ETV Bharat / politics

అమరావతి పూర్తయితే మనుగడ ఉండదనే వైఎస్సార్సీపీ డ్రామాలు: కూటమి నేతలు

వైఎస్సార్సీపీ నేతల అమరావతి పర్యటనపై కూటమి నేతలు ఫైర్ - అన్నదాతలపై రౌడీయిజం చేసేందుకే ఆ పార్టీ నేతలు అమరావతి వెళ్లారన్న అనిత - రాజధాని అమరావతిపై వైఎస్​ జగన్​ విషం కక్కుతున్నాడన్న సవిత

NDA Leaders on YSRCP Amaravati Tour
NDA Leaders on YSRCP Amaravati Tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 5:19 PM IST

|

Updated : June 27, 2026 at 7:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

NDA Leaders on YSRCP Amaravati Tour : వైఎస్సార్సీపీ నేతల అమరావతి పర్యటనపై కూటమి నాయకులు మండిపడ్డారు. రాజధాని పూర్తయితే మనుగడ ఉండదనే భావనతో వైఎస్సార్సీపీ నాయకులు డ్రామాలాడాతున్నారని ఆక్షేపించారు. అన్నదాతలపై రౌడీయిజం చేసేందుకే ఆ పార్టీ నేతలు అమరావతి వెళ్లారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఇది ముమ్మాటికీ రాజధాని రైతులపై రౌడీమూకలతో చేసిన దాడేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నానని అనిత చెప్పారు.

అన్నదాతలపై రౌడీయిజం చేసేందుకే వైఎస్సార్సీపీ నేతలు అమరావతి వెళ్లారన్న అనిత (ETV Bharat)

'టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన గుండాలే రైతులపై దాడికి వచ్చారు. అమరావతి వెళ్లిన వారందరి విజువల్స్ ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేతలకు రాజధానిలో పర్యటించే నైతిక అర్హత లేదు. అన్నదాతలను పరామర్శించేందుకు వెళ్లారా? రౌడీయిజం చేసేందుకు వెళ్లారా? వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తే సమస్య వస్తుందని పోలీసులు ముందే చెప్పారు. ఆ పార్టీ నేతల పర్యటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్​పై విచారణ చేస్తామని' అనిత పేర్కొన్నారు.

'పెనుమాకలో 90 శాతం రైతులు రాజధానికి భూములిచ్చారు. అమరావతి ప్రజల కలల రాజధాని శరవేగంగా ముందుకెళ్తోంది. రాజధాని 2027 నాటికి పూర్తి కావాలని అందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఆనాడు అమరావతి రాజధాని అని ఒప్పుకొని తర్వాత మూడు రోజుల రాజధానుల డ్రామాలాడారు. ఇప్పుడు మావిగన్ అంటూ ఏ ముఖం పెట్టుకొని రాజధానిలో పర్యటిస్తారు. అమరావతి పూర్తయితే తమకి మనుగడ కూడా ఉండదని ఆ పార్టీ ఈ డ్రామాలు చేస్తుందని' అనిత ఆరోపించారు.

Amaravati Farmers Vs YSRCP : వైఎస్సార్సీపీ అరాచకాలపై రాజధాని రైతులు ఆగ్రహంతో ఉన్నారని అనిత తెలిపారు. గత ప్రభుత్వంలో అమరావతి మహిళలను పోలీసు బూటు కాళ్లతో తన్నించారని గుర్తుచేశారు. అమరావతి రైతులకు అండగా ఉన్నందుకు గతంలో చంద్రబాబుపై భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ దాడులు చేశారని చెప్పారు. కానీ తాము అలాంటి వాటిని ప్రోత్సహించడం లేదని అనిత స్పష్టంచేశారు.

రాజధాని అమరావతిపై వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి విషం కక్కుతున్నాడని మంత్రి సవిత ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను రెచ్చగొడుతున్న విధ్వంసకారుడు జగన్ అని దుయ్యబట్టారు. ఆయన ఎన్ని జన్మలెత్తినా, తలకింది తపస్సులు చేసినా అమరావతిని అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. అభివృద్ధి చేతకాదు, చేసి చూపిస్తే తట్టుకులేని సైకో మనస్తత్వం ఆయనదని ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాజధాని నిర్మించి తీరుతామని సవిత తేల్చిచెప్పారు.

