కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు - దిల్లీ వెళ్లిన మంత్రి
మంత్రి కొండా సురేఖను దిల్లీకి పిలిచిన కాంగ్రెస్ అధిష్ఠానం - కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్న మంత్రి - ఇప్పటికే దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

Published : September 1, 2026 at 5:15 PM IST
|Updated : September 1, 2026 at 5:45 PM IST
Congress High Command Calls on Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ, చిన్నారెడ్డిల వ్యవహారంపై హైకమాండ్ దృష్టి సారించింది. ఇవాళ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్ఠానం దిల్లీకి పిలిచింది. దీంతో ఆమె హుటాహుటిన కొండా సురేఖ దిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కూడా మంత్రి కోరారు. ఇప్పటికే దిల్లీ సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా చేరుకున్నారు. దిల్లీలో కొండా సురేఖతో పాటు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం దిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిల అంశంపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్ఠానంతో చర్చించి మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అధిష్ఠానానికి నివేదిక : ఇటీవల గీసుకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కుమార్తె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కమిటీ ఛైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అనంతరం కొండా సురేఖతో పాటు వనపర్తి వ్యవహారంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై రూపొందించిన నివేదికను అధిష్ఠానానికి టీపీసీసీ పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి దిల్లీకి వెళ్లడం ఆమె విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
పదవుల నుంచి తొలగించాలని సిఫార్సు : మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని వ్యవహారంలో ఆ పదవుల నుంచి తొలగించాలని ఏఐసీసీకీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయి నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు అందించింది. పార్టీ గీతను దాటి వ్యవహరించిన నేతలపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్లు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. ఈ నివేదికపైనే ఏఐసీసీ పెద్దలు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇతర కీలక నేతలతో చర్చించనుంది.
సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం : ఒకరిద్దరు మంత్రులు, సీనియర్ నాయకులు కొండా సురేఖపై చర్యలు లేకుండా చూడాలని మీనాక్షి నటరాజన్‌తో మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఆమె మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే ఆయన తీసుకున్న నిర్ణయంలో ఏమైనా మార్పు ఉండొచ్చేమో కానీ లేదంటే మాత్రం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటు? - ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న సీఎం
కాంగ్రెస్‌లో జోరుగా మంతనాలు - కొండా సురేఖను కాపాడుకునేందుకు తెరవెనక తీవ్ర ప్రయత్నాలు!

