రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కేంద్రబిందువుగా 'కాళేశ్వరం' - సాంకేతిక విశ్లేషణ, ప్రభుత్వ చర్యలపై పార్టీ నేతలకు అవగాహన
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన అజెండాగా సమావేశం - సాంకేతిక విశ్లేషణ, ప్రభుత్వ చర్యలపై పాలక పక్ష నాయకులకు మంత్రి ఉత్తమ్‌తో అవగాహన - సాంకేతిక ఆధారాలతో పార్టీ శ్రేణులను సిద్ధం చేసే వ్యూహాలు

Published : July 7, 2026 at 8:09 AM IST
CM Revanth Reddy Meeting on kaleshwaram Project : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర బిందువుగా మారింది. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదికలు, బ్యారేజీల పరిస్థితిపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రజాభవన్ వేదికగా ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, పరిపాలనా, రాజకీయ అంశాలపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకోనున్నారు.
అందరూ ఒకే వివరణ ఇచ్చేలా : ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి, ఎన్డీఎస్ఏ అధ్యయనాలు, నివేదికల్లో ప్రస్తావించిన అంశాలు, సాంకేతిక విశ్లేషణ, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ఇటీవల కాళేశ్వరం అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులందరూ ఒకే సమాచారంతో, ఒకే విధమైన వివరణతో ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణం నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు సాంకేతిక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే అవకాశం ఉంది.
అధికారిక రిపోర్టుల ఆధారంగా : కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదికలు, సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ తన వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కేవలం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం కాకుండా, సాంకేతిక ఆధారాలు, అధికారిక నివేదికల ఆధారంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటి వరకు కాళేశ్వరం అంశంపై ప్రభుత్వ స్పందన ప్రధానంగా అసెంబ్లీ, మీడియా సమావేశాలకే పరిమితమైంది. అయితే పార్టీ కేడర్ మొత్తానికి ప్రత్యేకంగా సాంకేతిక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం : ఎన్డీఎస్‌ఏ నివేదికల్లో ప్రస్తావించిన అంశాలు, మూడు బ్యారేజీల్లో గుర్తించిన లోపాలు, వాటికి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న వివరణ, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలు, మరమ్మతుల అవసరం, ఆర్థిక భారం ప్రభావం వంటి అంశాలను నేతలకు వివరించనున్నట్లు సమాచారం. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా స్పందించాలి? ప్రతిపక్ష విమర్శలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనే అంశాలపైనా పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి స్పందన : ఈ సమావేశం అనంతరం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు ఒకే విధమైన సమాచారంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి సమన్వయంతో కూడిన రాజకీయ ప్రతిస్పందన ఇవ్వడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
కేసీఆర్‌కు కాళేశ్వరం వారం రోజులు అప్పగిస్తే తెలంగాణ మెుత్తం నీరు అందిస్తారు: కేటీఆర్
కన్నెపల్లికి చేరుకున్న కేటీఆర్ - పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

