ETV Bharat / politics

స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులనే నిలబెట్టాలి - ఏకగ్రీవమైతే సీటు ఉండదు: జగన్​

స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులనే నిలబెట్టాలని ఆ పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్‌ సూచన - ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఉండదంటూ హెచ్చరిక

స్థానిక ఎన్నికలపై నాయకులతో జగన్​ సమావేశం
స్థానిక ఎన్నికలపై నాయకులతో జగన్​ సమావేశం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 25, 2026 at 7:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

Jagan Warns Party Leaders Regarding Local Body Elections: మాజీ సీఎం జగన్ వైస్సార్సీపీ ముఖ్య నాయకులతో తాడేపల్లిలోనే కేంద్ర కార్యాలయంలో సమావేశామయ్యారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనే అంశం అజెండాతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులనే నిలబెట్టాలని ఆ పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్‌ సూచించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఉండదంటూ హెచ్చరించారు.

ఒకరకంగా మనకు అనుకూలమే: సీఎం చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరని స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని హితబోధ చేసినట్టు సమాచారం. ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని, మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని, అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పని చేస్తాడని స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే అని నాయకులతో అన్నారు.

ఏకగ్రీవమైతే సీటు ఉండదు: జగన్​ (ETV Bharat)

"ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపాలని యోచిస్తోంది. మీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే తర్వాత ఎన్నికల్లో మీకు సీటు ఉండదు. ఆ నియోజకవర్గ నేత ఎమ్మెల్యే రేసులో ఉండరు" -జగన్​, వైఎస్సార్సీపీ అధినేత

మున్సిపల్‌ చైర్మన్‌, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌, మేయర్‌ స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని చెప్పారు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలని, ఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారు, వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దత ఇచ్చారన్న దానిపైనా నివేదికలు తెప్పించుకుంటామని పార్టీ శ్రేణులతో జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది.

గ్రూప్‌-1పై జగన్ అసత్య ప్రచారాలు - వాస్తవాలను వెల్లడించిన ప్రభుత్వం

'స్థానిక పోరుకు సిద్ధం కండి' - పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్‌ పిలుపు