ఆ ఉత్పత్తులు ఇక గ్లోబల్ - డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు బంపర్ ఛాన్స్
స్వయం ఏపీ బ్రాండ్ పేరిట ప్రభుత్వం కొత్త కార్యక్రమం - మహిళల ఉపాధికి పూర్తిగా సహకారం - స్వయం ఏపీ బ్రాండ్ పేరిట ఉత్పత్తులకు మార్కెటింగ్ - డ్వాక్రా సంఘాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 5:53 PM IST
Swyam AP Brand Idi Sangati Story : గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుపేద మహిళలకు ఉపాధే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తద్వారా వారికి ఆర్థిక భరోసా అందించింది. ఇప్పుడు వారే మరో పది మందికి ఉపాధి కల్పించాలని మరో భారీ లక్ష్యం పెట్టుకుంది. వారందరూ వ్యాపార వేత్తలుగా మారాలన్న ఉద్దేశంతో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే స్వయం ఏపీ బ్రాండ్. "వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్" అనే సంకల్పాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు సీఎం చంద్రబాబు.
ఇప్పటి వరకూ స్వయం ఏపీ బ్రాండ్ ఓ గ్రామం లేదా పరిసర ప్రాంతాలకే పరిమితమైంది. ఇప్పుడీ పరిధి పెరగనుంది. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులు రాష్ట్ర సరిహద్దులను దాటి దేశ, విదేశాలకు ఎగుమతులు కానున్నాయి. డ్వాక్రా చరిత్రలోనే తొలిసారి స్వయం-ఏపీ బ్రాండ్ పేరుతో ప్రభుత్వమే వీటిని మార్కెటింగ్ చేయనుంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళ్లనున్నాయి.
స్వయం సహాయక సంఘాలు. వీటి ద్వారా మహిళలకు ఎంత లబ్ధి చేకూరుతోందో మార్కెట్‌లో స్పష్టంగానే కనబడుతోంది. రకరకాల ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు. ఇలా అన్ని రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి ఈ సంఘాలు. పైగా వీటి నాణ్యత బాగుండడం వల్ల డిమాండ్ ఉంటోంది. ఇన్ని ఉన్నా వీరి ఉత్పత్తులు స్థానిక మార్కెట్‌కు మాత్రమే పరిమితం అవుతున్నాయి. అందుకు కారణం మార్కెటింగ్ మెళకువలు, ఆకర్షణీయ ప్యాకింగ్ నైపుణ్యాలు లేకపోవడం.
ఈ సమస్య గుర్తించిన కూటమి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు స్వయం ఏపీ పేరుతో ప్రత్యేక బ్రాండ్‌కు రూపకల్పన చేసింది. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తులతో పాటు జనపనార సంచులు, చీరలు, కొవ్వొత్తులు, విస్తరాకులు, అగర్ బత్తీల విక్రయానికి మార్కెటింగ్ పరంగా ఉన్న ఇబ్బందుల్ని దూరం చేయనుంది. ప్రభుత్వమే ఈ ఉత్పత్తుల్ని స్వయం ఏపీ పేరిట ప్రజలకు చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది.
గతంలో ప్రభుత్వం మెప్మా బజార్లు, మార్టుల వంటివి ఏర్పాటు చేసింది. కానీ వినియోగదారుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. వీటి విక్రయానికి మార్కెటింగ్ పరంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 40% యూనిట్ల ఉత్పత్తుల విక్రయాలు ఆశాజనకంగా లేవు. 10% యూనిట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలు ఉన్నాయన్న కారణంగానే ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు వీలుగా స్వయం ఏపీ బ్రాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ - మెప్మా అధికారులు ఇప్పటికే చర్యలు మొదలు పెట్టారు. మొదట పట్టణ వినియోగదారులు లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ - సెర్ప్ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఆ తర్వాత విదేశాల్లోనూ విక్రయాలు జరిగేలా చూస్తారు.
2 ఏజెన్సీలతో ఒప్పందాలు : రాష్ట్రంలో సెర్ప్ పరిధిలో 86 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారు. వీరంతా స్థానికంగా ఉన్న వనరులు, అవసరాలకు అనుగుణంగా రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అయితే సెర్ప్‌కు ఉత్పత్తుల విక్రయాల మార్కెటింగ్‌లో అనుభవం లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి మార్కెటింగ్, నాణ్యత నిర్ధారణ, ప్యాకింగ్ తీరు, లైసెన్సింగ్, న్యాయపరమైన అంశాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడమే కాక శిక్షణ కూడా ఇచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా 2 ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకున్నారు. తొలివిడతలో మార్కెటింగ్ చేపట్టే 60 ఉత్పత్తులను జిల్లాకు 2, 3 చొప్పున ఉండేలా ఎంపిక చేశారు. విక్రయాలకు వీలుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఓఎన్‌డీసీలతో ఒప్పందం చేసుకున్నారు. డిమాండ్ ఉన్న ఉత్పత్తులను తయారీ కేంద్రాల నుంచి తరలించేందుకు గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని విశాఖ, విజయవాడల్లో ఆర్డర్ ప్రాసెసింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు. ఆర్డర్ ప్రాసెసింగ్‌తో పాటు ప్యాకేజింగ్, రవాణా అంతా ఈ కేంద్రాల నుంచే జరుగుతుంది.
