ETV Bharat / politics

'అలాంటి నిబంధన పెట్టడం దేశ చరిత్రలోనే తొలిసారి' - వైఎస్సార్సీపీ తీరుపై ఎథిక్స్ కమిటీ ఫైర్

అసెంబ్లీ కమిటీ హాల్‌లో మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన నైతిక విలువల కమిటీ సమావేశం - సమావేశానికి హాజరైన కమిటీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు

Ethics Committee Meeting Decisions
Ethics Committee Meeting Decisions (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 7, 2026 at 4:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ethics Committee Meeting Decisions : ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా, ఇస్తేనే సభకు వస్తామని నిబంధన పెట్టడం దేశ చరిత్రలోనే తొలిసారని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన నైతిక (ఎథిక్స్) విలువల కమిటీ అసెంబ్లీ కమిటీ హాల్​లో సమావేశం అయ్యింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ సభకు గైర్హాజరుపై ప్రధానంగా చర్చ జరిగింది. అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరించటంపై సమావేశంలో చర్చించారు. దీనిపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకనుగుణంగా చర్యలు తీసుకుందామని వెల్లడించారు.

సభను అవమానిస్తూ గైర్హాజరు అవుతున్న తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు తొలుత నోటీసులు ఇద్దామని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. నైతిక విలువలు పాటించకుండా గైర్హాజరవుతున్న ఎమ్మెల్యేలను ఎథిక్స్ కమిటీ ముందుకు పిలిచి వివరణ కోరదామన్నారు. సభ్యుల వివరణ కూడా తీసుకున్నాక, నిపుణులు ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకెళ్తే బాగుంటుందన్న అభిప్రాయపడ్డారు. ఇద్దరు సభ్యుల ప్రతిపాదనలు తీర్మానం చేసి తదుపరి భేటీలో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు సమావేశానికి హాజరైయ్యారు.

అంతవరకు శాసనసభకు వెళ్లేది లేదు : ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభకు వెళ్లేది లేదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే! అంతవరకూ తానే కాదు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లనవసరం లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ‘ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు’ అని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా, జగన్‌ వారికి పెద్ద క్లాస్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ‘మనమేమీ సభకు శాశ్వతంగా వెళ్లం అనడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే వెళతాం. 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించరా?

అలా గుర్తించకుండా సభకు వెళితే మామూలు ఎమ్మెల్యేకిచ్చినట్లు రెండు నిమిషాలు మైక్‌ ఇస్తామంటే ప్రజా సమస్యలను అక్కడ ఏం చెప్పగలను? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశాం. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్‌ తీసుకోలేదు’ అని ఆయన అన్నట్లు తెలిసింది. ‘సభకు ఒకసారి వెళ్లి చూస్తే మేలు. వెళ్లాక కూడా మైక్‌ ఇవ్వకపోతే అప్పుడే అసెంబ్లీకి రామంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు’ అని ఎమ్మెల్యేలు అభిప్రాయపడగా ‘వాళ్లు మైక్‌ ఇవ్వరు. అంతదానికి వెళ్లడమెందుకు’ అని జగన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు : మరోవైపు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని వైఎస్సారీసీ అధ్యక్షుడు జగన్‌ కోరుతున్నారని, అందుకు అవసరమైన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి లేరని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ విషయంపై అన్ని రాష్ట్రాల స్పీకర్లు, రాజ్యాంగ నిపుణులతో చర్చించానని, నిర్ణీత సంఖ్య కన్నా తక్కువ సీట్లున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. అందువల్ల వైఎస్సార్సీపీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.

అలాగే ‘‘జగన్‌ బయట మైకులు పట్టుకుని మాట్లాడడం కాదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ఆయనకు అక్కడ తగినంత సమయం ఇస్తాం. వైఎస్సార్సీపీ హయాంలో నన్ను అరెస్టు చేయించారు. ఆ కారణంగా అసెంబ్లీలో అధ్యక్షా అని నన్ను సంబోధించడానికి నోరురాక జగన్‌ వెనక్కి జంకుతున్నారు. అసెంబ్లీ ఓ దేవాలయం. అందులో నేను పూజారిని మాత్రమే’’ అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

అమరావతిలో మాక్​ అసెంబ్లీ - నాయకుల్లా అదరగొట్టిన విద్యార్థులు

సమాజహితం కోసం ఎన్నికైన వాళ్లకు వ్యక్తిగత అజెండాలు సరికాదు: సీఎం చంద్రబాబు