ETV Bharat / politics

అరెస్టు చేస్తారని అనుమానం - అజ్ఞాతంలోకి వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ

పలు సెక్షన్‌ల కింద వంశీపై కేసులు నమోదు - పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వంశీ - పరారీ నేపథ్యంలో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

YSRCP Leader Vallabhaneni Vamsi Goes into Hiding
YSRCP Leader Vallabhaneni Vamsi Goes into Hiding (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 10:23 AM IST

3 Min Read
Choose ETV Bharat

YSRCP Leader Vallabhaneni Vamsi Goes into Hiding : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో అండర్​గ్రౌండ్​లోకి వెళ్లినట్లు తెలిసింది.

డిసెంబర్​ 17న విజయవాడ మాచవరం స్టేషన్‌లో ఐపీసీలోని 307, 324 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనే యతీంద్ర రామకృష్ణ, ఓలుపల్లి రంగా, కొమ్మా కోట్లు, ఎం. బాబు, ముల్పూరి ప్రభుకాంత్, కాట్రు శేషు, అనగాని రవి, మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న వంశీ, సునీల్‌పై దాడి చేయమని అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపర్చారని ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు.

ఫోన్​ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి: ఈ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని వంశీ హైకోర్టును ఆశ్రయించగా ఎటువంటి ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్​ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సత్యవర్దన్‌ కేసులో వాయిదాకు హాజరుకావాల్సి ఉండగా కోర్టుకు రాలేదు. వారం క్రితం అతని నివాసానికి వెళ్లి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా అందుబాటులో లేరు. సునీల్​పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన అనుచరుడు ఓలుపల్లి రంగా కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు వాయిదాకు రాలేదు. మిగిలిన అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లారు.

పలు కేసుల్లో బెయిల్‌పై విడుదలైన వంశీ తాజాగా నమోదైన హత్యాయత్నం కేసులో అరెస్టు కావాల్సి ఉంది. పరారీ నేపథ్యంలో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

మరోవైపు గన్నవరం వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం కూడా అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని గతంలో కోర్టు ఆదేశించింది. కేసు మెరిట్స్‌లోకి, పీటీ వారెంట్స్‌లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసింది. దాంతో సుప్రీంకోర్టు ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది.

ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం: గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడిన కేసులో నిందితుడు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గం పరిధిలోని గన్నవరం, బాపులపాడు, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు గనులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్లకు పైగా నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనులశాఖ అధికారి (FAC) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా వ్యక్తులకు తెలియకుండా వారి పేర్లపై ఫోర్జరీ పత్రాలు సృష్టించారు. సహజ వనరులను దోచుకున్నారని పేర్కొన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం చేపట్టిన విచారణలో వంశీ పాత్ర ఉన్నట్లు తేలిందని అన్నారు.

వంశీకి చుక్కెదురు - హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులు పక్కన పెట్టిన సుప్రీంకోర్టు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో అప్పీల్!