ETV Bharat / politics

పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టనపెట్టుకున్నారు? - కుమ్మెర ఘటనపై అసెంబ్లీలో పోరాటం చేస్తాం : కేటీఆర్‌

కుమ్మెర గ్రామస్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన కేటీఆర్‌ - సమాజమే తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని ఆవేదన - సమాజంలో ఈనాటికి కులం పేరుతో దాడులు జరగటం దారుణమని వ్యాఖ్య

KTR on Kummera jathara incident
కుమ్మెర గ్రామస్థుల ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో శ్రీనివాస్ గౌడ్ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 25, 2026 at 4:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

KTR Fire on Kummera Jathara Incident in Nagarkarnool : సమాజం తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని, పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టనపెట్టుకున్నారని బీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణలో హత్యారాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్‌ కూడలి వద్ద బాధిత చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుమ్మెర గ్రామస్థుల చేస్తున్న ధర్నాకు కేటీఆర్​ మద్దతు ప్రకటించారు.

హంతకులను కాపాడటం సిగ్గుమాలిన చర్య : పసిపాప ప్రాణాలు తీసిన హంతకులకు ఎవరూ అండగా నిలబడొద్దని కేటీఆర్​ పిలుపునిచ్చారు. చిన్నారి, తల్లిదండ్రులపై దాడిచేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాధిత కుటుంబానికి అండగా నిలవకపోవటం హేయమైన చర్య అని, హంతకులను కాపాడే ప్రయత్నం చేయటం సిగ్గుమాలిన ప్రక్రియ అని మండిపడ్డారు.

8 మందిని వెంటనే అరెస్టు చేయాలి : సమాజంలో ఈ నాటికి కులం పేరుతో దాడులు జరగటం దారుణమన్న ఆయన రెండు నెలల చిన్నారికి కులం తెలుసా? మతం తెలుసా? అని ప్రశ్నించారు. హంతకుడు ఏ పార్టీవాడైనా కచ్చితంగా కఠినంగా శిక్షించాలని అన్నారు. చిన్నారి మరణానికి కారణమైన 8 మందిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.

అసెంబ్లీలో గళమెత్తుతాం : కుమ్మెర ఘటనలో నిందితులపై హత్యా నేరం కింద కేసు పెట్టాలన్న కేటీఆర్‌ బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.లక్ష, ఇల్లు కట్టిస్తామని తెలిపారు. ఈ ఘటనలో 8 మంది నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్​ చేసిన ఆయన అసెంబ్లీ సమావేశాల్లో కుమ్మెర ఘటనపై బీఆర్​ఎస్​ పార్టీ తరఫున గళమెత్తుతామని అన్నారు.

"రెండు నెలల చిన్నారికి కులం తెలుసా? మతం తెలుసా? మనం పుట్టిచ్చిన కథ కులం. మనిషి పుట్టిన తర్వాత పుట్టేది కులం, మతం. ఇవాళ దాని కోసం మనుషులను చిన్నచూపు చూసి దేవుడి దర్శనానికి రాకుండా చేసి వాళ్ల మీద దాడి చేసి, మళ్లీ వారి మీదనే కేసు పెట్టి చివరకు రోడ్డు మీదకు తెచ్చారు. 8 మంది హంతకులపై హత్యానేరం కింద తప్పకుండా అరెస్టు చేయాలి. ఏ పార్టీ వాడైనా వదిలి పెట్టొద్దు" -కేటీఆర్​, మాజీమంత్రి

పల్లె ప్రకృతి వనాలపై పగబట్టడం : రెండేళ్లుగా కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న తెలంగాణలో మనుషులనే కాదు చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్య అని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఆరోపించారు.

గ్రామాలను ధ్వంసం చేస్తున్నారు : మహబూబ్​నగర్​లోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని కేటీఆర్​ మండిపడ్డారు. పదేళ్లపాటు ఆహ్లాద వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్ని రకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం రోజుకో విధంగా బయట పడుతోందన్నారు.

చెట్లను నరికేస్తున్నారు : ఇప్పటికే నదులపై ఉన్న చెక్​డ్యామ్​లను పేల్చివేస్తున్నారని, చెరువులను చెరబట్టారని కేటీఆర్​ మండిపడ్డారు, వ్యవసాయాన్ని కుప్పకూల్చారని, కులవృత్తులను కాలరాసి ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పల్లె కన్నీరు పెడుతుందో అని మరోసారి పాడుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలోని ప్రతి పల్లె తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

మున్సిపల్‌ ఫలితాల్లో 34 చోట్ల హంగ్ ఉంది - కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోంది : కేటీఆర్

రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తారా? లేదా? - బీఆర్​ఎస్​ వ్యూహం ఏంటి? - ఆసక్తికరంగా రాజకీయ సమీకరణాలు