ప్రయోగించాక గురితప్పదు - అందుకే మన బ్రహ్మాస్త్రానికి అంత డిమాండ్!
భారత్ అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ - గురి పెడితే తప్పడం అంటూ ఉండనే ఉండదు - 450 కి.మీ. రేంజ్‌లో శత్రు స్థావరాలు ధ్వంసం - బ్రహ్మోస్-నెక్ట్‌జెన్ తయారీకి భారత్ ప్రణాళికలు

Published : July 6, 2026 at 3:45 PM IST
Story on BRAHMOS Missile : తరచు కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్! భారత్‌ను అస్థిరపరచాలని భావించే చైనా! ఈ రెండు సరిహద్దు దేశాలు కావడం అదను దొరికితే ఇరకాటంలో పడేయాలని పయత్నించడం భారత్‌కు సవాలే. అందుకే, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఆయుధ వ్యవస్థను పటిష్ఠ పరచుకుంటోంది. రేపన్న రోజున ఏదైనా యుద్ధ వాతావరణం వచ్చినా తగిన సమాధానం చెప్పేందుకు సన్నద్ధమవుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, శక్తిమంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్‌ను తయారు చేసింది. దేశీయ రక్షణ అవసరాలు తీర్చుకోవ డంతో పాటు విదేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
1998 ఒప్పందం : బ్రహ్మోస్ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్షిపణులను తయారు చేయాలనే ఆలోచన మొదలైనప్పటి నుంచి పేరు పెట్టడం వరకూ ప్రతిదీ ఆసక్తికరమే. 1982లో డీఆర్డీఓలో చేరిన అబ్దుల్ కలాం మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టారు. ఆయన చొరవతో 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్-ఐజీఎండీపీ ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశంలో ఆయుధాల తయారీ ఊపందుకుంది. 1993లో ఓసారి అబ్దుల్ కలాం రష్యా పర్యటనకు వెళ్లారు. అప్పుడే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ తయారీకి అధికారికంగా అడుగు పడింది. ఆ సమయానికి ఆయన డీఆర్‌డీవో సెక్రటరీగా ఉన్నారు. ఇరుదేశాల ప్రతినిధులు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మిసైల్ తయారు చేయడంపై చర్చలు జరిపారు. అయిదేళ్ల తర్వాత 1998 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. అలా రష్యాకు చెందిన ఎన్పీఓ మషినోస్ట్రోయేనియా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-డీఆర్డీఓ ఉమ్మడి సహకారంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రాజెక్టుకు బీజం పడింది.
"బ్రహ్మోస్ కొనుగోలు చేయడానికి ఇతర దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇతర దేశాల్లో తయరయ్యే మిసైల్స్ సిస్టమ్స్‌తో పోలిస్తే చౌకగా తయరవుతుంది. భారత్‌లో ఈ మిసైల్ ధర తక్కువగా ఉంటుంది. మరికొన్ని కారణాల వల్ల యూఏఈ బ్రహ్మోస్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటుంది" - మేజర్ శ్రీనివాస్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు
900 కిలోమీటర్లు చేరుకునేలా ప్రయోగాలు : ఈ ప్రాజెక్టుకు బ్రహ్మోస్ అనే పేరు పెట్టడం వెనక ఒక ఆసక్తికర విషయం ఉంది. భారత్‌లో బ్రహ్మపుత్ర, రష్యాలో మోస్కోవా అనే ప్రముఖ నదులు ఉన్నాయి. ఇవి రెండూ ఆయా వేగవంత మైన, శక్తిమంతమైన నదులు. అందుకే, ఆ రెండు నదుల పేర్లు వచ్చేలా బ్రహ్మపుత్రలో బీఆర్ఏహెచ్, మోస్కోవాలో ఎంఓఎస్ తీసుకుని ప్రాజెక్టుకి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టులో భారత్ వాటా 50.5% రష్యా వాటా 49.5%. అందుకు సంబంధించి 1999లో కాంట్రాక్ట్‌పై సంతకాలు జరిగాయి. ఇందుకోసం భారత్ 126.25 మిలియన్ డాలర్లు, రష్యా 123.75 మిలియన్ డాలర్లు బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థకు కేటాయించాయి. దీంతో 2001 జూన్‌లో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. మొదట 290 కిలోమీటర్ల రేంజ్‌తో బ్రహ్మోస్ క్షిపణి రూపొందించారు. ఆ తర్వాత 450 కిలోమీటర్లకు పెంచారు. 2027 నాటికి మిస్సైల్ రేంజ్ 900 కిలోమీటర్లు చేరుకునేలా ప్రయోగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను పేల్చేసేలా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే మాక్ 8 వేగంతో బ్రహ్మోస్ హైపర్‌సోనిక్ మిసైల్, బ్రహ్మోస్-నెక్ట్‌జెన్ తయారు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.
