కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది? : రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ - కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో బంధించారని ఎద్దేవా - కేసీఆర్‌పై నిప్పుల వర్షం - రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం

Published : July 4, 2026 at 7:33 PM IST
|Updated : July 4, 2026 at 8:42 PM IST
CM Revanth Reddy Fire On KCR : దొర దురంహకారాన్ని మరోసారి బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ అన్నను దొర గడీ ముందు గంటల కొద్దీ నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తైన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తన రాజకీయ ప్రయాణంలో కీలకమైన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌పై నిప్పులు కురిపించారు.
తనను ఏనాడు పదవి, అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని సీఎం అన్నారు. వందేళ్లుగా దేశంలో కులగణన జరగలేదని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి దేశానికే దిక్సూచిగా నిలిచామని వెల్లడించారు.
దళితులను లారీలతో తొక్కించారు : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు పేదలకు సొంతింటి కల నేరవేరలేదన్నరేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదల కలను సాకారం చేస్తోందని పేర్కొన్నారు. రూ.70 వేల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని రూ.8.50 లక్షల కోట్ల అప్పుల స్థాయికి దిగజార్చారని విమర్శించారు. కేసీఆర్ ఏ గ్రామంలోనైనా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా?, కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా? అడిగారు. ఇసుక దోపిడీకి అడ్డువచ్చిన నేరెళ్ల దళితులను లారీలతో తొక్కించారని ఆరోపించారు. కేసీఆర్ కోటి ఎకరాలకు నీరు ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? ప్రశ్నించారు.
మీరు ఎందుకు రావాలి? : పదేళ్లు తన కుటుంబానికి, బంధువులకు తప్ప ఎవరికైనా ఉద్యోగాలు, పదవులు వచ్చాయా?, ప్రజాపాలన ఎందుకు పోవాలి? కేసీఆర్ మళ్లీ ఎందుకు రావాలని నిలదీశారు. కేసీఆర్ కుటుంబం దోపిడీలు, దొంగతనాలు మళ్లీ మొదలు కావటానికి ప్రజాపాలన పోవాలా? అడిగారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఎలా వచ్చిందని, కేటీఆర్, కవిత, హరీశ్‌రావుకు వేల కోట్ల విలువైన భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. భార్యాభర్తల మాటలు, ఆడబిడ్డల ఫోన్లు చాటుగా విన్న వాళ్లు మళ్లీ ఎందుకు రావాలని అడిగారు.
కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో బంధించారు : కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదని, ప్రజల సమస్యలపై మాట్లాడటానికి కేసీఆర్ బయటకు రావట్లేని గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా ఉద్యోగమిస్తే ఒక్కసారి కూడా ప్రజల గురించి మాట్లాడలేదని, అధికారం ఇస్తే మాత్రం దోచుకోవడానికి బయటకు వస్తారా? అని ప్రశ్నించారు. అరుంధతి సినిమాలో పశుపతిని బంధించినట్లే కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌లో బంధించారని, ఫామ్‌హౌస్ నుంచి పశుపతి మళ్లీ బయటకు వచ్చేది లేదన్నారు.
"2034 వరకు ప్రజాపాలనే, బీఆర్ఎస్ మిగిలింది గతమే. పనికి మాత్రం పాలమూరు వాసులు కావాలి కానీ పాలనకు వద్దా?. మనం పాలనకు పనికి రామనే దూరహంకారానికి చరమ గీతం పాడాలి. ప్రజా సమస్యలపై గఢీలోని వారికీ అవగాహనా లేక పోవచ్చు. పల్లెలో పుట్టి పెరిగిన సమస్యలపై అవగాహన ఉన్న నాకు పాలనకు ఇంకేం అర్హత కావాలి" - రేవంత్ రెడ్డి, సీఎం
మళ్లీ వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటారు : తమ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 2034 వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఉంటుందని, ఒకవేళ తప్పు జరిగితే తెలంగాణ రాష్ట్రానికి కాలరాత్రి అవుతుందని అన్నారు. తప్పు జరిగితే దోపిడీదారులు మళ్లీ వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటారని వెల్లడించారు.
రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కుటుంబానికి కృతజ్ఞత చూపాలని, రాహుల్‌గాంధీని ప్రధాని చేసే మొదటి అడుగు మిడ్జిల్ నుంచి పడాలని పిలుపునిచ్చారు.
ఆనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క ఇవాళ పెద్ద వృక్షమైంది : సీఎం రేవంత్ రెడ్డి

