రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చ - మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన - చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ ఆపానని రేవంత్‌రెడ్డి తెలిపారన్న బొత్స - ఆందోళనతో మండలి సమావేశం కాసేపు వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 5:09 PM IST
Fight between YSRCP and TDP Leaders in Legislative Council : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై శాసన మండలి దద్దరిల్లింది. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో మండలి అట్టుడికింది. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్‌పై వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఆపిందని, రాయలసీమ వాసిగా ఉన్న సీఎం చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేశారని, తెలంగాణ ప్రభుత్వంలో లాలూచీ పడి ప్రాజెక్టు ఆపారన్న వైఎస్సార్సీపీ సభ్యుడు ఇసాక్ బాష ఆరోపించారు.
రాయలసీమలో దుర్భిక్షమైన కరవు పరిస్ధితులున్నాయని తెలిసినా సీఎం పట్టించుకోవడంలేదని, రాయలసీమ ఎత్తిపోతల అవసరమే లేదని సీఎం చెప్పడం దారుణమన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీరామసుబ్బారెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతలను తామే ఆపామని తెలంగాణ సీఎం చెబుతున్నారన్న రామసుబ్బారెడ్డి దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఆరోపణలపై మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ధీటుగా సమాధానం ఇచ్చారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీ సభ్యులకు లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
రాయలసీమకు నిజమైన ద్రోహి వైఎస్ జగన్ : వైఎస్సార్సీపీ సభ్యుల ఆరోపణలపై మంత్రి నిమ్మల విరుచుకుపడ్డారు. జగన్ సీఎంగా ఉండగానే రాయలసీమ లిఫ్ట్‌ను ఎన్టీటీ ఆపిందని, జరిమానా కూడా విధించిందని వివరించారు. ఐదేళ్లపాటు ప్రాజెక్టు గురించి కనీసం పట్టించుకోని వైఎస్సార్సీపీ జగన్‌ను నిలదీయకుండా ఇప్పుడు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రాయలసీమకు నిజమైన ద్రోహి వైఎస్ జగన్ అని ధ్వజమెత్తిన నిమ్మల జగన్ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులన్నీ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, రాయలసీమకు నీరిచ్చేందుకు ఒక్క ప్రాజెక్టునూ జగన్ చేపట్టలేదని ఆక్షేపించారు.
రాయలసీమ లిప్ట్ ఫథకం సాగునీరు కోసం కాదు, తాగునీటి కోసమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు 18న 364 జీవో సహా అఫిడవిట్ ఇచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా వివరించారు. రాయలసీమకు ఏ సీఎం చేయని ద్రోహం వైఎస్ జగన్ చేశారని మండిపడ్డారు. ఐదేళ్లలో ఎక్కడా తట్టెడు మట్టి పని చేయలేదు, మోటార్ల బిల్లులూ కట్టకుండా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్‌పై మంత్రి నిమ్మల ఇచ్చిన సమాధానంపై వైఎస్సార్సీపీ సభ్యుల అసంతృప్తి వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ పట్టు : చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ ను ఆపానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని, రేవంత్ రెడ్డిని చెప్పిన ప్రకటనపై మంత్రులు ఎక్కడా సమాధానం ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి ప్రకటనపై సభలో ప్రకటన చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తూ పట్టుబట్టడంతో సభను కాసేపు వాయిదా పడింది. సభ ప్రారంభమయ్యాక గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రాగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి సమాధానానికి వైఎస్సార్సీపీ సభ్యుల పట్టు పట్టారు.
విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 2020లో ఎన్జీటీకి వెళ్లి రాయలసీమ ఎత్తిపోతలను మేమే ఆపామని బీఆర్ఎస్ హరీష్ రావు తెలిపారని మంత్రి నిమ్మల తెలిపారు. అప్పటి సీఎం జగన్‌తో కేసీఆర్ మాట్లాడి ప్రాజెక్టు నిలిపామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేసిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఏది కావాలన్నా చేయించుకో నీళ్లు మాత్రం అడగవద్దని జగన్‌తో తాము చెప్పినట్లు హరీష్ రావు తెలిపారు.
కోర్టులో అఫిడవిట్ వేస్తే మేము సమాధానం చెప్పాలా? : మంత్రి సమాధానంపై బొత్స అసంతృప్తి వ్యక్తం చేయగా మంత్రిపయ్యావుల ఘాటుగా స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో తప్పంతా వైఎస్సార్సీపీ దేనన్న పయ్యాపుల ప్రాజెక్టు ఆపి తప్పు చేసింది ఎవరో వారు తెలుసుకోవాలని సూచించారు. జగన్‌తో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్‌పై తామే స్టే తెచ్చామని తెలంగాణ రాష్ట్ర శాసన సభ వేదికగా హరీష్ రావు తెలిపారు. చేతకాని వైఎస్సార్సీపీ దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు ఆపితే చేతకాకుండా కోర్టుకు వెళ్లి అఫిడవిట్ వేస్తే దానికి మేము సమాధానం చెప్పాలా? అని నిలదీశారు. గందరగోళం చెలరేగడంతో మండలి ఛైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు.
మరోవైపు ఏపీలో లైన్ మెన్ల నియామకంపై మండలి సభ్యులు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది చాలా అవసరమని తెలిపారు. క్షేత్ర స్థాయి విద్యుత్ అవసరాల కోసం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌లో నియమించుకున్నామని వెల్లడించారు. 18 వేల మంది మూడు డిస్కంల పరిధిలో వివిధ పద్ధతుల్లో నియామకమై పని చేస్తున్నారన్నారు.
త్వరలో నియామకాలను పూర్తి చేస్తాం : 5,580 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి వారి సర్వీసులను ఉపయోగించుకుంటామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఏఈల కొరతపై సీఎం దృష్టికి తీసుకెళ్లామన్న మంత్రి, నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్నామన్నారు. ఆర్డీఎస్ఎస్ ద్వారా ఫీడర్ బైఫరికేషన్ చేసి వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ ఇస్తామని తెలిపారు.
ఆర్డీఎస్ఎస్ పనుల కోసం సుమారు రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. 70 శాతం ఆర్డీఎస్ఎస్ పనులు ఇప్పటికే పూర్తి చేశామని,
ఏప్రిల్ నాటికి వంద శాతం ఆర్డీఎస్ఎస్ పనులు పూర్తి చేస్తామన్నారు. వైజాగ్‌లో తుపానులను తట్టుకునేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ నిర్మిస్తున్నామని వివరించారు. వరదల సమయంలో డిస్కంలకు అతీతంగా సిబ్బంది పని చేసి అంతరాయాలు లేకుండా చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు.
మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల హంగామా - పోడియం వద్ద ఆందోళన చేస్తూ విజిల్స్
మండలిలో ఉద్రిక్తత - ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ సభ్యులు

