలిపారు. అక్రమ వలసదారుల్లో 33 మంది వీసా లేకుండా ప్రవేశించారన్నారు. ప్రస్తుతం కేసులు విచారణ జరుగుతున్నాయని, వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అక్రమ వలసదారులకు రాష్ట్రం హాట్ స్పాట్‌గా: రాష్ట్రంలో అక్రమ వలసదారులు అధికంగా ప్రవేశిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన నాగబాబు, రాష్ట్రం అలాంటి వారికి హాట్ స్పాట్‌గా మారిందన్నారు. వారి సంఖ్య పెరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హవాలా, అక్రమ ఆయుధాలు, అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని వాటిని సైతం నివారించాలని కోరారు. ఎమ్మెల్సీ నాగబాబు తెలిపిన అంశాలన్నింటిపై తగిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. అక్రమ వలసదారులు రాకుండా, నివారణకు పోలీసు వ్యవస్థ ప్రత్యేకంగా నిఘా పెట్టిందన్న అనిత ఫేక్ ఆధార్ కార్డులతో రాష్ట్రంలో చలామణీ అవుతున్న వారిపైనా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అక్రమ వలసదారులు రాకుండా ఉండేందుకు పట్టణ ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా అనుమానితులు ఉంటే 112 కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అనిత - సభా వేదికగా కేటాయింపుల వివరణ
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

