ETV Bharat / opinion

ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకో - వచ్చేస్తోంది గోదావరి

ఎన్నో అద్భుతాలకు నిలయంగా పోలవరం ఎడమ కాలువ నిర్మాణం - కనుచూపు మేర కాంక్రీ‌ట్‌ నిర్మాణంతో కనువిందు చేస్తూ ప్రవాహం - మధ్యలో భారీ అక్విడెక్ట్‌లు, వంతెనలను నిర్మించిన అధికారులు

Polavaram Left Canal
ఎన్నో అద్భుతాలకు నిలయంగా పోలవరం ఎడమ కాలువ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 5:39 PM IST

12 Min Read
Choose ETV Bharat

Polavaram Left Canal : భారీ కొండలను నిలువునా చీల్చడం. కిలోమీటర్ల కొద్దీ నేలను తవ్వడం. బండరాళ్లను పిండి చేయడం. మధ్యలో అడ్డుగా ఉన్న జాతీయ రహదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేపట్టడం. అనుకున్న విధంగా నీరు ప్రవహించాలనే లక్ష్యాన్ని చేరుకోవడం. ఇలా ముందుకు సాగిన ఇంజినీరింగ్ అద్భుతం. ప్రారంభానికి సిద్ధమైన పోలవరం ఎడమ కాలువ నిర్మాణం. అలాంటి ఇలాంటి కార్యక్రమం కాదు ఇది ఓ మహాయజ్ఞం. ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఈ వీడియో చివరి వరకూ చూస్తే అంత పెద్ద మాట ఎందుకు వాడామో మీకే అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్చనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ ప్రత్యేకతలేంటి? ఏ లక్ష్యంతో నిర్మించారు? ఎన్నేళ్ల సమయం పట్టింది? ఎంత ఖర్చు చేశారు? ఇలా ప్రతి ఒక్క డిటైల్​ ఈ వీడియోలో చూద్దాం.

ఎన్నో అద్భుతాలకు నిలయంగా పోలవరం ఎడమ కాలువ నిర్మాణం (ETV Bharat)

పోలవరం ఎడమ కాలువ గురించి తెలుసుకునే ముందు అసలు పోలవరం ప్రాజెక్ట్‌ స్వరూపం ఏంటో ఓ చిన్న లైన్ డయాగ్రామ్‌ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే గోదావరినది పైనుంచి ప్రవహిస్తూ వస్తుంది. మధ్యలో ఈ ఓవెల్‌ షేప్‌లో ఉన్నది పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన జలాశయం. ఇక్కడి నుంచే కుడి, ఎడమ కాలువల ద్వారా గోదావరి నీరు ప్రవహిస్తుంది. అయితే పట్టిసీమ ఎత్తిపోతల సాయంతో ఇప్పటికే కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని దాదాపు 13 లక్షల ఎకరాలకు నీరు అందించింది టీడీపీ ప్రభుత్వం. ఈ నీరు బుడమేరు వాగు మీదుగా ప్రవహించి విజయవాడలోని కృష్ణానదిలో కలిసి ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకుంటుంది.

ఇప్పుడు ఎడమ కాలువ గురించి మాట్లాడుకుందాం. ఈ కాలువ ద్వారా త్వరలోనే ఉత్తరాంధ్రకు సాగు, తాగు నీరు అందనున్నాయి. మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించే ఉద్దేశంతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ కాలువ ద్వారా గోదావరి నీరు ప్రవహించి కణితి, మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లకు చేరుకుంటాయి. ఈ నీరే విశాఖ అవసరాలకు శాశ్వత పరిష్కారం కానుంది. అంటే అక్కడ తాగునీరు అందించడంతో పాటు స్టీల్‌ప్లాంట్ లాంటి పరిశ్రమలకు నీరు అందుతుంది.

