ETV Bharat / politics

ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధమవుతోన్న బీఆర్​ఎస్​ - పార్టీ నేతలతో సమావేశం కానున్న కేటీఆర్

మూడు కార్పొరేషన్ల ఎన్నికలు కీలకం కావడంతో పార్టీశ్రేణులను సన్నద్ధం చేసేలా బీఆర్​ఎస్ కార్యాచరణ - రాజధాని ప్రాంత అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు​ సంసిద్ధం

KTR on BRS Party Future Plan
KTR on BRS Party Future Plan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 9:20 AM IST

3 Min Read
Choose ETV Bharat

KTR on BRS Party Future Plan : గ్రేటర్ హైదరాబాద్ సహా మూడు కమిషనరేట్లలోని అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడికి భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. వివిధ సమస్యలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సర్కార్​ను నిలదీయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఔటర్ రింగ్ పరిధి లోపలి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా బీఆర్​ఎస్ వ్యూహం : గ్రేటర్ హైదరాబాద్‌లో పొరుగు కార్పొరేషన్ల విలీనం, అనంతరం మూడు కార్పొరేషన్లుగా విభజన వంటి కార్యక్రమాలను రాష్ట్రం ప్రభుత్వం పూర్తి చేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవీకాలం ముగిసిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లోపల, పరిసర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. అందుకు సంబంధించిన పాలనా వ్యవస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధాని ప్రాంత అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్​ఎస్​ సిద్ధమవుతోంది.

అధికార పార్టీపై బీఆర్​ఎస్​ విమర్శలు : 2023 శాసనసభ ఎన్నికల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో బీఆర్​ఎస్​ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. ఏడు మజ్లిస్, ఒక బీజేపీ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ గులాబీ పార్టీ తరపునే ఎన్నికయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీఆర్​ఎస్​ ప్రభావం చూపలేకపోయింది. కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ మెజార్టీ శాసనసభ్యులు ఇప్పటికీ బీఆర్​ఎస్​ వైపే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లను దృష్టిలో ఉంచుకొని పార్టీ పరంగా కార్యాచరణ తీసుకునేందుకు బీఆర్​ఎస్​ సిద్ధమవుతోంది. మూడు కార్పొరేషన్ల ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీని, శ్రేణులను సన్నద్ధం చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ శివారు కార్పోరేషన్లు, మున్సిపాల్టీల విలీనం సహా మూడు కార్పొరేషన్లుగా విభజన ఏకపక్షంగా చేశారని బీఆర్​ఎస్​ విమర్శిస్తోంది.

కేసీఆర్​ హయాంలో చేపట్టినవే పూర్తిచేశారు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అభివృద్ధిపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్​ఎస్ ​ఆరోపిస్తోంది. కేసీఆర్​ హయాంలో చేప్టటి తుదిదశలో ఉన్న వాటిని పూర్తి చేస్తున్నారే తప్ప, మిగిలిన వాటిని పట్టించుకోవడం లేదని గులాబీ పార్టీ ఆక్షేపిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ సహా ఇతర సమస్యల విషయంలో సర్కార్ పూర్తి అలక్ష్యంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయడం లేదని రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మించ లేదని విమర్శిస్తోంది.

పార్టీ నేతలతో బీఆర్​ఎస్​ కీలక సమావేశం : మెట్రో రైల్ సహా మౌలిక సదుపాయాలు, ఇతరత్రాల విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టు విధానంతోనూ గులాబీ పార్టీ విభేదిస్తోంది. వీటన్నింటి నేపథ్యంల పార్టీ తరపున కార్యాచరణ చేపట్టడంతో పాటు నేతలు, శ్రేణులను సన్నద్దం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా శనివారం కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యక్రమాలు : మూడు కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చేలా ఔటర్ రింగ్ పరిధి లోపల ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ వారితో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించడంతో పాటు కార్యచరణ ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత మాజీ కార్పొరేటర్లు, ఇతర నేతల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

'రేవంత్‌ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తోంది - జంట నగరాల అస్థిత్వం దెబ్బతీస్తే ఉపేక్షించం'