భోగాపురంపై వైఎస్సార్సీపీ అసత్య ప్రచారం - క్రెడిట్ అంతా చంద్రబాబుదే: పట్టాభి
టీడీపీ నాయకుల పట్టుదల, నాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కృషితోనే ఈ విమానాశ్రయం ప్రారంభమవుతుందన్న పట్టాభిరాం - సైట్ క్లియరెన్స్, ఇన్ ప్రిన్సిపిల్ అప్రూవల్‌ను చంద్రబాబునాయుడే తెచ్చారన్న పట్టాభి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 4:57 PM IST
Pattabhiram On Jagan About Bhogapuram Airport : ఒక అబద్ధానికి పాంట్, చొక్కా తొడిగితే జగన్ మోహన్ రెడ్డి అవుతాడని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పార్టీ మామూలుగానే తమ పాత్ర లేకపోయినా అంతా మేమే చేశాం అని అన్నింటినీ తమ ఖాతాలోనికి జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. గత సంవత్సరంనర కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా అన్నీ మేమే చేశాం అని నిస్సిగ్గుగా ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుందని విమర్శించారు.
క్రెడిట్ చోరీ మాటలు మాట్లాడడం సిగ్గుచేటు : కొమ్మారెడ్డి పట్టాభిరామ్ : ఒకప్పుడు విమానాశ్రయం అవసరమా అన్న జగన్ రెడ్డి నేడు క్రెడిట్ చోరీ మాటలు మాట్లాడడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. జగన్‌కు ఉన్నది క్రిమినల్ క్రెడిట్ చరిత్ర అని దాన్ని బుద్ధి ఉన్నవారెవ్వరూ చోరీ చేయలేరని విమర్శించారు. చంద్రబాబుకు ఉన్న డెవలప్మెంట్ క్రెడిట్, ఫేక్ ట్వీట్‌లతో దాని దరిదాపులకు కూడా జగన్ చేరలేడని ఎద్దేవా చేశారు. నాడు ఈ విమానాశ్రయం గ్రౌండ్ కావడానికి సీఎం చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కృషి చేస్తే, నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పట్టుదలతో ప్రారంభానికి సిద్ధమవుతుందని వెల్లడించారు. 2014–19 మధ్య ఎయిర్‌పోర్టు భూసేకరణపై 750 కోట్లు ఖర్చు చేస్తే, 2019–24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 203 కోట్లు మాత్రమే అన్నారు. తన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి జీఎంఆర్ కంపెనీని బెదిరించి 500 ఎకరాలు లాక్కుంటే, వాటిని మళ్లీ ఎయిర్‌పోర్టుకు కేటాయించామని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు శ్రీకారం చుట్టింది, అనుమతులు తెచ్చింది, నిర్మించింది చంద్రబాబే అని స్పష్టం చేశారు.
సైట్ క్లియరెన్స్, ఇన్ ప్రిన్సిపిల్ అప్రూవల్ : సైట్ క్లియరెన్స్, ఇన్ ప్రిన్సిపిల్ అప్రూవల్‌ను కూడా సీఎం నారా చంద్రబాబునాయుడు తీసుకొచ్చారు అని పేర్కొన్నారు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు. ఈ విమానాశ్రయం కోసం ప్రత్యేక స్టీరింగ్ కమిటీ జీఓ నెంబర్ 39 కూడా సీఎం నారా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారని పట్టాభిరాం తెలిపారు. అన్నింటికంటే అతి ముఖ్యమైన పర్యావరణ శాఖ అనుమతిని కూడా సీఎం చంద్రబాబునాయుడు తెచ్చారని స్పష్టం చేశారు.
ప్రజలకు, వ్యాపారాలకు కనెక్టివిటీ భోగాపురం : విశాఖపట్నం తూర్పు తీర ఆర్థిక రాజధానిగా మారనుంది. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధికి ఒక శక్తివంతమైన ఇంజిన్‌గా పని చేస్తుంది. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. ప్రజలకు, వ్యాపారాలకు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ విమానాశ్రయం వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఎగుమతులను పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక సామర్ధ్యాన్ని వెలికి తీస్తుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన, వాణిజ్య పటంలో సుస్థిరంగా నిలుపుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఆధునిక, సమగ్ర వృద్ధి ఆధారిత విమానయాన మౌలిక సదుపాయాలను నిర్మించాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు ఇది నిదర్శనమని తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం - ల్యాండ్ అయిన తొలి విమానం
ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు - భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

