ETV Bharat / politics

రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా బడ్జెట్‌ - అసెంబ్లీలో సభ్యుల ప్రశంసలు

బడ్జెట్‌పై శాసనసభలో రెండో రోజూ కొనసాగిన చర్చ - రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా, సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్‌ ఉందని సభ్యుల ప్రశంసలు

debate_on_budget
debate_on_budget (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 7:29 PM IST

3 Min Read
Choose ETV Bharat

Debate on Budget in AP Legislative Assembly: విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ, సాగునీటి రంగానికి సరైన ప్రాధాన్యత ఇస్తూ, రైతు సంక్షేమానికి పట్టం కడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తూ, క్వాంటం వ్యాలీ వంటి ఆధునిక సాంకేతికతకు ఆహ్వానం పలుకుతూ, అమరావతి నిర్మాణానికి చేయూత అందిస్తూ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్ ఉందని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు అన్నారు. బడ్జెట్​పై శాసనసభలో రెండోరోజు చర్చలో మాట్లాడిన ఎమ్మెల్యేలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా బడ్జెట్‌ ఉందని ప్రశంసలు కురిపించారు.

బడ్జెట్​పై అసెంబ్లీలో రెండోరోజున చర్చ కొనసాగింది. 10 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు రెండో రోజు చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతులకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారని అన్నారు. పల్లెజనానికి బడ్జెట్ ద్వారా భరోసా కల్పించారని తెలిపారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఎంపీ ల్యాడ్స్ తరహాలో నిధులు కేటాయించాలని సూచించారు. కేంద్ర నిధులు, సీఎస్సార్ నిధులు, దాతల సహకారం కూడా తీసుకుని సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు.

కడప ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ రాయలసీమలో సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు చేయటం వల్ల ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. జగన్ 5 ఏళ్లలో 1000 కోట్లు కూడా రాయలసీమ సాగునీటికి ఇవ్వలేదని కూటమి కేవలం ఒక్క ఏడాదిలో రూ.8000 కోట్లు కేటాయించటాన్ని స్వాగతించారు. రాష్ట్ర పునర్నిర్మాణం, పురోభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం అన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లా ఉన్నారని వ్యాఖ్యానించారు. పరిపాలన ఎలా చేయకూడదో జగన్ నిరూపించారని ఇంక విధ్వంసంతో నాశనం చేశారని విమర్శించారు. అన్ని రంగాల అభివృద్ధికి బడ్జెట్ చేయూతనిచ్చిందని అన్నారు.

నదుల అనుసంధానంలో ఎంతో మేలు: వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కపని కూడా సరిగా పూర్తి చేయలేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్నింటిని వేగంగా పూర్తి చేస్తోందని ఇప్పుడు వైఎస్సార్సీపీ వాళ్లు క్రెడిట్ చోరీ అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని కిసాన్ సెజ్ కార్యకలాపాల ప్రారంభించటం సంతోషంగా ఉందని తెలిపారు. బిల్ గేట్స్ వంటి ప్రముఖుల్ని ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యుల్ని చేశారని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుందనే సామెతను నిజం చేస్తూ విద్యా రంగానికి అధిక బడ్జెట్ కేటాయించిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నాసిరకం మద్యం కారణంగా ప్రజారోగ్యం పాడైపోయిందని వారికి మంచి వైద్యం అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

నదుల అనుసంధానంలో భాగంగా పెన్నా గోదావరి ప్రాజెక్టుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, ఉచిత సిలండర్లు వంటి పథకాలతో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసేలా ఈ బడ్జెట్ ఉందని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. మహిళలకు ఆర్థిక సహాయం కోణంలో కాకుండా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం పెంచేలా కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. నిజమైన మహిళా సాధికారత చంద్రబాబుతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై చర్చ గురువారం కూడా కొనసాగనుంది. సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సమాధానం ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా బడ్జెట్‌పై ప్రసంగిస్తారు.

విద్యార్థులకు పోలవరం ప్రాజెక్టు వీక్షించే అవకాశం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

నగరాలు, పట్టణాల్లో ఖాళీ భూముల పన్ను తగ్గింపు - చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు శాసనసభ ఆమోదం