ప్రపంచదేశాల వాణిజ్యంపై యుద్ధం పిడుగు - కొన్ని నిత్యావసర సరుకులకూ కటకట!
ప్రపంచాన్నే అస్తవ్యస్తం చేస్తున్న యుద్ధం - అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే కుదుపులు - చమురు, ఎల్ఎన్జీ సరఫరాకు అంతరాయం - భారత్‌లో పప్పుల ధరలపై ప్రభావం పడే అవకాశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 1:25 PM IST
|Updated : March 4, 2026 at 2:40 PM IST
War Impact on Petrol Crisis and Groceries Idi Sangathi : ఒక్క యుద్ధం మొత్తం ప్రపంచాన్నే అస్యవ్యస్తం చేస్తోంది. మార్కెట్‌లను కుదిపేస్తోంది. రేపోమాపో కాస్త కుదురుకుంటుందన్న ఆశలపైనా నీళ్లు చల్లుతోంది. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఓ వైపు చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్నా అవి ముందుకా వెనక్కా అన్న సందిగ్ధత కొనసాగుతోంది. ఇటు జరగాల్సిన విధ్వంసం జరుగుతూనే ఉంది.
చమురుతో పాటు సరకు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఆ మేరకు దిగుమతులపై ఆధారపడుతున్న దేశాలన్నీ ప్రభావితమవుతున్నాయి. ఇంకెంత కాలం ఈ అనిశ్చితి అని తలలు పట్టుకుంటున్నాయి ఆయా ప్రభుత్వాలు. పరిస్థితులు చక్కబడతాయేమోనని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి. చూస్తుంటే ఆ నిరీక్షణ నిష్ప్రయోజనం అయ్యేలా ఉంది.
చైనా, భారత్‌తో పాటు ఐరోపా దేశాలకు సెగ: యుద్ధం పశ్చిమాసియాలో ప్రభావం మాత్రం ప్రపంచమంతా. ఇదేమీ అతిశయోక్తి కాదు. ఇక్కడి అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోంది. ఈ యుద్ధాన్ని కేవలం పర్షియన్ గల్ఫ్‌కే పరిమితం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా చైనా, భారత్‌తో పాటు ఐరోపా దేశాలకు ఈ సెగ ఎక్కువగా తగులుతోంది. అంతర్జాతీయంగా వాణిజ్యం దెబ్బ తింటోంది.
అదే సమయంలో ఇంధన మార్కెట్‌లు కుదుపులకు లోనవుతున్నాయి. క్రమంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రకరకాల పరిణామాల కారణంగా నత్తనడకన నడుస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం పిడుగు నెత్తిన పడడం వల్ల ఇంకాస్త చతికిలబడింది. అందుకే ఈ పరిణామాన్ని కొందరు అనలిస్ట్‌లు “సిస్టమాటిక్ షాక్" గా అభివర్ణిస్తున్నారు. ప్రపంచమంతా భయపడేది రెండు అంశాల గురించే. ఒకటి చమురు. రెండోది సరకు రవాణా.
ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం: పశ్చిమాసియాలో ఎప్పుడూ ఉద్రిక్తతలు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి అక్కడి వరకే పరిమితమైతే గొడవే లేదు. కానీ పరిస్థితి అలా ఉండదు. అక్కడ చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కుదుపు కనిపిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే పశ్చిమాసియా అనేది గ్లోబల్ మార్కెట్‌కు ఓ "కనెక్టివ్ టిష్యూ" లాంటిది. అంటే అంతగా ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపించగలుగుతుంది.
ఇప్పుడు ఈ వాణిజ్యం గురించి మాట్లాడితే హోర్ముజ్ జలసంధి ప్రస్తావన లేకుండా చర్చ ముందుగు సాగదు. ప్రపంచంలో 5వ వంతు చమురు, ఎల్ఎన్జీ సరఫరా అయ్యేది ఈ ఇరుకైన మార్గం నుంచే. ఇప్పటికే ఈ దారి మూసేసింది టెహ్రాన్. వందలాది నౌకలు ఇక్కడ నిలిచిపోయాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 700 నౌకలు అక్కడే ఆగిపోయాయి. ఏ షిప్ ముందుకు కదిలినా పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేసింది. ఫలితంగా సప్లై చైన్‌కు అంతరాయం కలుగుతోంది. నౌకలను దారి మళ్లించడం, రవాణాలో జాప్యం సహా మరెన్నో కలుపుకుని ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
చమురు, ఎల్ఎన్జీ సరఫరాకు అంతరాయం: ఇప్పటికే చమురు మార్కెట్‌లు భగ్గమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్లకు చేరువలో ఉంది. బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుకునే ముప్పు ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. హోర్ముజ్ నుంచి రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు, పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఎల్ఎన్జీ ఎగుమతి అవుతుంది. ఈ దారిని మూసేసిన వెంటనే చమురు ధరల్లో 8% మేర పెరుగుదల కనిపించింది.
ఐరోపాలో గ్యాస్ ధరలు మొదట 20% మేర పెరిగాయి. యుద్ధం తీవ్రమైన కారణంగా క్రమంగా ఆ పెరుగుదల 50% కి చేరుకుంది. చమురు విషయంలో అంతటా ప్రభావం కనబడుతున్నా ఎల్ఎన్జీ పరంగా చూస్తే ఐరోపా దేశాలపై ప్రభావం ఎక్కువ ఉంది. నిజానికి గల్ఫ్ నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీపై చైనా, భారత్, జపాన్, దక్షిణకొరియా కన్నా తక్కువగానే ఆధార పడుతోంది ఐరోపా. అయినా సరే ప్రభావాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయలేమంటున్నారు విశ్లేషకులు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే ఎల్ఎన్జీ సప్లై నిలిచిపోయి ఐరోపా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం మరింత దెబ్బ కొడుతోంది.
దక్షిణాసియా దేశాలే ఎక్కువగా ప్రభావితం: నిజానికి ఈ ఏడాది మొదలయ్యే నాటికి ఐరోపా వద్ద గ్యాస్ నిల్వలు అడుగంటాయి. కొన్ని లెక్కల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 46 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మేర నిల్వలు ఉన్నట్టు అంచనా. ఇప్పుడు హోర్ముజ్ మూసివేతతో ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇదంతా ఐరోపా లెక్క. చమురు విషయానికి వస్తే మాత్రం ఆసియాలో పలు దేశాలపై యుద్ధ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. భారత్‌తో పాటు థాయ్‌లాండ్, కొరియా, ఫిలిప్పైన్స్‌లో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.
ఈ దేశాలన్నీ దేశీయ చమురు అవసరాల కోసం పశ్చిమాసియాపై ఆధారపడాల్సి రావడమే ఇందుకు కారణం. ఎల్ఎన్జీ సప్లై నిలిచిపోవడం వల్ల దక్షిణాసియా దేశాలే ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. భారత్ దిగుమతి చేసుకుంటున్న ఎల్ఎన్జీలో 53% వాటా ఖతార్, యూఏఈ నుంచే వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ వాటా 72%, పాకిస్థాన్‌లో ఇది 99% మేర ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే గ్యాస్ నిల్వలు నిండుకున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు అటు చైనా ఇంధన భద్రతనూ సవాల్ చేయనున్నాయి. ఇరాన్ నుంచే 80% మేర చమురును దిగుమతి చేసుకుంటోంది డ్రాగన్. ఇక 30% మేర ఎల్ఎన్జీని ఖతార్, యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు ప్రభావం పడే అవకాశముంది. ఇక జపాన్, సౌత్ కొరియా కూడా ప్రభావితం కానున్నాయి. మధ్యప్రాచ్యం నుంచి జపాన్‌కు దాదాపు 75% మేర చమురు దిగుమతి అవుతోంది. నిల్వలు తగ్గిపోయే కొద్ది ధరల ప్రభావం పెరుగుతూ పోతుంది. తైవాన్ కూడా సరఫరా నిలిచిపోవడం వల్ల అవస్థలు పడుతోంది. ఇదంతా చమురు, ఎల్ఎన్జీ సంగతి.
భారత్‌లో పప్పుల ధరలపై ప్రభావం పడే అవకాశం: కొన్ని నిత్యావసర సరకులకూ కటకట తప్పకపోవచ్చు. ఈ విషయంలో భారత్ ఎక్కువగా ప్రభావితం కానుంది. ఎలా అంటే ముందుగా పప్పుల ధరలపై ప్రభావం పడే అవకాశముంది. ఏటా మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి 5-6 మిలియన్ టన్నుల పప్పులు దిగుమతి చేసుకుంటోంది. యుద్ధ ప్రభావంతో సరకు రవాణా జాప్యమైతే ఆ మేరకు ఖర్చులు భరించాల్సి వస్తుంది. భారత్ బాస్మతి బియ్యానికి ఇరాక్, ఇరాన్ అతి పెద్ద మార్కెట్‌లు. సుమారు 45% వాటా ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఈ ఆదాయానికి కోత పడుతుంది.
ఉల్లిపాయలు కూడా పశ్చిమాసియాకు భారత్ నుంచి 15% మేర ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు పోర్ట్‌లు మూసేయడం వల్ల సరకు రవాణా నిలిచిపోయింది. యుద్ధం ఎక్కువ రోజుల పాటు కొనసాగితే ఎగుమతులు ఆగిపోతాయి. ఫలితంగా దేశీయంగా నిల్వలు పెరిగిపోతాయి. ఈ మేరకు నష్టం తప్పకపోవచ్చు. హోర్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల భారత్ నుంచి టెక్స్‌టైల్ ఎగుమతులూ నిలిచిపోయాయి.
భారత్ ఎగుమతులన్నింటిపైనా ఎఫెక్ట్ తప్పదు: ఐరోపా సహా అమెరికాకు వెళ్తున్న షిప్‌లను దారి మళ్లించడం వల్ల 20-25 రోజులు అదనపు సమయం పడుతుంది. ఆ మేరకు ఖర్చులు పెరుగుతాయి. ఇలా కూడా భారం తప్పదు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులూ నిలిచిపోతాయి. ఎరువుల సరఫరా నిలిచిపోవడం వల్ల దేశీయంగా ధరలు పెరిగే అవకాశముంది. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున యూరియా, అమ్మోనియా దిగుమతి చేసుకుంటోంది భారత్. జూన్‌లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆ సమయానికి అనిశ్చితి తొలగిపోతేనే యూరియా కొరతను అధిగమించవచ్చు. వీటితో పాటు నిత్యావసర సరుకులైన సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్‌లు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలపైనా ప్రభావం తప్పదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
వాణిజ్య పరంగా చూస్తే సుమారు 95%, విలువ ఆధారంగా చూస్తే సుమారు 70% మేర సరకులు సముద్రం ద్వారానే రవాణా అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వెస్ట్ ఏషియా పరిసరాల్లోని సముద్ర మార్గంలో ఎలాంటి అలజడి వచ్చినా భారత్ ఎగుమతులన్నింటిపైనా ఎఫెక్ట్ తప్పదు. సరకు చేరవేతలో జాప్యం కారణంగా పలు కాంట్రాక్ట్‌లు రద్దయ్యే అవకాశముంది. బీమా ప్రీమియమ్స్ పెరుగుతాయి. పశ్చిమ భారత్‌లో ఉన్న పోర్ట్‌లు అరేబియన్ సముద్రం, గల్ఫ్‌కు అనుసంధానమైన వాణిజ్యానికి అత్యంత కీలకం.
గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం: ఈ సముద్ర జలాల్లో ఇబ్బందులు ఎదురైతే ఐరోపా, ఆఫ్రికా, అమెరికాతో ఉన్న వాణిజ్యానికి ఎదురు దెబ్బ తగులుతుంది. పశ్చిమాసియాతో వాణిజ్యం ఇబ్బందికరం అనుకుంటే ప్రపంచదేశాలు క్రమంగా ఆధారపడడం తగ్గిస్తాయి. దేశీయంగా ఉత్పత్తి పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాయి. కానీ ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ. ఈ కారణంగా వృద్ధి రేటు తగ్గిపోవడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంటుంది. చివరకు ఇది గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది.
ఏ కోణంలో చూసినా సరే. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటే తప్ప అనిశ్చితి ఇప్పట్లో తొలగిపోయేలా లేదు అన్నది మార్కెట్ వర్గాల అంచనా. అప్పటి వరకు పశ్చిమాసియాపై ఆధారపడిన దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోక తప్పదు. ప్రస్తుతానికి భారత్ వద్ద చమురు నిల్వలు ఉండడం కాస్తంత ఊరట కలిగించే విషయం. మొత్తంగా చూస్తే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం స్థానికంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తోందన్నది స్పష్టం.
అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న గుంటూరు వాసులు - 9 నెలల బాబుతో భయాందోళన
పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాల్చుతున్న యుద్ధం - గల్ఫ్‌లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసాంధ్రులు