అమరావతిపై వైఎస్సార్సీపీ కక్షగట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాజధానిలో అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక రైతులపైకి ఆ పార్టీ దండయాత్ర చేస్తుందని విమర్శించారు. రాజధాని నగరంగా అమరావతి రూపుదిద్దుకోవడం వైఎస్సార్సీపీకి ఇష్టం లేదని, అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతోందన్నారు. అమరావతిలో ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో పర్యటించారని ఆక్షేపించారు. రైతులపై దాడిని అందరూ ఖండించాలని చెప్పారు. రాజధానిపై మాట్లాడే అర్హత వైఎస్సార్సీపీకి లేదని నాదెండ్ల మనోహర్ తేల్చిచెప్పారు.

'అమరావతి రైతుల పేరుతో వైఎస్సార్సీపీ కొత్త డ్రామాలు ఆడుతోంది. అన్నదాతల మనోభావాలతో రాజకీయాలు చేయడం ఆ పార్టీకి అలవాటైంది. ప్రజలను రెచ్చగొట్టి బాధితులమని నటించడం వారి నైజం. రాజధానిని నిర్వీర్యం చేసినవారే రైతుల పరిరక్షణ అంటున్నారు. గొడ్డలి పార్టీ నేతలు పోలీసులపై దాడి చేయడం అత్యంత హేయం. వైఎస్సార్సీపీ హింసాత్మక రాజకీయాలను ప్రజలు తిప్పికొడుతున్నారు. అమరావతి రైతుల ఆగ్రహానికి కారణం ఆ పార్టీ ద్వంద్వ వైఖరే. కర్షకుల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించడం వారి కుట్ర. పోలీసులపై దాడులను ప్రభుత్వం ఉపేక్షించదు. అమరావతిని రాజధానిగా వ్యతిరేకించిన వైఎస్సార్సీపీకి అక్కడికి వెళ్లే హక్కు లేదని' మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

'ఐదేళ్లు రాజధాని రైతులను ఇబ్బందులు పెట్టి హింసించారు. రైతు పరిరక్షణ సమితి పేరుతో 3 రాజధానుల డ్రామా ఆడారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేపట్టిన మహిళలను బూటు కాళ్లతో తన్నించారు. అమరావతి రైతుల పోరాటం గెలిచి రాజధానిగా చట్టం వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు, మొన్న మావిగన్ అన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధాని రైతుల పేరుతో రాజకీయం. అన్నదాతల ముసుగులో గొడ్డలి పార్టీ నేతలు పోలీసులపై దాడులు చేయడం దుర్మార్గం. గొడ్డలి పార్టీకి కుట్రలు, కుతంత్రాలు చేయడం పరిపాటిగా మారిందని' కొల్లు రవీంద్ర విమర్శించారు.

రాజకీయ పబ్బం కోసమే వైఎస్సార్సీపీ డ్రామాలు : రాజకీయ పబ్బం కోసమే వైఎస్సార్సీపీ నేతలు అమరావతిలో అడుగుపెట్టారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఐదేళ్లు రాజధాని రైతులకు ముఖం చూడకుండా పరదాల మాటున నక్కారని విమర్శించారు. ఇవాళ అన్నదాతల పక్షాన పోరాడుతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతుల త్యాగాలను అసెంబ్లీ సాక్షిగా అపహాస్యం చేశారని ఆక్షేపించారు. జగన్‌ ఇవాళ కొత్త నాటకానికి తెరలేపారని ప్రత్తిపాటి దుయ్యబట్టారు.

అమరావతిలో వైఎస్సార్సీపీ నేతల పర్యటన - అడ్డుకున్న రైతులు - ఉద్రిక్తత

చకచకా అమరావతి నిర్మాణ పనులు - విధ్వంసం నుంచి విశ్వనగరిగా!

Last Updated : June 27, 2026 at 7:38 PM IST