రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం - పీఏసీ ఛైర్మన్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశం - ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై నేతల చర్చలు

Published : March 2, 2026 at 1:08 PM IST
|Updated : March 2, 2026 at 7:43 PM IST
Political Affairs Committee Meeting in Vikarabad : రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి ఫలితం తప్పక లభిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో దాదాపు రెండు గంటల పాటు మాట్లాడిన ఆయన, పార్టీ సిద్ధాంతాలపై దిశానిర్దేశంచేశారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం : రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల కోసం వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈ శిబిరం పది రోజుల పాటు కొనసాగి ఇవాళ ముగిసింది. ఈ శిబిరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా, ఆ రోజు నుంచి ముగింపు వరకు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై డీసీసీ అధ్యక్షులకు సమగ్ర అవగాహన కల్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, వాటిపై నమ్మకంతో పని చేసే వారికి పార్టీలో లభించే ప్రాధాన్యం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంలో డీసీసీ అధ్యక్షుల పాత్ర, నాయకత్వ లక్షణాలు, సీనియర్ నాయకులతో వ్యవహరించే తీరు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిబిరం మొదట నుంచి చివర వరకు తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పది రోజుల పాటు అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో కొనసాగిన ఈ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్‌కు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
యుద్ధ వాతావరణంపై రాహుల్ అభిప్రాయం : వికారాబాద్‌లోని అనంత పద్మనాభ ఆర్ట్స్ కళాశాలలో దాదాపు 45 నిమిషాల పాటు ఇరు రాష్ట్రాల్ల పీఏసీ సభ్యులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, బిల్లులు ఆమోదం పొందేందుకు కేంద్రంలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత్ రావు రాహుల్ గాంధీని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే దేశీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంపై రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమాచారం.
అనంతరం శిక్షణ శిబిరానికి చేరుకున్న రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి రాహుల్ గాంధీ దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించి, పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించడంతోపాటు, పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎలా అవకాశాలు లభిస్తాయో ఉదాహరణలతో వివరించారు. 19 ఏళ్ల కిందట జడ్పీటీసీగా ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం ముఖ్యమంత్రి పదవికి చేరిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తినందుకు తనపై కేసులు నమోదయ్యాయని, నిన్న కూడా కోర్టుకు హాజరైనట్లు చెప్పారు. దేశం కోసం, పార్టీ కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ప్రతి నాయకుడు అదే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల పోరాటాల ఫలితంగా రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎదిగారని పేర్కొన్నారు.
ముగింపు కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ - సీఎం రేవంత్‌తో కలిసి వికారాబాద్‌లో పర్యటన
పైరవీలు పని చేయవు - మెరిట్ ఉన్నవారికే పార్టీలో గుర్తింపు : సీఎం

