రైతు డిస్కమ్ వల్ల తాగునీటి ప్రాజెక్టులకు కూడా కరెంట్ కోతలు వస్తాయి: హరీశ్‌రావు
రైతు డిస్కమ్ వల్ల తాగునీటి ప్రాజెక్టులకు కూడా కరెంట్ కోతలు వస్తాయన్న మాజీ మంత్రి హరీశ్‌రావు - ప్రస్తుతం రైతులకు 13 గంటలకు మించి కరెంట్ ఇవ్వట్లేదని ఆరోపణ

Published : May 31, 2026 at 4:42 PM IST
|Updated : May 31, 2026 at 5:52 PM IST
BRS Leaders Harish Rao and KTR on Rythu DISCOM : రైతు డిస్కమ్ రైతుల పాలిట శాపంగా మారనుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు డిస్కమ్ వల్ల తాగునీటి ప్రాజెక్టులకు కూడా కరెంట్ కోతలు వస్తాయని ఆరోపించారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలు అని కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో అంటున్నారన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులకు 7 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారు : ప్రస్తుతం రైతులకు 13 గంటలకు మించి కరెంట్ ఇవ్వట్లేదని హరీశ్‌రావు ఆరోపించారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో 7 - 8 గంటలే ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో రైతులకు 7 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. బడే భాయి మోదీ విధానాలనే రాష్ట్రంలో అమలు చేసేందుకు చోటా భాయి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు డిస్కమ్‌కు సౌర విద్యుత్ మాత్రమే ఇస్తామని జీవోలో పేర్కొన్నారని తెలిపారు. కేవలం సౌరవిద్యుత్‌తో ఎత్తిపోతల ప్రాజెక్టుల మోటార్లు ఎలా నడుస్తాయని హరీశ్‌రావు ప్రశ్నించారు.
"రైతు డిస్కమ్ వల్ల తాగునీటి ప్రాజెక్టులకు కూడా కరెంట్ కోతలు వస్తాయి. రైతులకు 3 గంటల విద్యుత్ చాలు అని కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో అంటున్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని రేవంత్‌రెడ్డి చెప్పాలి. ప్రస్తుతం రైతులకు 13 గంటలకు మించి కరెంట్ ఇవ్వట్లేదు. రైతు డిస్కమ్‌కు సౌర విద్యుత్ మాత్రమే ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. కేవలం సౌరవిద్యుత్‌తో ఎత్తిపోతల ప్రాజెక్టుల మోటార్లు ఎలా నడుస్తాయి?" - హరీశ్‌రావు, మాజీ మంత్రి
రైతు మెడకు ఉరి పెట్టే డిస్కం : రైతు డిస్కం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గతంలో సాగుకు రోజుకు 3 గంటల విద్యుత్ చాలని అన్నారని తెలిపారు. ప్రస్తుతం మాటమార్చి రైతు డిస్కం ఏర్పాటు చేస్తామంటున్నారని అన్నారు. రైతు మెడకు ఉరి పెట్టే డిస్కం అది అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు? : కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయంలో స్థానికంగా ఆరు వేల ఇళ్లు కట్టిస్తామరని, ఇప్పటి వరకు ఆరు ఇళ్లయినా కట్టించారా? కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 420 హామీలు అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అప్పులు చేసి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారని, రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో రైతుబంధు పడ్తలేదు కానీ రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తోంది : కేటీఆర్
మూడు, నాలుగు రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొంగులేటి

