అలా అయితే ఫైనల్స్‌కు వెళ్తా - వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేను తీసుకెళ్తా: మంత్రి లోకేశ్
మేం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు - కిలో నెయ్యి రూ.360కు ఎక్కడ దొరికినా అది కల్తీయే - అసెంబ్లీ లాబీలో మీడియాతో నారా లోకేశ్ చిట్‌చాట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 8:28 PM IST
Minister Lokesh Chit Chats with Media in Assembly Lobby : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో సాక్షి, భారతి సిమెంట్స్ ప్రభుత్వం నుంచి రూ.1,000 కోట్లు లబ్ధి పొందాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తాము అధికారంలో ఉన్న ఇన్నేళ్లల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ది పొందలేదని స్పష్టం చేశారు. కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరికినా అది కల్తీదే అన్నారు. మార్కెట్లో కిలో నెయ్యి 1000 రూపాయలు పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీకాక మరేంటని? ప్రశ్నించారు.
ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్‌కు కో కంపెనీ అని బొత్స లాంటి సీనియర్ నాయకుడు అనటం విడ్డూరమని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. కో కంపెనీ అనేది ఉండదనే విషయం అంత సీనియర్ నేతకు తెలియదా? అని నిలదీశారు. హెరిటేజ్ పై సెబీకి నిరాధార ఫిర్యాదు ఇచ్చారని మండిపడ్డారు. టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా ఫైనల్స్‌కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తా అన్నారు.
పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయనకు టికెట్ కూడా తానే తీసుకుంటాని వెల్లడించారు. బడ్జెట్ మీద చర్చ కావాలని మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు అడగడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. చర్చ కావాలన్న వాళ్లు నాలుగు రోజులు సభను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పార్టీలో జూనియర్లు, సీనియర్లు మధ్య సమన్వయం బాగుందన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నారా లోకేశ్ చిట్ చాట్‌లో పాల్గొన్నారు.
అసెంబ్లీలో లడ్డూ కల్తీ వాస్తవాలు : లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ రేపు అసెంబ్లీలో పెడతామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని తేల్చిచెప్పారు. అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టుపెట్టి పిలవరని ఎద్దేవా చేశారు. సభకు రావటం సభ్యులుగా వారి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడిని కూడా వైఎస్సార్సీపీ రోడ్డు మీదకు తీసుకురావవటం బాధాకరమైన విషయమని మండిపడ్డారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమన్నారు.
ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ : ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. ఉగాదికి ఇచ్చే జాబ్ క్యాలెండర్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన DSCపైనా ప్రకటన ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. KGBVల్లో సిబ్బంది కొరత, జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల జీతభత్యాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి జీతాలు పెంచాలంటే కేంద్రం కూడా బడ్జెట్ పెంచాల్సి ఉందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడామని చెప్పారు.
మండలిలో ఆగని వైఎస్సార్సీపీ రచ్చ : శాసన మండలి సమావేశాల్లో వైఎస్సార్సీపీ రచ్చ ఆగడం లేదు. హెరిటేజ్ - ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చించాలంటూ ఇవాళ కూడా వైఎస్సార్సీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీన్ని ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించడంతో చర్చ చేప్టటాలంటూ ఆందోళనకు దిగారు. పోడియం చుట్టుముట్టి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఛైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా టీడీపీ సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలతో సభలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభను ఆర్డర్‌లో పెట్టాలని ఆలపాటి సహా టీడీపీ సభ్యులు పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో సభను ఛైర్మన్ వాయిదా వేశారు.
ఉగాదికి ఉద్యోగాల జాతర - ఉపాధి కల్పనపై దృష్టి సారించిన మంత్రి లోకేశ్
నేతల కుటుంబాలతో లోకేశ్ ఆత్మీయ సమావేశం - అంతా కలిసి ఒకేచోట భోజనం చేస్తూ ముచ్చట్లు