శత్రువులు తేరుకునేలోపే లక్ష్యాలు ధ్వంసం : ఈ క్షిపణి ప్రత్యేకతలేంటి? అనేది చూస్తే ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ మిస్సైల్. శక్తిమంతమైన క్రూయిజ్ క్షిపణి కూడా. 2.8 నుంచి మాక్ 3 వేగంతో ధ్వని కంటే 3 రెట్లు స్పీడ్‌గా దూసుకెళ్తుంది. కాస్త వివరంగా చెప్పాలంటే సెకనుకు-1.02 కి.మీటర్ల వేగంతో వెళ్తుంది. శత్రువులు తేరుకునేలోపే లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది అన్నమాట. 300 కిలోల బరువున్న సాధారణ వార్‌హెడ్‌ను మోసుకెళ్తుంది. దీనిని భూమి, యుద్ధ నౌకలు, ఫైటర్‌జెట్ల ద్వారా ప్రయోగించవచ్చు. అందుకే, దీనిని మల్టీపర్పస్ లాంచింగ్ మిసైల్ అంటారు. ఇలా లెక్కకు మిక్కిలి ప్రత్యేకతలతో భారత అమ్ములపొదిలో కీలక అస్త్రంగా ఉంది బ్రహ్మోస్.
పశ్చిమాసియాలో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు : కొన్నాళ్లుగా బ్రహ్మోస్ గురించి వింటూనే ఉన్నాం. ఐతే, ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలవడానికి ఓ ముఖ్య కారణం ఉంది. అదేంటంటే ఈ మిసైల్ శక్తిసామర్థ్యాలు చూసిన ప్రపంచ దేశాలు వీటిని కొనుగోలు చేయడానికి భారత్‌తో చర్చలు జరుపుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యూఏఈ బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసేందుకు భారత్‌తో చర్చలు జరుపుతోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల గల్ఫ్ దేశాలు తీవ్రమైన భద్రత సమస్యలు ఎదుర్కొంటున్నాయి. శాంతి ఒప్పందం కూడా సరిగ్గా అమలుకు నోచుకోకపోవడంతో భవిష్యత్తులో ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాలు మిలిటరీ సామర్థ్యం, ఆయుధ వ్యవస్థను పటిష్ఠం చేసుకునే పనిలో పడ్డాయి. అందులో భాగంగానే యూఏఈ భారత్ బ్రహ్మాస్త్రాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.
ఆయుధ సంపత్తిపై ప్రత్యేక దృష్టి : వాస్తవానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత్ దగ్గర ఆయుధ సంపత్తి పరిమితంగానే ఉంది. సైన్యం కూడా అంతంతమాత్రమే. ఐతే, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రక్షణ వ్యవస్థ ఎంతో కీలకం. ఉగ్రవాదులను ఉసిగొలిపే పాకిస్థాన్‌కి సరైన బుద్ధి చెప్పాలంటే సైన్యం దగ్గర అత్యాధునిక అస్త్రశస్త్రాలు తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తించి భారత్ 1958లో ఆయుధ సంపత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ వెపన్స్ డెవలప్‌మెంట్ టీమ్-ఎస్డబ్య్లూఏటీతోపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-డీఆర్డీఓ ఏర్పాటు చేసి పరిశోధనలు మొదలు పెట్టింది. 1970లో ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వెలియంట్ ప్రారంభించారు. భూతలం నుంచి గగనతలం, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయడం వీటి ఉద్దేశం. ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా 1988లో పృథ్వీ-1 క్షిపణి తయారీ జరిగింది. ఆ తర్వాత 1996లో పృథ్వీ-2, 2000లో పృథ్వీ -3 ప్రయోగం చేపట్టారు. పృథ్వీ-3 క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధిస్తుంది.
