అరకు అభివృద్ధికి పలు వరాలు - త్వరలో మారునున్న రూపురేఖలు
అరకు అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి - పర్యాటకుల కోసం త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్యారవాన్ పార్క్ అందుబాటులోకి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 9, 2026 at 4:39 PM IST
The Landscape Of Araku Is Set To Change: రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన సుందర ప్రాంతం అరకు లోయ. పచ్చని పర్వతాలు, లోయలు, సరస్సులతో పర్యాటకుల మది దోచుకుంటూ ఆంధ్రా ఊటీగా అరకు పేరు గాంచింది. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పర్యాటక రంగం చాలా కీలకం. మంచి ఆదాయ వనరు కాబట్టి ప్రభుత్వాలు కూడా దీనికి చాలా ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఇదే కోవలో ఆంధ్రా ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
జంగిల్ లివింగ్ టూరిజం: అరకు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఇటీవలే అరకు ఉత్సవ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించింది. క్యారవాన్ టూరిజం, జంగిల్ లివింగ్ టూరిజం, టెంట్ సిటీని అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంత స్వరూపాన్ని మారుస్తోంది. దీనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తోడు కానుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరకు అభివృద్ధికి పలు వరాలను ప్రకటించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే అరకులో పర్యాటకం మరింత ఊపందుకునే అవకాశం ఉంది.
అత్యాధునిక సౌకర్యాలతో క్యారవాన్ పార్క్: పర్యాటకుల కోసం త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్యారవాన్ పార్క్ అందుబాటులోకి రానుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి సహా డుంబ్రిగుడ, వాలాబు వద్ద పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు. అరకుకు ఇప్పటికే రెండు రైళ్లతో పాటు అద్దాల కోచ్ కూడా అందుబాటులో ఉంది. హోమ్ స్టే విధానాన్ని పెంచి మరింత మంది పర్యాటకులను అరకు సమీప ప్రాంతాలకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది.
స్థానికులకు కొత్త ఉద్యోగాలు: కేంద్ర ప్రభుత్వం కూడా అరకు అభివృద్ధికి వరాలు ప్రకటించింది. అరకులో ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్, హైకింగ్ సౌకర్యాలను కల్పించనున్నట్లు ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాహస పర్యాటకానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర నిర్ణయం కార్యరూపం దాలిస్తే అరకుకు కూడా పర్యాటకులు వరుస కట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి ట్రెక్కింగ్ ప్రియులు ఇక్కడికు వస్తారు. దీంతో స్థానికులకు కొత్త ఉద్యోగాలు దక్కడంతో పాటు ఇక్కడ వ్యాపార రంగం విస్తరించే సూచనలు ఉన్నాయి. తద్వారా అరకు ప్రాంత అభివృద్ధికి కొత్త బాటలు పడతాయి.
