ETV Bharat / politics

జగన్‌వన్నీ అవాస్తవాలు - అబద్ధాలపై పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ: మంత్రి అచ్చెన్న

సీఎం వ్యాఖ్యలను​ జగన్ వక్రీకరించారన్న మంత్రి అచ్చెన్న - ప్రజలు అచంచల విశ్వాసంతో ఎన్డీఏకు అధికారం ఇచ్చారని వెల్లడి - రాష్ట్రానికి సమర్థ నాయకత్వాన్ని అందిస్తున్నారని చంద్రబాబును కొనియాడిన మంత్రి

Minister Atchannaidu Fires On YS Jagan
Minister Atchannaidu Fires On YS Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2026 at 2:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

Minister Atchannaidu Fires On YS Jagan: సీఎం చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కేందుకే జగన్ 3 గంటలపాటు మీడియా సమావేశం పెట్టారని మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పకుండా అబద్ధాలు వల్లె వేశారని, జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉంటారని గ్రహించే శంకర్ అపరిచితుడనే సినిమా ఎప్పుడో తీశారని విమర్శించారు. కొంత మందికే జగన్, వైఎస్, రాజారెడ్డి క్రూరత్వం తెలుసన్నారు. ఈతరానికి మళ్లీ ఆ కుటుంబ నైజం గుర్తు చేసే విధంగా నిన్న జగన్ మీడియా సమావేశం పెట్టారని మంత్రి అచ్చెన్న ధ్వజమెత్తారు.

జగన్​ ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్థసారథిరెడ్డి కుటుంబంలో ఎవరూ మిగలకుండా దమనకాండ సాగించింది రాజారెడ్డి కాదా అని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారికి ఏడు కొండలు కాదు 2 కొండలు చాలు అని నాడు వైఎస్ అన్న మాటలను చంద్రబాబు గట్టిగా ఖండిస్తే ఆ వ్యాఖ్యల్ని జగన్ వక్రీకరించారని మండిపడ్డారు. తన తండ్రి చావు వెనుక రిలయన్స్ పాత్ర ఉందన్న జగన్ అధికారంలోకి రాగానే అదే రిలయన్స్ తాలూకు వాళ్లకి రాజ్యసభ ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్​రెడ్డి మరణం వల్ల అంతిమ లబ్ధిదారుడు జగన్ కాదా అని నిలదీశారు.

జగన్‌వన్నీ అవాస్తవాలు - అబద్ధాలపై పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ: మంత్రి అచ్చెన్న (ETV Bharat)

కన్నతల్లి, చెల్లిపైనా కించపరిచేలా వ్యాఖ్యలు: నీ సొంత బాబాయ్​పై గొడ్డలి వేటు వేయించినప్పుడు గొడ్డలి పార్టీ అంటే జగన్ ఎందుకంత గింజుకుంటున్నాడని మంత్రి అచ్చెన్న విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా తండ్రి మరణం, బాబాయ్ హత్య నుంచి కోడికత్తి వరకూ మాట్లాడిన జగన్ అధికారంలోకి రాగానే ఎందుకు నోరెత్తలేదని ఈ సందర్భంగా మంత్రి ఆక్షేపించారు. వంగవీటి రంగా హత్య కేసు వాళ్లను పార్టీలో తన వెంట తిప్పుకుంటూ చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయటమేంటని ప్రశ్నించారు. కార్యకర్తల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికీ హింసకు హింస సమాధానం కాదని సర్దిచెప్తూ సీఎం చంద్రబాబు ప్రజల్ని చైతన్యపరుస్తున్నారని వెల్లడించారు. కన్నతల్లి, సొంత చెల్లిని కూడా సోషల్ మీడియాలో కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జగన్ ఇప్పుడు విలువలు గురించి మాట్లాడటం ఎంతో విడ్డూరమని మంత్రి అచ్చెన్న ఎద్దేవా చేశారు.

తన తాత, తండ్రి, బాబాయి మరణాలకు చంద్రబాబు కారణమని జగన్‌ చెప్పడాన్ని మంత్రి అచ్చెన్న తప్పుపట్టారు. తన కుటుంబం, తాను చేస్తున్న వ్యవహారాలనే జగన్‌ గుర్తు చేశారే తప్ప నిన్న ప్రెస్​మీట్​లో పెద్దగా చెప్పిందేమీ లేదని దుయ్యబట్టారు. తాను చేసిన వ్యవహారాలన్నీ చంద్రబాబు చేసినట్లు జగన్‌ చెప్పారన్నారు. రాజారెడ్డిని చంపినట్లు జగన్‌ చెబుతున్నారు, అయితే రాజారెడ్డిని ఎందుకు చంపారు? ఏ విధంగా చంపారో ప్రజలకు బాగా తెలుసునని అచ్చెన్న వ్యాఖ్యానించారు. జగన్‌ క్రూరత్వం, వైఎస్‌ఆర్‌ అరాచకాలు, రాజారెడ్డి దమనకాండ చాలా మందికి తెలియకపోవచ్చునన్నారు. చర్చ చేపట్టడం ద్వారా జగన్‌ కుటుంబ నేపథ్యం అందరికీ తెలిసిందన్నారు. రాజారెడ్డిని చంపిన వ్యక్తులను తాను ఏమీ చేయలేదని జగన్‌ చెప్పారన్నారు. జగన్‌ వ్యాఖ్యలపై బాధితుడు పార్థసారథిరెడ్డి స్పందించారని అచ్చెన్న గుర్తు చేశారు.

సీఎం వ్యాఖ్యలను జగన్ వక్రీకరించారన్న అచ్చెన్న: వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేయాలని కంకణం కట్టుకున్నారని మంత్రి అచ్చెన్న వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. వెంకటేశ్వరస్వామివి వెంకటేశ్వరస్వామిని ఎవరు అపవిత్రం చేసినా మంచి జరగదని చంద్రబాబు చెప్పారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరించి జగన్‌ మాట్లాడారని మంత్రి అచ్చెన్న వివరించారు. ప్రజలు అచంచల విశ్వాసంతో ఎన్డీఏకు అధికారం ఇచ్చారన్నారు. వైఎస్సార్సీపీ పరిపాలనలో జగన్‌ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకూ సాధ్యం కాదనుకున్నారని, అయితే చంద్రబాబు అధికారం చేపట్టినా ప్రజల్లో విశ్వాసం పొందలేరని జగన్‌ భావించారు, కానీ ఎవరి ఊహకూ అందని విధంగా చంద్రబాబు సమర్థ నాయకత్వాన్ని ఇచ్చారని మంత్రి అచ్చెన్న కొనియాడారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారన్నారు.

రెండేళ్లలో ఊహించని స్థాయిలో అభివృద్ధి: గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అభివృద్ధి, సంక్షేమంపై ఎక్కడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతున్నందున జగన్‌ మాట్లాడలేదన్నారు. జగన్‌ అవాస్తవాలు చెప్పారని, అబద్ధాలపై పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ, చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగే కార్యక్రమం చేపట్టారని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు 76 ఏళ్ల వయసులో 26 ఏళ్ల కుర్రాడిలా పని చేస్తున్నారని, రాష్ట్రానికి, దేశానికి రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారని మరోసారి సీఎం చంద్రబాబుపై మంత్రి అచ్చెన్న ప్రశంసలు కురిపించారు.

సమాధులపై ఫొటోలా సర్వే రాళ్లపై జగన్​ చిత్రమా ! : మంత్రి అచ్చెన్న

'బొత్స ఆరోపణలు - అచ్చెన్న కౌంటర్లు' - మండలిలో అధికార, విపక్షాల మాటల యుద్ధం