రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి - వచ్చే ఎన్నికల్లో పోటీ: కవిత
తన రాజీనామాపై 4 నెలలుగా నిర్ణయం తీసుకోలేదు - ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బీఆర్‌ఎస్, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు - శాసన మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 4:37 PM IST
MLC Kavitha Requested Her Resignation : శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్వేగంతో ప్రసంగించారు. మాట్లాడుతున్న క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పని చేసినట్లు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఛైర్మన్ ఫార్మాట్‌లోనే పంపినట్లు చెప్పారు. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఛైర్మన్ సూచించారని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో కూడా రాజీనామా ఆమోదించాలని కోరానన్నారు. అయినా తన రాజీనామాపై 4 నెలల సమయంలోనూ నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బీఆర్‌ఎస్, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
రాజీనామా ఆమోదించాలి : బీఆర్‌ఎస్ నుంచి తనకు అనేక కట్టుబాట్లు ఎదురయ్యాయని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజీనామా ఆమోదించాలని కోరుతున్నట్లు చెప్పారు. కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో తాను ఉద్యమంలోకి వచ్చానన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలో లోటుపాట్లు పూడ్చేందుకు కృషి చేశానన్న ఆమె, యువకులను ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
విమర్శలు వచ్చినా బీఆర్‌ఎస్ నేతలు స్పందించలేదు : రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని, బీఆర్ఎస్ తనను ఘోరంగా అవమానించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐతో పోరాడేటప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలులో పెట్టించిందన్నారు. కేసీఆర్‌పై విమర్శలు వచ్చినా బీఆర్‌ఎస్ నేతలు స్పందించలేదన్నారు.
"తెలంగాణ ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. నాది ఆత్మగౌరవ పంచాయితీ, ఆస్తుల పంచాయితీ కాదు. రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ వేదిక రాబోతోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, అన్నివర్గాల కోసం పని చేస్తా. అవమానభారంతో అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నా. పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నా. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతా. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా, రాజకీయ శక్తిగా తిరిగివస్తా" -కవిత, జాగృతి అధ్యక్షురాలు
పదవుల్లో మహిళలకు సరైన అవకాశాలు ఇవ్వాలి : తాను రాజీనామా చేసి 4 నెలలైందని, దయచేసి ఆమోదించాలని కవిత మండలి ఛైర్మన్ గుత్తాను కోరారు. రాజీనామాపై పునరాలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ గొడవలు ఆస్తుల పంచాయితీ అని కాంగ్రెస్ విమర్శిస్తోందన్నారు. తన బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇది ఆస్తుల పంచాయితీ కాదని వివరించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు మహిళలపై ఎంతో చిన్నచూపు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల్లో మహిళల ప్రాతనిథ్యం 0.00003 శాతంగా ఉందని చెప్పారు. పదవుల్లో మహిళలకు సరైన అవకాశాలు ఇవ్వాలని కోరారు. నైతికత కోల్పోయిన బీఆర్‌ఎస్‌లో తాను ఉండలేనని, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిలోనూ ఉండలేనని చెప్పారు.
పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే ఎలా : బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారని కవిత భావోద్వేగానికి గురయ్యారు. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు స్వతంత్ర సంస్థను నడిపించానన్న కవిత, పార్టీలో ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినట్లు తెలిపారు. అమరుల స్థూపం మొదలుకుని కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందన్నారు. ఒక్క వానకే సిద్దిపేట, సిరిసిల్లలో కలెక్టరేట్‌లు కొట్టుకుపోయాయన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని పార్టీలో కోరానన్నారు.
అమరవీరులను బీఆర్‌ఎస్ ఎప్పుడూ గుర్తించలేదన్న కవిత నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. దానిని తెరిపించలేకపోవడం తనకు అవమానకరంగా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను అడిగే ధైర్యం తనకే ఉందని, తద్వారా ఎన్నో విషయాలు అడిగానన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మార్చడాన్ని తాను ఒప్పుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో చేయాల్సి ఉన్నా, వదిలేసి దిల్లీకి గురిపెట్టారని, కొన్ని సంస్థలకే రూ.లక్షల కోట్ల టెండర్లు వెళ్లాయని ఆక్షేపించారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం సరికాదు : కవిత ఆవేదనను అర్థం చేసుకున్నానని, భావోద్వేగంతో రాజీనామా చేశారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. భావోద్వేగంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం సరికాదని మరోసారి సూచించారు. పునరాలోచన చేయాలని అన్నారు. కవిత రాజీనామా ఆమోదించాలని పలుమార్లు కోరినా ఛైర్మన్ గుత్తా ఆమోదించకపోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు - సమైఖ్యత అవసరం: సీఎం చంద్రబాబు
మాతృభాష మన మూలాలకు సంకేతం - మాతృభాషలో రాణిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాం: సీఎం చంద్రబాబు