సినీ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా: అరకు, మారేడుమిల్లి, పాడేరు ప్రాంతాలు ఇప్పటికే సినిమా చిత్రికరణకు ఉపయోగపడుతున్నాయి. రానున్న రోజుల్లో షూటింగ్‌లకు మరింత సులువుగా అనుమతులు ఇచ్చి ఈ ప్రాంతంలో సినీ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కదులుతోంది. ఇక లంబసింగిలో ఒక యాత్రి నివాస్ , పాడేరు, అరకులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో భవనాలను నిర్మిస్తున్నారు. ఇక రవాణా పరంగా జాతీయ రహదారి కూడా అరకు తాకుతూ వెళ్లడం వల్ల దాన్ని అందిపుచ్చుకుంటూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
2019 నుంచి 2024 వరకు పర్యాటక రంగం అభివృద్ధి చెందలేదు. కూటమి ప్రభుత్వం పాలించిన ఈ 18 నెలల కాలంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడానికి ఒక ప్రత్యేక ప్రణళికను రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారమే కారణం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం, దీని వల్ల ఈ రంగంలోకి దాదాపు 30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. -కందుల దుర్గేశ్, రాష్ట్ర పర్యాటక మంత్రి
ఇందుకే అరకులో ఉష్ణోగ్రత తక్కువ: అరకు భౌగోళికంగా సముద్ర మట్టానికి 1000 నుంచి 1200 మీటర్లు ఎత్తులో ఏర్పడిన ప్రదేశం. తూర్పుకనుమల్లో ఉన్న ఉదక మండల ప్రాంతం. అందుకే మైదాన ప్రాంతం కంటే అరకు సమీపంలో ఏడు నుంచి పది సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. అందుకే బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రాంతం వేసవి విడిదిగా, శీతాకాల విహార ప్రాంతంగా విరాజిల్లుతూ వస్తోంది. అరకు సమీపంలో పురాతన కాలం నాటి బొర్రా గుహలు ఉన్నాయి. వంపులు తిరుగుతూ, మసక చీకటిలో ఈ గుహల్లో విహరిస్తూ ఉంటే పర్యాటకులకు అది సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది. అరకు విచ్చేసే పర్యాటకులంతా తప్పకుండా బొర్రా గుహలను సందర్శిస్తారు. ఇక్కడి ప్రకృతి అద్భుతాలను వీక్షించి జీవిత కాల అనుభవాలతో తిరిగి వెళతారు. అరకుకు విశాఖపట్నం నుంచి నడుస్తున్న అద్దాల రైలు మరో ప్రత్యేకత. పచ్చని ప్రకృతి అందాలు, సెలయేళ్లు, లోయలు, గుహల మధ్య నుంచి సాగే ఈ అద్దాల రైలు ప్రయాణం మరో సరికొత్త అనుభూతి.
సాహస క్రీడలు, ఆదివాసీ నృత్యాలు: అరకు గురించి అందరికీ తెలిసి ఇక్కడ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నాలుగు రోజుల పాటు అరకు ఉత్సవ్ నిర్వహించింది. సాహస క్రీడలు ఆదివాసీ నృత్యాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, దేశంలోని గిరిజన రాష్ట్రాల నృత్యాలు కనువిందు చేశాయి. ఉత్సవ్‌లో గిరిజన మహిళల కట్టూబొట్టు, ఆభరణాల అలంకరణతో ఏర్పాటైన ఆదివాసీ ఫ్యాషన్ షో అలరించింది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఫ్యాషన్ షోలో సందడి చేశారు. అరకు ఉత్సవ్‌లో మణిపురి కళాకారుల సంప్రదాయ నృత్యం రాస్‌లీలా ఆకట్టుకుంది. కూటమి నాయకులు దొన్నుదొర, గిడ్డి ఈశ్వరి, దాసుబాబు థింసా నృత్యాలు చేశారు. గిరిజన కళాకారుల కొమ్ముకోయ నృత్యం, శ్రీకాకుళం కళాకారుల సవర నృత్యం ఆహుతులను అలరించింది. గాయకుడు రామ్ మిరియాల భీమ్లానాయక్ పాటతో సంగీత విభారిని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, గుమ్మిడి సుధారాణి కూడా అరకు ఉత్సవ్‌లో పాల్గొన్నారు.
ప్రత్యేకమైన రుచి కలిగిన అరకు కాఫీ: ప్రత్యేకమైన రుచి కలిగిన అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అరకు ఉత్సవ్‌ను వేదికగా చేసుకుంది. ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసి పర్యాటకులకు దీన్ని పరిచయం చేసింది. గిరిజన ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఎలాంటి ఎరువులు వాడకుండా పండించిన గింజలతో చేసిన కాఫీని పర్యాటకులు మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి మణిహారంగా ఉన్న అరకు స్వరూపం రాబోయే రోజుల్లో మారబోతోంది. అభివృద్ధి కార్యక్రమాలతో దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించేలా అరకు కొత్త అందాలను సంతరించుకోబోతోంది.
ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించిన అరకు ఉత్సవ్ - పర్యాటకుల్లో జోష్