AP Govt on Polavaram Left Canal : ఇక ఈ డయాగ్రామ్‌లో కింద కనబడుతున్న ఎస్​ఏసీబీ ఏంటంటే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. అంటే ధవళేశ్వరం ఆనకట్టపై నుంచి వచ్చిన గోదావరి నీరు ఈ ఆనకట్ట ద్వారా డెల్టా ప్రాంతాల్లోని పొలాల్లోకి చేరుకుంటాయి. స్థూలంగా చూస్తే ఇదీ పోలవరం స్వరూపం. ఇక ఇప్పుడు ఎడమ కాలువ పనులకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొంటూరు నేలకుంట సరిహద్దు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడికి గోదావరి ఒడ్డు నుంచి జలాలు తరలించడానికి కొండను తొలిచి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. 914 మీటర్ల పొడవైన సొరంగం 20,000ల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. సొరంగంలో నుంచి ప్రవహించిన గోదావరి జలాలు కేడీఎల్​ శాడిల్ జలాశయానికి చేరుకుంటాయి. ఇక్కడ డ్యామ్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లు తొలగించారు.

2014-2019 టీడీపీ హయాంలో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే ఏలేరు ఆయకట్టుకు నీరందిస్తున్నారు. జగ్గంపేట మండలం రాయవరం వద్ద మరో ఎత్తిపోతల ఏర్పాటు చేసి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత గ్రావిటీ ద్వారా నీరు ఉత్తరాంధ్రకి తరలించనున్నారు. ప్రస్తుతం పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచే ఏలేరు ఆయకట్టుకు అనకాపల్లి వరకు కూడా నీరు తరలిస్తారు. టూకీగా చూస్తే పోలవరం ప్రాజెక్ట్‌ ఎడమ కాలువ వివరాలు ఇవి. అయితే ఈ కెనాల్ భౌగోళిక స్వరూపం ఏంటి? ఎక్కడ మొదలై ఎక్కడి వరకూ ఉంటుంది. ఏయే ప్రాంతాల మీదుగా ఈ కాలువ నిర్మాణం జరిగింది? టోటల్‌గా జియోగ్రఫికల్ మ్యాప్ ఏంటి అనేది ఓ సారి చూద్దాం.

Polavaram Water into Uttarandhra : తూర్పు దిశగా కొండలు, మైదాన ప్రాంతాల మీదుగా నీరు ప్రవహిస్తుంది. కొండ ప్రాంతాల గుండా వెళ్లినప్పుడు కొన్ని చోట్ల సొరంగాలు, ఏర్లు, వాగులను దాటుకుంటూ వస్తుంది నీటి ప్రవాహం. తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి మీదుగా చివరకు విశాఖకు చేరుకుంటుంది. అయితే ఈ మార్గంలో పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లు అత్యంత కీలకం. కాలువ మొదట్లోనే పుష్కర పథకం ఉంటుంది. ఆ తర్వాత పురుషోత్తపట్నం లిఫ్ట్‌ వస్తుంది.

పోలవరం హెడ్‌వర్క్స్, విద్యుదుత్పత్తి కేంద్రాలు పూర్తయ్యేంత వరకు ఈ రెండింటి ద్వారానే నీటిని ఎత్తి పోస్తారు. అక్కడి నుంచి కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం మీదుగా ప్రవహిస్తుంది. ఇక అనకాపల్లిలో నక్కలపల్లి, ఎలమంచిలి ప్రాంతాల మీదుగా విశాఖ వైపు సాగుతుంది. విశాఖలో కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుకుని అక్కడి నుంచి విశాఖ నగరం, స్టీల్‌ ప్లాంట్ సహా ఇతరత్రా పరిశ్రమలకు పైప్‌లైన్ల ద్వారా నీరు అందుతుంది.

ఇప్పటి వరకూ మొత్తంగా 177.58 కిలోమీటర్ల కాలువ నిర్మాణం పూర్తైంది. ఈ కాలువ ద్వారా వచ్చిన నీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తారు. అయితే విశాఖకు చేరుకునే మార్గంలోనే ఏలేరు కాలువ, పంపానది, తాండవ, వరాహ, శారదా నదుల మీదుగా విశాఖకు ఈ నీరు రావాల్సి ఉంటుంది. ఈ మార్గ మధ్యలో అవసరమైన చోట అక్విడెక్ట్‌లు నిర్మించారు. ఆరో ప్యాకేజీ కింద అనకాపల్లి జిల్లాలో చేపట్టిన పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తుని- పాయకరావుపేట మధ్యలో తాండవ నదిపై నిర్మించిన అక్విడక్టు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.

ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి వద్ద కొండలను ఆనుకుని వరహా నదిపై మరో అక్విడక్టు నిర్మాణం టీడీపీ హయాంలోనే మూడొంతుల వరకు నిర్మించారు. వైఎస్సార్సీపీ సర్కార్​ నిర్లక్ష్యానికి గురి కాగా, కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపాదికన కొనసాగించింది. దార్లపూడి సమీపంలో మొదలయ్యే ఈ అక్విడక్టు కిలోమీటరు పొడవు ఉంటుంది. ఈ అక్విడక్టుల నిర్మాణాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాటల్లోనే విందాం. ఇవీ పాయకరావుపేట వద్ద అక్విడెక్ట్ నిర్మాణ వివరాలు.

Polavaram Left Canal Benefits : నిజానికి ఈ ఎడమ కాలువ నిర్మాణంలో ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సాంకేతికపరంగా అత్యున్నతంగా ఉండడంతో పాటు ఎక్కడా నీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇంజినీర్లు. ఆ వివరాలు చూద్దాం. ఈ కాలువ డిజైన్ కెపాసిటీ ప్రకారం చూస్తే సెకన్‌కు 17,500 క్యూసెక్కుల నీటిని మోసుకెళ్లగలదు. ఇక భారీగా వర్షాలు కురిసినప్పుడు గోదావరి నది నుంచి దాదాపు 80 టీఎంసీల నీటిని ఉత్తరాంధ్ర వైపు మళ్లించేలా ఈ కాలువను నిర్మించారు.

ఇక ఈ కాలువ నిర్మించే మార్గంలో ఎన్నో నదులు, వాగులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు అడ్డొచ్చాయి. వాటన్నింటినీ దాటుకుని ప్రత్యేకమైన ఇంజినీరింగ్ ప్రతిభ చూపించారు. ఇందాక మనం ప్రస్తావించిన అక్విడక్ట్ నిర్మాణం అందులో భాగమే. చిన్న చిన్న వాగుల ప్రవాహాలు కాలువకు అడ్డుకుండా సూపర్ పాసేజ్‌లూ నిర్మించారు. నీటి వృథా అరికట్టడం కోసం కాలువ పొడవునా బలమైన కాంక్రీట్ లైనింగ్ నిర్మించారు.

నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకమైన డిజైన్ చేశారు. అసలు ఈ ఎడమ కాలువ నిర్మాణంలో ఏలేరు కాలువతో అనుసంధానించడం అనేదే వ్యూహాత్మకం. ఇలా చేయడం ద్వారా విశాఖ నగరానికే కాక అక్కడి పరిశ్రమలకూ నీరందుతుంది. నగరానికే కాకుండా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకూ శాశ్వత నీటి సదుపాయం కల్పించేలా దీన్ని డిజైన్ చేయడం మరో స్పెషాల్టీ. ఇక మరి కొన్ని ప్రత్యేకతల విషయానికొస్తే.

సాధారణంగా కాలువ మార్గంలో పెద్ద పెద్ద కొండలు అడ్డొచ్చినప్పుడు నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. కానీ ఈ నిర్మాణంలో అలాంటి ఇబ్బంది లేకుండా అత్యాధునిక సొరంగాలు నిర్మించారు. ఈ కాలువ మార్గంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో చిన్న చిన్న పూల్స్ తవ్వారు. నీరు వాలుగా ప్రవహించినప్పుడు వేగం ఎక్కువగా ఉంటుంది. నీటి ఒత్తిడికి కాలువ నిర్మాణం దెబ్బ తినే ప్రమాదముంది.

అలా జరగకుండా మధ్యలో చిన్న చిన్న పూల్స్‌ నిర్మిస్తున్నారు. వేగంగా వచ్చిన నీరంతా ఈ పూల్స్‌ లోకి వెళ్తుంది. అలా వేగం కాస్త తగ్గి మళ్లీ అక్కడి నుంచి నీరు సాధారణంగానే ప్రవహిస్తుంది. ఇలా నీటితో నిండిన పూల్స్ అన్నీ సెకండరీ రిజర్వాయర్లుగా పని చేస్తాయి. ఇక అన్నింటికన్నా కీలకమైంది ఇదో గ్రావిటీ కెనాల్. అంటే ఎక్కడా భారీ పంప్‌లతో పని లేకుండా గ్రావిటీతోనే నీరు ప్రవహించేలా ఇంజినీర్లు డిజైన్ చేశారు.

