''రాజీనామాపై వివరణ ఇవ్వండి'' - వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ నోటీసులు
రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన మండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు - తన ముందు హాజరై సరైన వివరణ ఇవ్వాలని స్పష్టం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 2:58 PM IST
|Updated : February 23, 2026 at 4:19 PM IST
Council Chairman Notices To Resigned YSRCP MLCs: తమ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు నోటీసులు జారీ చేశారు. తన ముందు హాజరై రాజీనామాకు కారణాలపై సరైన వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈనెల 25వ తేదీన ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ, 26వ తేదీన ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, 27న ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీకి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేస్తూ లేఖలు పంపినా వాటిని ఆమోదించకుండా చాలా కాలంగా మండలి ఛైర్మన్ పెండింగ్‌లో పెట్టారు. అయితే వీటిని ఆమోదించాలని ఎమ్మెల్సీలు పలుమార్లు సభలో ప్రస్తావించడం సహా, వ్యక్తిగతంగా ఛైర్మన్‌ను సైతం కలిసి విజ్ఞప్తి చేశారు. తాము ఇష్టపూర్వకంగానే పదవులకు రాజీనామా చేశామని, రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ఈ పరిస్ధితుల్లో రాజీనామాలపై అధికారికంగా వివరణ తీసుకునేందుకు సభ్యులకు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత రోజుల్లో తాము ఛైర్మన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.
మర్రి రాజశేఖర్: వైఎస్సార్సీపీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ 19 మార్చి 2025న రాజీనామా చేశారు. శాసన మండలి ఛైర్మన్ మోషేనురాజును కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ పదవీకాలం 2029 వరకూ ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేశారు.
జయమంగళ వెంకటరమణ: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ 2024 నవంబర్ 23న ఎమ్మెల్సీ పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని అప్పుడే శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజుకు అందజేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. వైఎస్సార్సీపీలో ఇమడలేకపోయానని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన ఆ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆ పార్టీ నాయకులు ఏమాత్రం సహకరించలేదని అప్పట్లో వెంకటరమణ వాపోయారు.
పోతుల సునీత రాజీనామా: 28 ఆగష్టు 2024న వైఎస్సార్సీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేఖ పంపారు. ఎమ్మెల్సీ రాజీనామా లేఖను శాసనమండలి కార్యదర్శికి అందజేశారు. పోతుల సునీత శాసన మండలికి 2021లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 24 మార్చి 2021న శాసన మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ: 28 ఆగష్టు 2024న కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్లి కల్యాణ్ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. కాగా వీరిద్దరూ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజును కలిశారు. రాజీనామా పత్రాలను సమర్పించారు. ఛైర్మన్ వారిద్దరి రాజీనామా పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు పంపారు. చక్రవర్తికి 3 ఏళ్లు, పద్మశ్రీకి మరో 5 ఏళ్లు వరకు పదవీకాలం ఉన్నప్పటికీ వారిద్దరూ రాజీనామా చేశారు. ‘గౌరవం, విలువలేని చోట ఉండలేం’ అని వైఎస్సార్సీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినట్లు అప్పట్లో వారు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
లడ్డూ కల్తీ వ్యవహారంపై అట్టుడికిన మండలి - ఇరువురి వాదోపవాదాలతో గందరగోళం
దద్దరిల్లిన శాసన మండలి - పోడియం చుట్టుముట్టి వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన

