లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్షపడాల్సిందే: పవన్ కల్యాణ్
కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో లఘు చర్చ - రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న పవన్ - లడ్డూలో నెయ్యి లేదని తేలిపోయింది - దోషులు ఎవరైనా సరే శిక్షపడాల్సిందేనని స్పష్టం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 2:39 PM IST
|Updated : February 24, 2026 at 2:53 PM IST
DY CM Pawan Kalyan On Adulterated Ghee Issue In Assembly: లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్షపడాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈ రోజు అసెంబ్లీలో లఘు చర్చ చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ దేవాలయాల పరిరక్షణకు సనాతన బోర్డు ఉండాలని తాను కొంతకాలంగా చెబుతున్నానని గుర్తు చేశారు. గత పాలకులు నెయ్యే లేకుండా రసాయనాల మిశ్రమాన్ని తిరుమలకు సరఫరా చేశారని అన్నారు. రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని వెల్లడించారు. కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారని ఎద్దేవా చేశారు.
బాధ్యులపై చర్య తీసుకుంటే సరిపోయేది: గత ప్రభుత్వాధినేతే ఈ కల్తీ చేశాడని నేను ఎక్కడా చెప్పలేదని పవన్ స్పష్టం చేశారు. కానీ అసలు లడ్డూలో కల్తీయే జరగలేదని వైఎస్సార్సీపీ నేతలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అప్పటి టీటీడీ పాలక మండలి తన బాధ్యత నిర్వహణలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ వ్యవహారంలో తప్పు జరిగిందని ఒప్పుకుని బాధ్యులపై చర్య తీసుకుంటే సరిపోయేదని స్పష్టం చేశారు. అలాంటిది పాత టీటీడీ బోర్డును ఎందుకు వెనకేసుకొస్తున్నారంటూ పవన్ ప్రశ్నించారు.
గత ప్రభుత్వాధినేత నియమించిన బోర్డు హయాంలోనే తప్పు జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ తేల్చి చెప్పారు. తప్పు జరిగిందని ఒప్పుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెబితే సరిపోయేదని వివరించారు. అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదని వైఎస్సార్సీపీ నేతలు చెప్పడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు పథకం ప్రకారం కుట్ర జరిగిందని సిట్ ఇప్పటికే తేల్చిందని అన్నారు.
లక్ష లడ్డూలు అయోధ్యకు: నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చుకునేందుకే గతంలో నిబంధనలను సడలించారని పేర్కొన్నారు. సుమారు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని తేలిందని తెలియజేశారు. కల్తీ నెయ్యితో తయారైన లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అసెంబ్లీ వేదికగా నిజానిజాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ లఘ చర్చను ఏర్పాటు చేశామని తెలిపారు.
టీటీడీ పాత బోర్డును వెనకేసుకొస్తున్నారంటే మీకూ భాగం ఉన్నట్టేకదా? అని డిప్యూటీ సీఎం వైఎస్సార్సీపీకి చురకలంటించారు. అంతేకాకుండా కల్తీ నెయ్యి కేసులో దోషులు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా శిక్ష పడాల్సిందేనని పవన్ వివరించారు. కల్తీనెయ్యిలో ఏ రసాయనాలు ఉన్నాయో ఆ పెరుమాళ్లకే తెలియాలని తెలియజేశారు.
ఇది ధర్మానికి సంబంధించిన అంశం: జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ ఇప్పటికే రిపోర్టు చెప్పిందని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. ఆ నెయ్యి నెయ్యే కాదని సీబీఐ స్పష్టంగా రిపోర్టులో చెప్పిందని గుర్తు చేశారు. ఇది ధర్మానికి సంబంధించిన అంశమని పవన్ అన్నారు. అయితే వెంకటేశ్వరుడికి కాకుండా వేరే ఏ మతానికో ఇది జరిగి ఉంటే దేశం గగ్గోలు అయ్యేదని పవన్ తెలిపారు. సకల మతాలను గౌరవించడం ఈ దేశ సంస్కృతి అని కొనియాడారు.
ఒకవేళ వేరే మతాలకు గానీ ఇలా జరిగితే వైఎస్సార్సీపీ వాళ్లు మొన్నటిలా పటాలు తీసుకుని వచ్చేవారు కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రతి హిందువు ధర్మ రక్షణకు బాధ్యత తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. మిగతా మతాలను చూసి హిందువులు నేర్చుకోవాలని డిప్యూటీ సీఎం హితవు పలికారు.
"గత ప్రభుత్వాధినేత నియమించిన బోర్డు హయాంలోనే తప్పు జరిగింది. కల్తీ నెయ్యి కేసులో దోషులు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా శిక్ష పడాల్సిందే. ఇది ధర్మానికి సంబంధించిన అంశం. సకల మతాలను గౌరవించడం ఈ దేశ సంస్కృతి. జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పింది". -పవన్ కల్యాణ్,డిప్యూటీ సీఎం
క్షమాపణ అడగకుండా ఎదురుదాడి - భగవంతుడి ముందు మోకరిల్లే వరకు వదలం: పవన్‌కల్యాణ్
లడ్డూ తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు - జంతువుల కొవ్వు లేదని నిర్ధరణ కాలేదు: బీఆర్ నాయుడు

