ఛైర్మన్ తీరుపై రాజీనామా చేసిన ఎమ్మెల్సీల నిరసన - అవిశ్వాసం పెట్టే యోచన!
రాజీనామాల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బల్లి కల్యాణ్ చక్రవర్తి - ఛైర్మన్ మోషేన్ రాజు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని ఆరోపణ, అవసరమైతే ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 3:43 PM IST
MLC Kalyan Chakravarthy Slams Delay in Resignation Acceptance: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాదిన్నర గడిచినప్పటికీ ఆమోదించకపోవడంపై ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2024 ఆగస్టులో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి వైఖరి తనకు నచ్చకే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఛైర్మన్ మోషేన్‌రాజుకు ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా విచారణ పేరుతో ఆలస్యం చేయడం రాజ్యాంగ విరుద్ధమని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఒక సభ్యుడు స్వయంగా రాజీనామా పత్రాన్ని ఇచ్చినప్పుడు వెంటనే ఆమోదించాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ అలా చేయకపోతే ప్రజాస్వామ్య విలువలకే అవమానకరమని శాసన మండలి ఛైర్మన్ మోషేన్‌రాజును విమర్శించారు. అవసరమైతే ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
ఉద్దేశపూర్వకంగానే జాప్యం: శాసన మండలి ఛైర్మన్‌గా నాడు వైఎస్సార్సీపీ నుంచి మోషేన్ రాజును ప్రతిపాదించింది తానేనని, ఆయనపై ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలని కూడా తానే ప్రతిపాదిస్తానని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీనామాలు ఆమోదించమని ఎన్నిసార్లు స్పష్టంగా చెప్పినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఆరోపించారు.
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, పెత్తందారీ పోకడలకు నిరసనగా ఆ పార్టీ ద్వారా తనకు వచ్చిన శాసనసమండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తెలియజేశారు. గతేడాది రాజీనామా చేసినా సరే ఇప్పటివరకు ఆమోదించలేదని కల్యాణ్ చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఛైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. ఛైర్మన్ ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అవమానకరంగా ఉందని అన్నారు.
స్వచ్ఛందంగానే రాజీనామాలు:శాసనమండలి సభ్యత్వానికి తన రాజీనామాను ఆమోదించమని స్వయంగా శాసనమండలి ఛైర్మన్ ను పలుమార్లు కలిసి కోరినా స్పందించకుండా జాప్యం చేస్తున్నారని కల్యాణ్ చక్రవర్తి విమర్శించారు. శాసనమండలి ఛైర్ కు ఉన్న విలువలను కాపాడాలని బల్లి కళ్యాణ చక్రవర్తి కోరారు. వైఎస్సార్సీపీలో ఉండలేక స్వచ్ఛందంగా రాజీనామా చేశామనే సమాధానం ఎన్నిసార్లు చెప్పమంటారో అర్ధం కావట్లేదని అన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని ఇప్పటికే ఛైర్మన్‌కు అనేకమార్లు స్పష్టం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా అని ఛైర్మన్ అడిగినా లేదని తేల్చి చెప్పినట్లు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తెలియజేశారు. సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదనే అనుమానం ఉంటే మాత్రమే విచారణ జరపాలని రాజ్యాంగం చెప్తోందని అన్నారు. రాజీనామా పత్రాలు స్వయంగా తీసుకెళ్లి ఇవ్వటంతో పాటు, ఇప్పటికీ అనేక సార్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశామనే విషయం ఛైర్మన్‌కు చెప్పామని గుర్తు చేశారు.
ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నామని, ఇంకా ఎన్నిసార్లు అడిగినా మాది ఇదే సమాధానమని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా రాజీనామాలు చేయలేదని ఒప్పించే తపన ఛైర్మన్‌కు ఎందుకు ఉందో అర్ధం కావట్లేదని బల్లి కళ్యాణ చక్రవర్తి విమర్శించారు.
అవిశ్వాసం పెట్టాలనే యోచన: మండలి ఛైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం పెట్టాలని రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సభ్యులు రాజీనామా చేసినా సరే ఛైర్మన్ మోషేన్ రాజు ఇంతవరకూ ఆమోదించలేదు. ఛైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అవిశ్వాసానికి సరిపడా సంఖ్యాబలం ఉన్నందున ఎమ్మెల్సీలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
''రాజీనామాపై వివరణ ఇవ్వండి'' - వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ నోటీసులు
వైఎస్సార్సీపీ నుంచి మరో రెండు వికెట్లు ఔట్ - పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా!