ప్రాజెక్ట్ వ్యయం : ఎడమ కాలువ నిర్మాణానికి రూ.2900 కోట్ల విలువైన పనులు 2019 నాటికి టీడీపీ సర్కార్ పూర్తి చేసింది. అప్పటి లెక్క ప్రకారం మరో రూ.657 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో వాటిని అటకెక్కించేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లెక్క ప్రకారం ఆ పనులు పూర్తి చేయాలంటే రూ.2049 కోట్లు అవసరమని తేలింది. అప్పటికప్పుడు అన్ని నిధులు భరించడం కష్టమని భావించిన సర్కార్ 9000వ క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి అనువుగా మొదట 7 ప్యాకేజీల్లో పనులకు రూ.1029 కోట్లతో టెండర్లు పిలిచింది. అన్ని ప్యాకేజీల్లో కలిపి రూ.1264.25 కోట్లతో ఒప్పందాలు చేసింది. కానీ పోలవరం ఎడమ కాలువ 17,580 క్యూసెక్కుల పూర్తి ప్రవాహ సామర్థ్యం అనుగుణంగా మార్పులు చేసి పనులు యుద్ధ ప్రతిపాదికన చాలా వరకు పూర్తి చేశారు.

ప్రయోజనాలు : ఈ ఎడమ కాలువ నిర్మాణం ద్వారా కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అందులో మొదటిదివ్యవసాయం. దాదాపు 4 లక్షల ఎకరాల సాగు భూమికి ఈ కాలువ ద్వారా నీరు అందించవచ్చు. ఇక రెండోది తాగు నీరు ఈ కాలువ ద్వారా 611 గ్రామాల్లోని సుమారు 28.50 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. మూడో ప్రయోజనం విశాఖ నీటి అవసరాలు తీర్చడం. విశాఖకు నేరుగా 23.44 టీఎంసీల నీరు అందుతుంది. తాగునీటితో పాటు పలు భారీ తయారీ ప్లాంట్‌లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కూ నీటి సరఫరా అవుతుంది. నీటి వనరులు ఎక్కువగా ఉంటే ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో అభివృద్ధి ఊపందుకునే అవకాశం ఉంటుంది.

ఇంకాస్త వివరంగా చెప్పాలంటే గోదావరిపై ఇప్పటికే పురుషోత్తపట్నం ఎత్తిపోతల, పుష్కర ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఆ రెండింటి ద్వారా గోదావరి వరద సమయంలో వచ్చే సీజన్‌లోనే జలాలు ఉత్తరాంధ్ర భూములను సస్యశ్యామలం చేయనున్నాయి. ఆయకట్టు వివరాలు చూస్తే కేవలం కాలువల నిర్మాణమే కాదు, పోలవరం ప్రాజెక్టు రెండు దశలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర రూపురేఖలు సమూలంగా మారనున్నాయి.

మొత్తం 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో పాటు, అదనంగా మరో 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 28.5 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది. అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా 'పంప్డ్ జనరేషన్' విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలను సజావుగా సాగిస్తూ, 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఉత్తరాంధ్రకు ప్రత్యేకం : మొత్తంగా 4 లక్షల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా ఈ ఎడమ కాలువ నిర్మాణం చేపట్టారు. ఇక్కడే ఓ ముఖ్యమైన పాయింట్ మాట్లాడుకోవాలి. ఉత్తరాంధ్రకు ఇదో గేమ్‌ఛేంజర్ అంటున్నాం. అది ఎలా? మీరు గమనిస్తే ఈ ఎడమ కాలువ కాకినాడ జిల్లా మీదుగా కూడా ఉంది. మరి ఇది ఉత్తరాంధ్ర పరిధిలోకి రాదు. అలాంటప్పుడు ఉత్తరాంధ్ర రూపురేