ETV Bharat / politics

44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లు - టీడీపీ కార్యకర్తలెవరికీ భయపడరు: సీఎం చంద్రబాబు

టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం - కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశాం - సీనియారిటీ, సిన్సియారిటీతో కమిటీ ఏర్పాటు చేశామన్న చంద్రబాబు

CM_Chandrababu_Speech
CM_Chandrababu_Speech (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 29, 2026 at 1:01 PM IST

|

Updated : April 29, 2026 at 2:35 PM IST

4 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Speech at TDP Swearing in Ceremony: టిక్కెట్ ఇచ్చిన వారి వెంటే కార్యకర్తలు ఉంటారనే విషయం ప్రతీ లీడరూ గుర్తు పెట్టుకోవాలి, ఇదే టీడీపీ స్పెషాల్టీ అని తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పర్మిషన్లతో పదవులు ఇవ్వమని, పని చేసిన వారికే పదవులిస్తామని తెలిపారు. నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవరిస్తే ప్రజలు హర్షించరని చెప్పారు. గతంలో పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూశామని, అయితే ప్రజలు ఆ పార్టీకి బుద్ది చెప్పారని గుర్తు చేశారు. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్​మెంట్​లకు దూరంగా ఉందామని సీఎం పిలుపునిచ్చారు.

44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లు - టీడీపీ కార్యకర్తలెవరికీ భయపడరు: సీఎం చంద్రబాబు (ETV)

మనకు ప్రజలు సహకరించారు, నమ్మకం పెట్టుకున్నారు. అలానే ప్రజలు మనల్ని గమనిస్తుంటారని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎవరైనా అధికారం ఉందని ఇగోలకు పోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుందని తెలిపారు. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదని, ఫ్లెక్సీలు, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దని హితవుపలికారు. సత్ప్రవర్తనను నేతలు తమ కింద వాళ్లకు కూడా నేర్పించాలని సూచించారు. అనునిత్యం పని చేయడంతోపాటు పార్టీ క్రమశిక్షణను కూడా కాపాడాలని నేతలకు సూచించారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండొద్దని, మళ్లీ మళ్లీ ఎన్నిక కావాలని సీఎం ఆకాంక్షించారు. తెలుగుదేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. మళ్లీ వైకుంఠపాళి అయితే రాష్ట్రానికి నష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది అత్యున్నత బాధ్యత: లోకేశ్​ సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించామని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తే అధినేత అనేది నినాదాన్ని విధానంగా మార్చుకున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో లోకేశ్​ చాలా కీలక పాత్ర పోషించారని, ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదని అత్యున్నత బాధ్యత అని చంద్రబాబు తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్​లో మనం బలం పెరగాలని, 2024లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు రావాలని తెలిపారు. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ ఇంజినీరింగ్​తో నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నామన్నారు. కేంద్రమంత్రి అయిన రామ్మోహన్ నాయుడు కార్యకర్త స్థానంలో కింద కూర్చుంటే, కార్యకర్త స్థాయి నుంచి పొలిట్ బ్యూరోకి వచ్చిన వారు వేదికపై కూర్చోవటం పార్టీ ఘనతగా చంద్రబాబు అభివర్ణించారు.

కార్యకర్తలు పడ్డ కష్టాలు గుర్తున్నాయి: సీనియర్లను గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశాలు ఇస్తూ కష్టపడిన వారికి కమిటీల్లో చోటిచ్చామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 4 దశాబ్దాల నుంచి కమిటీలపై కసరత్తు చేశానని కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ చేయలేదని తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మేలేస్తారని, ఎవ్వరికీ తలవంచరని అన్నారు. మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చామని అలానే చదువుకున్న వారికి మంత్రి పదవులిచ్చి ప్రొత్సహించామని తెలిపారు. రామ్మోహన్నాయుడు, శబరి, రాజేష్ వంటి వారిని జాతీయ ఉపాధ్యక్షులుగా చేసుకున్నామన్నారు. 2024కు ముందున్న పరిస్థితులన్నీ అందరికీ తెలుసన్న చంద్రబాబు ప్రతి ఘటనా ప్రతి ఒక్కరి పోరాటం తనకు గుర్తుందని అలానే కార్యకర్తలు పడ్డ కష్టాలు తనకు గుర్తున్నాయని చంద్రబాబు అన్నారు.

