కాంట్రవర్సీ చేస్తూ ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారు - కొండా సురేఖకు కడియం కౌంటర్
కొండా సురేఖను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి - తాను ఏ తప్పు చేయలేదని, వివరణ ఎందుకు ఇస్తానని ప్రశ్న - సమీక్ష చేసే హక్కు లేదని తనకు తెలుసునని వెల్లడి

Published : July 8, 2026 at 3:32 PM IST
|Updated : July 8, 2026 at 7:03 PM IST
Kadiyam Srihari Counter to Minister Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయశాఖలో అధికారిక సమీక్ష నిర్వహించారని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
వివరణ ఎందుకు ఇస్తా? : తనపై కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కడియం శ్రీహరి పరోక్షంగా వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని, కాంట్రవర్సీ చేస్తూ ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారని మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదని, వివరణ ఎందుకు ఇస్తానని ప్రశ్నించారు. తాను సమీక్ష నిర్వహించలేదని, సమస్యలు విన్నవించానని అన్నారు.
అవసరమైతే సీఎంనూ కలుస్తా : తన వద్దకు అధికారులను పిలిస్తే అది సమీక్ష అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. దేవదాయశాఖపై సమీక్ష చేసే హక్కు లేదని తనకూ తెలుసునని అన్నారు. ఆలయాల సమస్యల పరిష్కారానికి కమిషనర్‌ను కలిశానని, తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి కోసం చర్చించామని, నియోజకవర్గ సమస్యల కోసం అవసరమైతే సీఎంనూ కలుస్తామని వెల్లడించారు.
పరిపాలనా నిబంధనలకు విరుద్ధం : కడియం శ్రీహరిపై మూడు పేజీల లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ.. శాఖా మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించారనిపై ఆమె ఆరోపించారు. శాఖా పరిపాలన, విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ పూర్తిగా సంబంధిత శాఖా మంత్రి పరిధిలోనే ఉంటాయని తన లేఖలో స్పష్టం చేశారు. అయినప్పటికీ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో దేవాలయాల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్లు, దేవాలయ భూముల పరిరక్షణ, నిధుల కేటాయింపులు, అధికారులకు గడువులు విధించడం వంటి అంశాలపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించడం పరిపాలనా నిబంధనలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదని, మంత్రి అధికారాలను బేఖాతరు చేసిన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికార యంత్రాంగంలో అయోమయానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ, ప్రభుత్వ స్థాయిలో సమగ్రంగా విచారించాలని ముఖ్యమంత్రిని కోరారు. సంబంధిత అంశాలపై పూర్తి వివరణ తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి కొండా సురేఖ తన ఫిర్యాదులో కోరారు.
"స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఆలయాల అభివృద్ధి కోసం మాత్రమే దేవాదాయ శాఖ అధికారులను కలిశాను. నా నియోజకవర్గంలోని ఆలయాల గురించి అధికారులకు విన్నవించాను. తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ రాష్ట్రానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లడలేదు. కొందరు కాంట్రవర్సీ చేస్తూ ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారు" - కడియం శ్రీహరి, ఎమ్మెల్యే
మంత్రిని గౌరవించమని కడియం శ్రీహరికి చెప్పండి - రేవంత్ రెడ్డికి కొండా సురేఖ లేఖ

