దేశంలో చక్కెర ధరల పెరుగుదలకు 'ఇథనాల్' కారణమా?
దేశంలో భగ్గుమంటున్న చక్కెర ధరలు - పండగలు, పెళ్లిళ్ల సీజన్ వల్ల భారీగా డిమాండ్ - ఆరు వారాల వ్యవధిలో ధర రూ. 44 నుంచి రూ.65కు పెరుగుదల

Published : August 27, 2026 at 4:26 PM IST
Sugar prices Surge in India : నడుస్తున్నది పండుగలు, పెళ్లిళ్ల సీజన్. శుభకార్యాలతో దేశంలో ఎటు చూసినా సందడే కనిపిస్తోంది. మరో రెండు-మూడు నెలలు ఇదే పరిస్థితి. అయితే శుభకార్యాల్లో పిండి వంటలకు కీలకమైన చక్కెర సామాన్యులకు అందనంటోంది. దీని ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆరేడు వారాల వ్యవధిలోనే ఏకంగా సుమారు 50శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఓ వైపు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగగా, భారీగా పెరిగిన చక్కెర ధరలే సామాన్యులను మరింత కలవరపెడుతున్నాయి. మరి ఎందుకు ఈ పెరుగుదల. ఇథనాల్ కోసం చెరకును మళ్లించడమే కారణమా. ప్రభుత్వం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు ఏమిటి.
ఆకాశాన్నంటుతున్న చక్కెర ధరలు : దేశంలో చక్కెర చేదెక్కుతోంది. ప్రజలు రోజూ తప్పక వినియోగించే ఈ తీపి పదార్థం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆరేడు వారాల వ్యవధిలో రకాన్ని బట్టి కిలో చక్కెర ధర 44రూపాయల నుంచి 65రూపాయలకు పెరిగింది. అంటే సుమారు 50శాతం పెరుగుదల. రోజుల వ్యవధిలో చక్కెర ధర ఈ స్థాయిలో పెరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్నది పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చక్కెరకు డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు చక్కెరను భారీగా నిల్వ చేసుకున్నారు. దీని ప్రభావం హోల్‌సేల్ ధరలపై పడింది. అదే సమయంలో ప్రభుత్వ అంచనాల కంటే చక్కెర దిగుబడి తగ్గింది. అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు మార్కెటింగ్ సీజన్‌గా భావిస్తారు. ఈ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం 34.3మిలియన్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. అయితే పరిస్థితులు చూస్తూ ఉంటే సెప్టెంబర్ 30తో ముగిసే సీజన్ నాటికి 30.6మిలియన్ టన్నులే వచ్చేలా కనిపిస్తోంది. అంటే ఉత్పత్తి 11శాతం తగ్గుతున్నట్లు లెక్క. దేశంలో చక్కెర ధరలు పెరగడానికి ప్రాథమికంగా ఇది మొదటి కారణం.
చక్కెర ధరల పెరుగుదలకు కారణాలు : చక్కెర ధరల పెరుగుదలకు ప్రభుత్వం చెబుతున్న కారణం ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గి చెరకు దిగుబడి తగ్గిందని. అయితే నిపుణుల మాట మాత్రం మరోలా ఉంది. ఇప్పుడు చక్కెర ఎగుమతులపై నిషేధం విధించినా ఉత్పత్తిపై అధిక అంచనాలు వేసుకుని, గతంలో ఎక్కువ ఎగుమతులకు అనుమతిచ్చిందని నిపుణులు అంటున్నారు. ఈ సీజన్‌లో 15లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 5లక్షల టన్నులు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. మే నెలలో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించే వరకు 8లక్షల టన్నుల చక్కెర విదేశాలకు ఎగుమతి అయ్యింది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం చక్కెర ఉత్పత్తిని తప్పుగా అంచనా వేసి ఎగుమతులకు అనుమతి ఇవ్వడం దేశంలో దీని ధరలు పెరగడానికి మరో కారణం.
"గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజలకు అవసరం ఉన్నంత మేర మార్కెట్లో చక్కెర దొరకట్లేదన్నది వాస్తవం. ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం అందుకు ఒక కారణం. అధికారుల అంచనాల ప్రకారం ఈ ఏడాది చక్కెర ఉత్పత్తులు భారీగా తగ్గాయి. సుమారు 340 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర మార్కెట్లోకి వస్తుందని అంచనా వేశారు. కానీ కేవలం 306లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర మాత్రమే మార్కెట్లోకి వచ్చింది" - సిలివేరు హరినాథ్, ప్రొఫెసర్ సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ స్టడీస్
దిద్దుబాటు చర్యలు చేపట్టిన కేంద్రం : చక్కెర ధరల పెరుగుదల నేపథ్యంలో మరిన్ని దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది. పదేళ్ల తర్వాత తొలిసారిగా చక్కెర దిగుమతులకు అనుమతించింది. ముడి పంచదారను 10 లక్షల టన్నుల మేర అక్టోబరు 31 లోపు సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీన్ని ప్రాసెస్ చేసేందుకు 2నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. దేశంలోకి దిగుమతి అయిన తేదీ నుంచి ఇది వర్తిస్తుంది. మార్కెట్‌లో చక్కెర కొరతను నివారించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర సరఫరా పెంచడం, కృత్రిమ కొరతను నివారించడం, ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా నిల్వలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ విక్రయించే, వినియోగించే పెద్ద వ్యాపారులు, పరిశ్రమలు తమ వద్ద15 రోజులకు సరిపడా నిల్వలనే ఉంచుకోవాలని ఆదేశించింది. మిఠాయిలు, ఇతర పదార్థాలు శీతల పానీయాల తయారీదారులు, ఆహారశుద్ధి యూనిట్లు, అమ్మకందారులు, ఇతర సంస్థాగత కొనుగోలుదారులపై ఈ ఆంక్షలు విధించింది. నవంబరు 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది.
చెరుకును ఇథనాల్ తయారీకి మళ్లించడమే కారణమా? : దేశంలో చక్కెర ధరల పెరుగుదలకు కేంద్రం చెరకును ఇథనాల్ తయారీకి మళ్లించడం కూడా కారణం అని విమర్శలు వచ్చాయి. అయితే దీనికి కేంద్రం వివరణ ఇచ్చింది. అది నిజం కాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ తెలిపింది. స్థానికంగా దిగుబడి తగ్గడం, పండగల వేళ డిమాండ్ పెరగడం వల్లే ధరలు పెరిగాయని తెలిపింది. చక్కెర తయారీదారుల సమాఖ్య ఇస్మా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఇథనాల్ ఉత్పత్తికి కేటాయించిన తర్వాత కూడా దేశంలో నికరంగా పంచదార ఉత్పత్తి 279లక్షల టన్నులు ఉంటుందని తెలిపింది. మార్కెటింగ్ సంవత్సరం ముగిసే సెప్టెంబర్ 30 వరకు 35లక్షల టన్నుల చక్కెర అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశంలో చక్కెర ధరలు దిగివస్తాయని ఇస్మా ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రీటెయిల్ మార్కెట్‌లో ధరలు తగ్గుతాయని తెలిపింది.
చక్కెర వినియోగంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో పత్తి తర్వాత చక్కెర అతిపెద్ద వాణిజ్య పంట. వ్యవసాయ ఆధారిత రెండో అతిపెద్ద పరిశ్రమ కూడా. దేశంలో సుమారు 5కోట్ల మంది చెరకు రైతులు ఉంటారు. గ్రామీణ భారతంలో రైతులకు ఈ పంట సాగు ప్రధాన ఆదాయ వనరు. చక్కెర పరిశ్రమల్లో ఆధారపడి 5లక్షల మంది పని చేస్తున్నారు. ఇక 2021-22 సీజన్‌లో చక్కెర ఉత్పత్తిలో భారత్ బ్రెజిల్‌ను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
బియ్యం నుంచి బంగారం దాకా ధరల మోత - తలకిందులవుతున్న సామాన్యుడి ఇంటి బడ్జెట్
ఎల్‌నినో ఎఫెక్ట్ - పెరిగిన ఇంటి బడ్జెట్ - మున్ముందు మరింత పైపైకి!

