ETV Bharat / politics

అమరావతి అభివృద్ధి చూసి ఓర్వలేకే జగన్​ అసత్య ప్రచారం: మంత్రి సత్యకుమార్​

జగన్మోహనరెడ్డి మరోసారి అర్ధం లేని, అవగాహన రాహిత్యమైన మాటలతో రాజధాని అమరావతిపై విషం చిమ్మారన్న మంత్రి సత్యకుమార్​యాదవ్ - రాయలసీమ ప్రాజెక్టులను ఏనాడూ పట్టించుకోని జగన్​ ఇప్పుడు ఇలా మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా

Minister Satya Kumar Yadav Sensational Comments on YS jagan
Minister Satya Kumar Yadav Sensational Comments on YS jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 5:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

Minister Satya Kumar Yadav Sensational Comments on YS jagan : వైఎస్​ జగన్​ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు నేతలు ఆయన మాటలను ఖండిస్తూ గట్టిగా కౌంటర్​ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి మరోసారి అర్ధం లేని, అవగాహనరాహిత్యమైన మాటలతో రాజధాని అమరావతిపై విషం చిమ్మారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్​ యాదవ్​ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అవాస్తవాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. తాను ఏ అంశాలను ప్రస్తావించాననేది ఓసారి జగన్‌ చూస్తే మంచిదని సూచించారు. ఈ మేరకు జగన్​ వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సత్యకుమార్​ యాదవ్​ మాట్లాడారు.

రాయలసీమ ప్రాజెక్టులను ఏనాడూ పట్టించుకోని జగన్​ ఇప్పుడు ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూమిపూజలు చేసిన వాటికే మళ్లీ భూమిపూజలు చేశారు తప్ప జగన్​ పాలనలో రాష్ట్రం అభివృద్దికి నోచుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించారా? ముంపునకు గురైన గ్రామాలకు పరిహారం చెల్లించారా? దౌర్జన్యంగా గ్రామాలను ఖాళీ చేయించారే తప్ప పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.

అమరావతి అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్​ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి సత్యప్రసాద్​ యాదవ్​ (ETV)

రాష్ట్రాన్ని చులకన చేసేలా జగన్​ వ్యాఖ్యలు : ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది చూస్తే అది నదీ గర్బంలో కడుతున్నామో, ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో తెలుస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల ముందు ఏపీని చులకన చేసేలా జగన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాజధాని, రాయలసీమ విషయమే కాకుండా ప్రతి అంశంలోనూ జగన్‌ది వితండ వాదనే అని విమర్శించారు. నాడు అమరావతి రాజధానికి శాసనసభలోనే మద్దతు తెలిపి జగన్​, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల పేరిట వికృత ఆనందం పొందారన్నారు. మళ్లీ ఇప్పుడు నదీ తీరంలో రాజధాని అంటూ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలో నదీ తీరంలో, పరివాహక ప్రాంతంలో నెలకొల్పిన ఎన్నో రాజధానులు అభివృద్ధి చెందిన విషయం జగన్​కి తెలుసునని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ రాష్ట్రంలో రాజధాని అమరావతిపై ప్రజలు, పెట్టుబడిదారులు చూపుతున్న విశ్వాసం జీర్ణించుకోలేక అవాకులు, చవాకులు, అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలించి, నిధులు ఇచ్చారో ప్రకటించాలన్నారు. తన ఇసుక దాహం కోసం అన్నమయ్య ప్రాజెక్ట్ డ్యామ్ కూల్చేసి, బాధితులకు న్యాయం చేయలేక పోయారన్నారు.

"రాష్ట్రమంతా ఏకతాటిపై ఉన్నప్పుడు జగన్​ అవగాహన రాహిత్యమైన మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ఒకప్పుడు తాము సీఎంగా ఎన్నుకున్నది ఇలాంటి వ్యక్తినా అని జనాలు విస్తుపోయేలా జగన్​ వ్యాఖ్యలు ఉన్నాయి. రాజధాని విషయంలో, పెట్టుబడులు, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఇలా ఏ అంశం అయినా జగన్​ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని స్పష్టంగా తెలుస్తుంది. " -సత్యకుమార్‌యాదవ్‌, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి

జగన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు - అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నారాయణ

రాజధాని అమరావతిపై మిగిలి ఉన్న అక్కసు ఇవాళ జగన్ కక్కేశారు: కూటమి నేతలు