ETV Bharat / politics

రాంచందర్​రావును అరెస్ట్ చేసిన పోలీసులు - పరిస్థితులపై ఆరా తీసిన నితిన్ నబీన్

రాంచందర్‌రావును గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు - రాంచందర్‌రావును తొలుత తార్నాక నివాసంలో గృహ నిర్బంధం - నిన్న నల్గొండలో బీజేపీ, కాంగ్రెస్ పరస్పర దాడుల దృష్ట్యా పరిస్థితి ఉద్రిక్తం

BJP Ramchnader Rao Arrest in Hyderabad
రామచందర్​రావును అరెస్టు చేస్తున్న పోలీసులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 1, 2026 at 2:40 PM IST

|

Updated : September 1, 2026 at 6:14 PM IST

4 Min Read
Choose ETV Bharat

Ramchanderrao Arrest in Hyderabad : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న రాంచందర్‌రావును తొలుత తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. అయినా నల్గొండ వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తల నినాదాల మధ్య రాంచందర్‌ రావు బయటకు రావడంతో పోలీసులు నిలువరించి అరెస్టు చేశారు. దీంతో అక్కడ పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రాంచందర్​రావును అరెస్ట్​ చేసి గాంధీనగర్​ ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా రాంచందర్​రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎమర్జెన్సీ కన్నా భయంకరమైన రోజులు : తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా భయంకరమైన రోజులు కనిపిస్తున్నాయని రాంచందర్ ​రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘనంగా 1,000 రోజులు పూర్తి అయ్యిందని చెబుతోందన్నారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపమన్నారు. ఇక యుద్ధం మొదలైందని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రాంచందర్​ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, వాగ్దానాలు అమలయ్యాయా? అని రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నవేశారు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. వంద రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఆ కొలువులు ఎక్కడికి పోయాయని రాంచందర్​రావు ప్రశ్నించారు.

రాంచందర్​రావును అరెస్ట్ చేసిన పోలీసులు (ETV Bharat)

"ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ ఎక్కడికి పోయాయి? 1,000 రోజుల్లో రేవంత్ రెడ్డి 1,000 అబద్ధాలు ఆడారు.పేద ప్రజలు కడుపు కాల్చుకుని ప్రభుత్వం వైపు చూస్తున్నారు. కేంద్రం బియ్యం ఇస్తుంటే ప్రధాని ఫొటో పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీకి మాత్రం మూటలు పంపిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపైన దాడి చేశారు. నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపైనా దాడి చేశారు. ఇదేనా ప్రజా పాలన" - రాంచందర్ ​రావు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

నితిన్​ నబిన్ ఫోన్ : తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​ ఆరా తీశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్​రావుకు ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​, 1000 రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై పోరాడుతుంటే ఓర్వలేక దాడి చేశారని నితిన్​ నబిన్​కు రాంచందర్​రావు వివరించారు. బీజేపీ కార్యాలయానికి నిన్న నల్ల రంగు వేసిన ఘటన, ఈరోజు బీజేపీ నేతల హౌస్​ అరెస్టుల గురించి తెలిపారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని సైతం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ విధంగానే పోరాడాలని రాంచందర్​రావుకు నితిన్​ నబిన్ సూచించినట్లు తెలిసింది.

తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు : తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై నితిన్​ నబిన్ సామాజిక మాధ్యమం ఎక్స్​లో ట్వీట్ చేశారు. 'ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిని పరామర్శించేందుకు వెళ్తుండగా, ఆ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావుతో మాట్లాడాను. కాంగ్రెస్ అరాచక ముఠాలు దాడులు చేసినప్పుడు మౌనంగా ఉండే ప్రభుత్వ యంత్రాంగం, బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ నాయకులు వస్తే మాత్రం అరెస్టులకు పాల్పడుతోంది. రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ చెప్పే నీతులు కేవలం నాటకమే. ఈ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు!' అని నితిన్​నబీన్​ ట్వీట్ చేశారు.

డీజీపీని కలిసిన బీజేపీ నేతలు : బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతల బృందం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.బీజేపీ కార్యాలయాలపై యూత్​ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

ట్యాంక్​బండ్ వద్ద ఉద్రిక్తత : బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ దాడి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావుల అరెస్టును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే అంబేడ్కర్ విగ్రహం వైపు బీజేపీ శ్రేణులు దూసుకెళ్లాయి. విగ్రహం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులు, పోలీసులకు మద్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ధర్నా, పోలీసుల అరెస్టుతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరెస్టు చేసిన నేతలను ముషీరాబాద్ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

మహిళా బిల్లుపై కాంగ్రెస్​కు చిత్తశుద్ధి లేదు - కుటుంబ పాలన కోసమే ఇదంతా : రాంచందర్​ రావు

లుకౌట్‌ నోటీసుల పేరుతో ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: రాంచందర్​ రావు

Last Updated : September 1, 2026 at 6:14 PM IST