బూట్లు, చెప్పులతో శ్రీవారి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు: నారా లోకేశ్
చెప్పులు వేసుకుని దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లినట్లు ఫొటో చూపించగలరా అని బొత్స సవాల్ - స్పందించిన మంత్రి నారా లోకేశ్ చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటో పట్టుకెళ్లిన ఫొటోలు, వీడియో విడుదల

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 3:47 PM IST
|Updated : February 20, 2026 at 4:34 PM IST
Minister Lokesh Release Video on Botsa Comments: తిరుమల వెంకన్నకు చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ మహాపరాధం చేశారని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్‌కు దేవుడంటే భయం, భక్తి లేదని, హిందువుల మనోభావాలంటే లెక్కేలేదన్నారు. వెంకన్నతో పెట్టుకోవద్దని జగన్‌కు హితవు పలికారు. హిందువుల మనోభావాలంటే లెక్కేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేసారని మండిపడ్డారు. కౌన్సిల్లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలు అక్కడే విసిరేసి వెళ్లిపోవడం క్షమించరాని పాపం అని దుయ్యబట్టారు.
తాము చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో తాము సభలోకి వెళ్లినట్లు ఒక్క ఫొటో, వీడియో అయినా చూపించగలరా అంటూ బొత్స సవాల్ చేసారు. తాము చెప్పులు విప్పి స్వామి వారి ఫొటో తీసుకెళ్లామన్నారు. దీనిపై స్పందించిన లోకశ్ చెప్పులు, బూట్లు వేసుకుని సభ లోపల, బయట వైఎస్సార్సీపీ సభ్యులు దేవుడి ఫొటో పట్టుకెళ్లిన ఫొటోలు, వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసారు. వైఎస్సార్సీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో ర్యాలీ చేయటం, సభలో ప్లకార్డుల్లా ప్రదర్శించటం వీడియోలు బట్టబయలు అయ్యాయి.
బూట్లు వేసుకుని ఫొటోను పట్టుకోలేదు: అంతకముందు మండలి బయట, లోపల ఎక్కడా తాము చెప్పులు బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫొటోను పట్టుకోలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఫొటోలను ఎక్కడా విసరలేదని, ఆందోళన అయ్యాక మళ్లీ టేబుల్‌పై ఫొటోను తానే పెట్టానని తెలిపారు. వెంకటేశ్వర స్వామిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నదే మా ఆందోళన అని బొత్స స్పష్టం చేశారు. సభ వాయిదా పడ్డాక మీడియాతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. చెప్పులు ధరించి ఫొటో పట్టుకున్నారన్న ఆరోపణలకు మేము క్షమాపణ చెప్పేది లేదన్న బొత్స చేయకూడని పని చేసినట్లు ఛైర్మన్ రూలింగ్ ఇస్తే దాన్ని పాటిస్తామన్నారు.
వైఎస్సార్సీపీపై విరుచుకుపడిన కూటమి నేతలు: దేవదేవుడికి మహాపచారం తలపెట్టారంటూ కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. వెంకటేశ్వరస్వామికి సభలో జరిగిన అవమానంపై కూటమి సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించారు. టీడీఎల్పీలో లోకేశ్ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ప్లకార్డులా దేవుడి ఫొటో వాడి మహాపచారానికి పాల్పడిన తీరును ఎన్డీఎల్పీ తీవ్రంగా ఖండించింది. విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిరసనలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, రామానాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
హిందు మతాన్ని అవమానించారని ఛైర్మన్‌కు మంత్రులు తెలిపారు. ఇలాంటి చర్యకు ఛైర్మన్‌గా ఎలా అంగీకరిస్తారని నిలదీశారు. వైఎస్సార్సీపీ చేసింది తప్పేనని మండలి చైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులను పిలిచి మాట్లాడతానని ఛైర్మన్ తెలిపారు. బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.
వారి తీరు ఎంతో కలచివేసింది: చట్టసభ సాక్షిగా వైఎస్సార్సీపీ సభ్యులు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, శాసన మండలి బీజేపీ పక్షనేత సోము వీర్రాజులు ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని రెచ్చకొట్టేలా వైఎస్సార్సీపీ ప్రవర్తించిందని మండిపడ్డారు. హద్దులు దాటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు ఎంతో కలచివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయమనం పాటించే కొద్దీ రెచ్చకొడుతున్నారని హిందువుల పట్ల వైఎస్సార్సీపీ విధానం ఇదేనా అని నిలదీశారు.
వెంకటేశ్వర స్వామి పట్ల తమ పార్టీ విధానం ఇదేనని జగన్ చెప్తున్నారా అని ప్రశ్నించారు. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పేవరకు విషయాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. సభ వాయిదా పడగానే వెంకటేశ్వరస్వామి పటాలను ప్లకార్డులతో పాటు విసిరేసి వెళ్లారని ఆయన ఆరోపించారు. చెప్పులతో వెంకటేశ్వర స్వామి పటాన్ని జగనే పంపించినట్లుందని విమర్శించారు. భారతజాతికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ డైరెక్షన్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వరస్వామిని తీవ్రంగా అవమానించారని దుయ్యబట్టారు. వేంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని నిర్లక్ష్యంగా విసిరేయటం తేలిగ్గా తీసుకునే విషయం కాదని ధ్వజమెత్తారు.
మండలిలో మహాపచారం - చెప్పులు, బూట్లు ధరించి వెంకన్న స్వామి ఫొటోతో వైఎస్సార్సీపీ ఆందోళన
ఉగాదికి ఉద్యోగాల జాతర - ఉపాధి కల్పనపై దృష్టి సారించిన మంత్రి లోకేశ్