ఇక గుంటూరు జిల్లా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే కారం పొడులు, గోంగూర పచ్చడి, మసాలాలు, పండు మిర్చి పచ్చడి, పసుపు పొడులను స్వయం ఏపీ బ్రాండ్ కిందకు తీసుకువచ్చారు. గుంటూరు జిల్లా మిర్చి పంటకు ప్రసిద్ధి. ఇక్కడ ఘాటైన మేలిరకం మిరప పంటను సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో తయారు చేసే కారాలకు, కారం పొడులకు, పచ్చళ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-DRDA, మెప్మా అధికారులు గుంటూరు జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే నాణ్యమైన రుచికరమైన కారం పొడులు, గోంగూర పచ్చడి, చేతితో దంచే మసాలాలు, పండు మిర్చి పచ్చడి, పసుపు పొడులను స్వయం ఏపీ బ్రాండ్ కిందకు తెచ్చేలా చర్యలు తీసుకున్నారు.
గుంటూరు జిల్లా పరిధిలోని తాడికొండ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదకాకాని, దుగ్గిరాల, మంగళగిరి, చేబ్రోలు లాంటి మండలాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు ఒక బృందంగా ఏర్పడి రుచికరమైన నాణ్యమైన కారం పొడులు, పచ్చళ్లు, మసాలాలు, పిండి వంటలను తయారు చేస్తున్నారు. మార్కెటింగ్ మీద పూర్తి అవగాహన లేకపోయినా ఇప్పటికే జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు, విదేశాలకూ తమ ఉత్పత్తుల్ని పంపిస్తున్నారు.
రూ.20 లక్షల వరకు బ్యాంక్ రుణం : వినియోగదారుల నుంచి వీరి ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉండటం గమనించిన డీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వం తీసుకువచ్చిన స్వయం ఏపీ బ్రాండ్ ద్వారా వీరికి మరింత మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇన్నాళ్లు రుచికి, శుచికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన ఈ మహిళలు, ప్యాకింగ్ మీద, మార్కెటింగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టలేదు. ప్రభుత్వం తెచ్చిన ఈ స్వయం ఏపీ బ్రాండ్‌లో భాగంగా అధికారులు వారికి ఆకర్షణీయమైన ప్యాకింగ్ విధానం, తయారీ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నాణ్యత ప్రమాణాలు, ఆన్‌లైన్ మార్కెటింగ్ అంశాలపై శిక్షణ అందించారు. అటు వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలుగా డ్వాక్రా సంఘాలకు రూ.20 లక్షల వరకు బ్యాంక్ రుణంతో పాటు శ్రీనిధి ద్వారా రూ.3 లక్షలు, ఎస్సీ, ఎస్టీ 'ఉన్నతి' పథకం ద్వారా రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తుల్ని పెంచడం ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఈ స్వయం ఏపీ బ్రాండ్ ను ప్రభుత్వం వారధిగా ఎంచుకుంది.
గుంటూరు జిల్లాలో కారం పొడులు, పచ్చళ్లు, మసాలాల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు, పల్నాడు జిల్లాలో అప్పడాలు తయారు చేసే మహిళా స్వయం సహాయక సంఘాలను ఈ స్వయం ఏపీ బ్రాండ్ కిందకు తీసుకువచ్చారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో తయారు చేసే వివిధరకాల అప్పడాలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాలకు సరఫరా అవుతూ ఉంటాయి. స్థానికంగానే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతి అయ్యే ఈ అప్పడాలను స్వయం ఏపీ బ్రాండ్ కిందకు తీసుకురావడం వల్ల డ్వాక్రా సంఘాల ఆదాయం పెంచేందుకు అధికారులు దృష్టి సారించారు. అటు బాపట్ల జిల్లా నుంచి కుప్పడం చీరలను స్వయం ఏపీ బ్రాండ్ కిందకు చేర్చారు. చీరాల పరిసర ప్రాంతాల్లో తయారు చేసే ఈ కుప్పడం చీరలకు డిమాండ్ ఉంది. మన్నికైన, ప్రత్యేకమైన ఈ కుప్పడం చీరలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వయం ఏపీ బ్రాండ్ పరిధిలోకి ఈ చీరలను చేర్చింది. దీని వల్ల ఈ రంగంపై ఆధారపడిన స్థానిక మహిళల ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయనుంది ప్రభుత్వం. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి 60 ఉత్పత్తులను ఎంపిక చేసి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. భవిష్యత్తులో 100 ఉత్పత్తుల్ని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అమ్మకాలు జాప్యమైనా మహిళలు నష్టపోకుండా ఉండేందుకు, సరకు సేకరించే సమయంలోనే నిర్దేశిత ధరను మహిళలకు చెల్లించే వెసులుబాటును కూడా అధికారులు కల్పించారు. ఆన్‌లైన్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో నేరుగా కొనుగోలు చేసేలా రిటైల్ అవుట్‌లెట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది.
60ఏళ్లకు ప్రభుత్వ పెన్షన్ - ప్రతి నెలా కొద్దిగా పొదుపు చేస్తే చాలు!
రూ.15,917 కోట్లు పొదుపు - దేశంలోనే ఏపీ డ్వాక్రా మహిళలు టాప్

