రాజధానిపై మళ్లీ అదే మాట - అక్కసు వెళ్లగక్కిన జగన్
అమరావతిపై మరోసారి విషం కక్కిన మాజీ సీఎం జగన్ - చంద్రబాబు, బినామీలు అమరావతిలో భారీగా భూములు కొన్నారని ఆ భూముల కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 5:48 PM IST
|Updated : January 8, 2026 at 6:57 PM IST
Former CM YS Jagan Comments on Capital Amaravati: రాజధాని అమరావతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి విషం కక్కారు. చంద్రబాబు, బినామీలు అమరావతిలో భారీగా భూములు కొన్నారని ఆ భూముల కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఆరోపించారు. చంద్రబాబు డీపీఆర్ ప్రకారమే అమరావతి అభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు కావాలని అన్నారు. మొదట సేకరించిన 50 వేల ఎకరాల కోసం రూ.లక్ష కోట్లు కావాలి ఇంకా ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. ఇంకా రూ.లక్షకోట్లు ఎక్కడి నుంచి తెస్తారో ఆ దేవుడికే తెలియాలని విమర్శించారు. మొత్తం లక్ష ఎకరాల కోసం రూ.2 లక్షల కోట్లు కావాలని అలానే మొదట తీసుకున్న 50 వేల ఎకరాలే ఇంకా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. మొదట భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఏడుస్తున్నారని జగన్ అన్నారు.
"తమ భూముల కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. నదీతీరంలో చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారని, సుప్రీంకోర్టు ఈ నదీతీర నిర్మాణాలను పరిగణనలోకి తీసుకోవాలి. నదీతీరంలో భవనం కట్టేందుకే ఎవరికీ అనుమతి ఇవ్వరని, చంద్రబాబు ఏకంగా నదీతీరంలో రాజధానే కడుతున్నారు. ఎలాంటి మౌలిక వసతులు లేని భూముల్లో రాజధాని నిర్మాణం సరికాదు." -జగన్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు
నదీ జలాల విషయంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు: వెనుబడిన రాయలసీమ జిల్లాలను సస్యస్యామలం చేసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవసరం లేదంటూ సీఎం సహా మంత్రులు మాట్లాడటం దారుణమని జగన్ అన్నారు. ప్రాజెక్టు చేపడితే ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు కేటాయించిన 101 టీఎంసీల నీటిని తరలించేందుకు సాధ్యపడుతుందని జగన్ అన్నారు. ప్రస్తుతం రాయలసీమకు కేటాయించిన 101 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి స్థాయిలో తీసుకోలేకపోతున్నామని దీనివల్ల నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేయాల్సింది పోయి స్వప్రయోజనాల కోసం సొంత రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.
తనపై గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం అసెంబ్లీలో చెప్పారని దీన్ని బట్టి రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్లు కనిపిస్తోందన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులుంటేనే పోతిరెడ్డి పాడు నుంచి నీటిని సీమకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్న జగన్ మరోవైపు 800 అడుగుల నుంచే నీటిని డ్రా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోందని అన్నారు. 775 అడుగుల నుంచే శ్రీశైలం ఎడమవైపు పవర్ హౌస్ ద్వారా రోజుకు 4 టీఎంసీ నీరు తెలంగాణ తరలిస్తోందని అలానే పలు ప్రాజెక్టు పనులు ఆపాలని ఎన్జీటీ 2021 అక్టోబర్‌లో ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు జగన్ తెలిపారు. విపత్కర పరిస్ధితుల దృష్ట్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించామని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమకు ఓ ఇన్సురెన్స్ పాలసీ లాంటిదని జగన్ అన్నారు.
చంద్రబాబు ప్రాజెక్టు అవసరం లేదన్నట్లుగా మాట్లాడి రాయసీమకు అన్యాయం చేస్తున్నారని జగన్ విమర్శించారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు రాయలసీమ లిఫ్ట్‌కు శ్రీకారం చుడితే ఆ ప్రాజెక్టు ఆపేందుకు తెలంగాణ నుంచి టీడీపీ కార్యకర్తలతో కోర్టుల్లో చంద్రబాబు కేసులు వేయించారని ఆరోపించారు. మల్యాల, ముచ్చుమర్రి, లిఫ్టుతో ఏపీ రోజుకు 0.6 టీఎంసీ నీటిని మాత్రమే తీసుకునే కెపాసిటీ ఉందన్న జగన్ రాష్ట్రానికి కేటాయించిన 101 టీఎంసీల పూర్తి నీటిని తరలించేందుకు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. ఉన్న ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని తీసుకోకపోతే చరిత్ర హీనులవుతామని ఇరు ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించేలా పాలకులు మాట్లాడటం తగదని హితవుపలికారు.
మేమొచ్చిన రెండు నెలల్లోనే వారందరీనీ జైల్లో పెడతాం : వైఎస్ జగన్

