ETV Bharat / politics

'ఏడుకొండల వాడితో పెట్టుకుంటే పుట్టగతులుండవ్​' - వైఎస్సార్సీపీ తీరుపై మంత్రులు ఫైర్

శ్రీవారి పేరుతో రాజకీయ లాభం పొందాలనుకునే వారిని దేవుడు క్షమించరు - శ్రీవారి ఫోటోలను పట్టుకుని కాళ్లకు బూట్లు, చెప్పులు వేసుకుని వైఎస్సార్సీపీ సభ్యులు దుర్మార్గానికి ఒడిగట్టారు - వైఎస్సార్సీపీ తీరుపై మంత్రులు ఫైర్

State Ministers Fire on YSRCP Leaders
State Ministers Fire on YSRCP Leaders (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 3:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

State Ministers Fire on YSRCP Leaders : శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని వైఎస్సార్సీపీ చూడడం మహా పాపమని రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఏనాడు లేని విధంగా శాసనమండలిలో శ్రీవారి ఫొటోలను పట్టుకుని కాళ్లకు బూట్లు, చెప్పులు వేసుకుని వైఎస్సార్సీపీ సభ్యులు దుర్మార్గానికి ఒడిగట్టారని మండిపడ్డారు. శ్రీవారి పేరుతో రాజకీయ లాభం పొందాలనుకునే వారిని ఆ దేవుడు ఎప్పటికీ క్షమించరని అన్నారు.

శాసన మండలి నిండు సభలో శ్రీవారికి అపచారం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. కాళ్లకు బూట్లు, చెప్పులు వేసుకుని శ్రీవారి ఫొటోలను పట్టుకుని వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనలు చేయటం దుర్మార్గం అన్నారు. జగన్మోహన్ రెడ్డికి వెంకన్నస్వామి మీద నమ్మకం లేకపోతే తన పార్టీ ఎమ్మెల్సీలతో అపచారం కార్యక్రమాలు చేయించడం న్యాయమా అని మండిపడ్డారు. నోరు తెరిస్తే శ్రీరంగనీతులు చెప్పే బొత్స సత్యనారాయణ దగ్గరుండి ఈ దారుణాన్ని ప్రోత్సహించడం హైందవ లోకానికి తీరని అవమానమన్నారు. హిందువుల మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలపై జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ముప్పేట దాడులు చేయడాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఖండించారు.

"ఏడుకొండల వాడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవ్" - మండలిలో వైఎస్సార్సీపీ తీరుపై మంత్రుల ఫైర్ (ETV)

దేవుడంటే భక్తి లేదు, భయం లేదు : దేవుడితో వైఎస్సార్సీపీ నాయకులకు పరాచికాలా అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. దేవుడినే వాడుకుంటే దేవుడే తీర్పు ఇస్తారని అన్నారు. నిత్యం అబద్ధాలు, అల్లర్లు తప్ప మీరు సభలో ఏమి చేస్తున్నారని ఆమె నిలదీశారు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీ నేతలకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. హిందువుల మనోభావాలంటే లెక్కేలేదని దుయ్యబట్టారు.

దేవదేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి వైఎస్సార్సీపీ నేతలు దిగజారారని మంత్రి ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్​లో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఫొటోలను చెప్పులు, షూలు వేసుకుని నినాదాలు చేస్తూ రాజకీయం చేసే నీచానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టసభల్లో బూతులు, వెకిలివేషాలు : అధికారంలో ఉన్నప్పుడు చట్టసభలను బూతులు, వెకిలివేషాల కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు ఏకంగా దేవుడి ఫొటోలతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. హిందూమత విశ్వాసాల పట్ల, తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాలు, సంస్కృతి పట్ల జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచీ చిన్నచూపు ఉందని, పరమపవిత్రమైన దేవుడి ప్రసాదాన్ని జంతు కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేశారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు.

దేవుడి ఫోటోలతో ప్రదర్శనలు, నినాదాలు : వైఎస్సార్సీపీ పాపాలను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మహాపచారం చేసి బుకాయించుకోవటం వైఎస్సార్సీపీకే చెల్లుతోందని ఆయన మండిపడ్డారు. చట్టసభల్లో దేవుడి ఫొటోను ప్రదర్శించి రాజకీయ నినాదాలు చేయటం మునుపెన్నడూ లేదని అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటే ప్రజలు ఉపేక్షించరన్నారు. ఏడుకొండల వాడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని చరిత్ర చెప్తోందని గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు : శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని వైఎస్సార్సీపీ చూడడం మహా పాపమని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మండిపడ్డారు. శ్రీవారి భక్తుల మనోభావాలను వైఎస్సార్సీపీ నేతలు పదే పదే దెబ్బతీస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రజలు నేరుగా ఎన్నుకున్న శాసనసభ సమావేశాలకు మాత్రం రారన్న ఆయన, అదే వారు రద్దు చేయాలనుకున్న శాసనమండలికి మాత్రం హాజరవుతూ వాటి సమావేశాలను అడ్డుకుంటారని మండిపడ్డారు. అటు దేవుడన్నా, ఇటు ఎన్నుకున్న ప్రజలన్నా వైఎస్సార్సీపీ నేతలకు లెక్కలేదని అన్నారు. దేవుడితో రాజకీయ ఆటలాడుతున్న ఆ పార్టీ నేతలను ఆ దేవుడే శిక్షిస్తాడని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

బూట్లు, చెప్పులతో శ్రీవారి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు: నారా లోకేశ్

మండలిలో మహాపచారం - చెప్పులు, బూట్లు ధరించి వెంకన్న స్వామి ఫొటోతో వైఎస్సార్సీపీ ఆందోళన