రాజకీయాల్లో హింసకు దారులు వేసింది జగన్ కుటుంబమే: మంత్రి పయ్యావుల
సమాజంలో జగన్ కుటుంబం నిందితులే కానీ బాధితులు కాదు, నేర రాజకీయాలు మొదలుపెట్టిందీ, కొనసాగిస్తుందీ జగన్ కుటుంబమే - వైఎస్ కుటుంబంతోనే రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయం మొదలైంది: మంత్రి పయ్యావుల కేశవ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2026 at 2:03 PM IST
Payyavula Keshav Counter To YS Jagan: వైఎస్ కుటుంబం సమాజంలో నిందితులే కానీ బాధితులు కాదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. నేరమయ రాజకీయాలకు ఆద్యులే జగన్ కుటుంబమని ఆరోపించారు. ఫ్యాక్షన్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది జగన్ తాత రాజారెడ్డి అని విమర్శించారు.
రాష్ట్రంలో నేరమయ రాజకీయాలను మొదలుపెట్టిందీ, కొనసాగిస్తున్నదీ జగన్ కుటుంబమేనని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వైఎస్ కుటుంబం సమాజంలో నిందితుల స్థానంలో ఉందని, ఎంతమాత్రం బాధితులు కారని స్పష్టం చేశారు.
ఫ్యాక్షన్‌కు ఆద్యులు వారే: రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయానికి నాంది పలికింది వైఎస్ కుటుంబమేనని మంత్రి మండిపడ్డారు. కుటుంబాలు, వర్గాలకే పరిమితమైన ఫ్యాక్షన్‌ను రాజకీయాల్లోకి విస్తరించింది జగన్ తాత రాజారెడ్డి అని ఆరోపించారు. రాజకీయాల్లో హింసకు కొత్త దారులు వేసిన కుటుంబం జగన్‌దేనని వ్యాఖ్యానించారు.
‘గొడ్డలి పార్టీ వల్ల తరాలు నష్టం’: వినేవారుంటే తమది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని జగన్ చెప్పినా చెబుతారని, అందుకే వాస్తవాలు గుర్తుచేస్తున్నామని పయ్యావుల తెలిపారు. పులివెందుల పరిణామాలపై పుస్తకం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ‘గొడ్డలి పార్టీ’ వల్ల సమాజంలో తరాలు నష్టపోతున్నాయని, అందుకే ఆ పార్టీ సమాజానికి హానికరమని చెబుతున్నామన్నారు. శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థలపై గొడ్డలి వేటు వేసిన పార్టీ కాబట్టే జగన్‌ది ‘గొడ్డలి పార్టీ’ అని ధ్వజమెత్తారు.
‘బాబాయ్ హత్య వెనుక ఎవరో చిన్న పిల్లాడూ చెప్తాడు’: తనంత మంచోడు లేడంటూ జగన్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. బాబాయ్ హత్య వెనుక ఎవరున్నారో జగన్ చెల్లితో సహా రాష్ట్రంలో నిక్కరు వేసుకున్న చిన్న పిల్లాడూ చెబుతాడని వ్యాఖ్యానించారు.
‘పొక్లెయిన్‌ను విధ్వంసానికి, చంద్రబాబు నిర్మాణానికి వాడారు’: పొక్లెయిన్లు, బుల్‌డోజర్లను జగన్ కూల్చివేతలు, విధ్వంసానికి వాడితే.. చంద్రబాబు నిర్మాణం, అభివృద్ధికి వినియోగించారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ముద్దాయిని చేసిందే జగన్‌మోహన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. తండ్రిని ముద్దాయిగా చేర్చాలని జగన్ కోర్టుకెళ్లిన విషయాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టారని గుర్తుచేశారు. రాజశేఖర్‌రెడ్డిని ముద్దాయిగా చేర్చిన న్యాయవాదికి ఉన్నత పదవి ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
'ఫ్యాక్షన్‌ను రాజకీయాల్లోకి విస్తరించింది జగన్ తాత రాజారెడ్డి. రాజకీయాల్లో హింసను కొత్త పుంతలు తొక్కించిన కుటుంబం జగన్‌ది. వినేవారుంటే స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని జగన్ చెబుతారు. పులివెందుల పరిణామాలపై పుస్తకం విడుదల చేసే యోచనలో ఉన్నాం. గొడ్డలి పార్టీ వల్ల సమాజంలో తరాలు నష్టపోతున్నాయి. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని గట్టిగా చెప్తున్నాం. అన్ని వ్యవస్థలపై గొడ్డలి వేటు వేసినందునే జగన్‌ది గొడ్డలి పార్టీ. జగన్ మంచివాడంటూ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోవటం విడ్డూరంగా ఉంది.' -పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి
జగన్‌వన్నీ అవాస్తవాలు - అబద్ధాలపై పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ: మంత్రి అచ్చెన్న
బటన్ నొక్కడం తప్పితే ఏం చేశారు? - జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలతో మావిగన్: బాలినేని