నేను పవన్ చక్కగా ఉంటున్నాం: ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయని వాటి గురించి తాను చాలా బాధపడ్డానని చంద్రబాబు అన్నారు. నేతలు, కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. తాను-పవన్ కల్యాణ్ చక్కగా ఉంటున్నామని మంచి రిలేషన్ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇదే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రం-కేంద్రానికి గ్యాప్ లేదు, రాకూడదని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామ స్థాయి కార్యకర్తలు దీన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు క్రమశిక్షణతో పని చేయడం పార్టీ మూల సిద్దాంతమన్నారు. ప్రజలతో సౌమ్యంగా ఉంటూ అందుబాటులో ఉండాలని నేతలకు సూచించారు.

రాజకీయ నేతలతో పోరాడాను కానీ నేరస్థులతో పోరాడలేదు: మనది అభివృద్ధి వాళ్లది అవినీతి, మనది వికాసం వాళ్లది విధ్వంసమని సీఎం అన్నారు. మనం రిలాక్స్ అయితే అబద్దాలు ప్రపంచమంతా తిరుగుతాయని, అందుకే ప్రజలను నిత్యం అప్రమత్తం చేయలని నేతలకు సూచించారు. సొంత బాబాయి వివేకాను హత్య చేసి ఆ నిందను మనపై నెట్టారని గుర్తుచేశారు. వాళ్ల కార్యకర్తను కారుతో తొక్కించి ఆ పాపాన్ని మనపైకే నెట్టారని ఆరోపించారు. కబ్జా చేసిన ఆస్తుల కోసం కడపలో అనుచరుడినే చంపేశారని, వాస్తవాలు బయటపడితే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తన జీవితంలో రాజకీయ నేతలతో పోరాడాను కానీ నేరస్థులతో పోరాడలేదని తెలిపారు. తొలిసారిగా నేరస్థులతో పోరాడుతున్నామని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించారు.

ఓసీడీ అనే వ్యాధి తరహాలో గొడ్డలి పార్టీకి సీసీడీ అనే వ్యాధి సోకిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదని అభివృద్ధి గిట్టదని మండిపడ్డారు. క్రెడిట్ చోరీ డిజార్డర్​తో గొడ్డలి పార్టీ అనారోగ్యానికి గురైందన్న సీఎం వీళ్లని ఇలాగే వదిలేస్తే దేశానికి స్వాతంత్య్రం కూడా తామే తెచ్చామని చెప్తారని అన్నారు. గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాలని నేతలకు సూచించారు. అధికారంలో ఉండగా నాశనం చేసింది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తున్నారన్నారు. వారు అడ్డుపడుతున్నా మనపై విశ్వాసంతో పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని తెలిపారు.

ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు: వెంటిలేటర్ మీదున్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సాయంతో గట్టెక్కిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అలానే నీటి భద్రత కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి, రైతులకు నీరందిస్తున్నామన్నారు. విధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించామని ప్రజలపై ట్రూ అప్ ఛార్జీ భారం పడకుండా భరిస్తున్నామన్నారు. కరెంట్ ఛార్జీల పెంచబోమని ఇప్పటికే ప్రకటించామన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గతేడాది 30 పైసలు తగ్గించాం, మరో 30 పైసలు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. కనెక్టివిటీ పెరిగేలా పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు పూర్తి చేసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

రాజకీయాల్లో నేరగాళ్లతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది: సీఎం చంద్రబాబు

సీఎం 'హామీ' ఇచ్చారు నెరవేర్చారు - చిరువ్యాపారికి ఇంటి స్థలం, పింఛను, రుణం మంజూరు

Last Updated : April 29, 2026 at 2:35 PM IST