ETV Bharat / politics

ప్రభుత్వం, పార్టీ కోసం ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే : సీఎం రేవంత్ ​రెడ్డి

రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం - పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ముఖ్యమంత్రి - వచ్చే పది రోజుల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు

CM Revanth Key Message on PAC Meeting
CM Revanth Key Message on PAC Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 8:15 AM IST

3 Min Read
Choose ETV Bharat

CM Revanth Key Message on PAC Meeting : పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. ప్రభుత్వం, పార్టీ రెండూ సమాంతరంగా బలోపేతం కావాలంటే ప్రతి నాయకుడు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇకపై వారంలో ఒక రోజు మంత్రులు ప్రభుత్వ విధులకు విరామం ఇచ్చి, పూర్తిగా పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు ఇచ్చే ఆదేశాలు అందరికీ శిరోధార్యమని, తాను కూడా అదే విధంగా పాటిస్తానని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు ఏ నియోజకవర్గానికి పంపితే అక్కడికి వెళ్లి పార్టీ పనుల్లో పాల్గొంటానని ప్రకటించారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత బలోపేతం, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్ వేదికగా జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, కమిటీలోని సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సర్​ ప్రక్రియపై సుదీర్ఘ చర్చ జరిగింది.

సోషల్‌ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ : మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నాయకులు ప్రతి వారం ఒక నియోజకవర్గంలో పార్టీ బలోపేత కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. "సోషల్‌ మీడియాలో వ్యక్తిగత ప్రచారమేనా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పరా" అంటూ ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లలా తయారయ్యారని ఆరోపించారు. పార్టీ కోసం సోషల్‌ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నది పూర్తిగా పీసీసీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఇకపై 10 రోజులకోసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై పార్టీ నాయకులంతా సమన్వయంతో పని చేయాలని, నేతలు క్షేత్రస్థాయికి వెళ్తేనే కార్యకర్తలు, పోలింగ్‌ బూత్‌ స్థాయిలో పని చేస్తారని చెప్పారు.

పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలి : ఇవాళ్టి నుంచే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులకు నియోజకవర్గాల కేటాయింపు ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్ తెలిపారు. “సంఘటన్ సృజన్ అభియాన్‌"లో భాగంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. కొత్త డీసీసీల ఎంపిక, జిల్లా కమిటీలు, మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటికే 90కి పైగా నియోజకవర్గాల్లో బీఎల్​ఏల నియామకం పూర్తయిందన్నారు. సర్​ అంశంపై లోతైన దృష్టి పెట్టాలని పీసీసీ చీఫ్‌ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో లక్షలాది ఓట్లు తొలగించిన తరహా రాజకీయ కుట్రలను తెలంగాణలో అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బెంగాల్ తర్వాత పంజాబ్‌, తెలంగాణలను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవల్ ఏజెంట్లకు వచ్చే పది రోజుల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఓటర్లకు అవగాహన కల్పించాలి : సమావేశంలో ప్రధాన అజెండాగా సర్​పై​ విస్తృత స్థాయిలో చర్చ జరిగినట్లు మంత్రులు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా, రాజ్యాంగ బద్ధంగా జరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్​ దృష్ట్యా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ శ్రేణులు అంతా అప్రమత్తంగా ఉండి ఓటర్లకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతోంది - పీసీసీ చీఫ్ ఆరోపణ

హైదరాబాద్ పరిధిలో ఎంఐజీ, ఎల్​ఐజీ ఫ్లాట్లు నిర్మించేందుకు సర్కార్ గ్రీన్​సిగ్నల్