మిసైల్ కొనుగోలు చేసిన తొలి దేశం ఫిలిప్పీన్స్ : 1983లో అగ్ని బాలిస్టిక్ క్షిపణి తయారు చేసింది డీఆర్డీఓ. వీటిని అప్‌గ్రేడ్ చేస్తూ అగ్ని-1,2,3,4,5 తోపాటు అగ్ని-పీ పేరుతో సిరిస్ వారీగా క్షిపణులు తయారు చేసింది. ప్రస్తుతం అగ్ని-5 రేంజ్ 5000 కిలోమీటర్లు. వీటితో పాటు శౌర్య, బరాక్, అస్త్ర, మిషన్ శక్తి, ప్రళయ్, మిషన్ దివ్యాస్త్ర ఇలా ఒక్కొక్కటిగా అమ్ముల పొది ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చింది భారత్. యూఏఈ కంటే ముందు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ మిసైల్ కొనుగోలు చేసిన తొలి దేశం ఫిలిప్పీన్స్. 2022లో 375 మిలియన్ డాలర్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా బ్రహ్మోస్‌ని ఆ దేశానికి అందించింది భారత్. దీంతో పాటు ఇండోనేషియా, వియత్నాం దేశాలు కూడా ఈ మిసైల్‌ని కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఆ జాబితాలో యూఏఈ చేరనుంది. దీంతోపాటు అర్జెంటీనా, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ మిస్సైల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
రక్షణ అవసరాలు తీర్చుకోవడం : ప్రపంచ దేశాలు బ్రహ్మోస్ మిసైల్ కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం దాని సామర్థ్యమే. గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో అది ప్రపంచ దేశాలకు తెలిసింది. భారత్ తొలిసారి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. ఆ మిస్సైల్ మెరుపు వేగం, కచ్చితమైన విధ్వంసానికి శత్రుదేశం పాకిస్థాన్ 4 రోజుల్లోనే తోక ముడిచింది. దీంతో ఆయా దేశాలు భారత బ్రహ్మాస్త్రాన్ని కొనుగోలు చేయాడనికి ముందుకు వస్తున్నాయి. ఆయుధాలు అంటే విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలు, ఆకాశ్‌తీర్ వంటి డిఫెన్స్ వ్యవస్థలను తయారు చేసుకుంది భారత్. రక్షణ అవసరాలు తీర్చుకోవడంతో పాటు సమయం వచ్చినప్పుడు శత్రు దేశాలకు మన సామర్థ్యం ఏంటో చాటి చెప్పింది. ఇదే క్రమంలో విదేశాలకు ఆయుధాలు ఎగుమతులు చేయడం ప్రారంభించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతులు విలువ రూ.68 కోట్లు మాత్రమే ఉండేది. 2026 మార్చి చివరికి ఆ విలువ 37,868 కోట్లకు పెరిగింది. ఈ లెక్కలే చెబుతున్నాయి భారత్ ఏ స్థాయిలో స్వావలంబన సాధించిందో.
మన ఆయుధాల శక్తి సామర్థ్యాలు : సాధారణంగా ఆయుధాల ఎగుమతి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు. ప్రపంచ దేశాల్లో ఆయా దేశాల ఆయుధాలే అధికంగా ఉన్నాయి. వాటన్నింటినీ కాదని యూఏఈ సహా ఇతర దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. అంటే మన ఆయుధాల శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్‌లో విదేశీ ఎగుమతులు విలువ మరింత పెరగడంతో పాటు ఆయా దేశాలకు దౌత్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.
'బ్రహ్మోస్ క్షిపణిని తమ సైన్యంలో చేర్చుకునేందుకు రష్యా ఆసక్తి'
బ్రహ్మోస్ 2.O- శత్రువులకు హడలే! 800 కిలోమీటర్ల పరిధికి అప్‌గ్రేడ్

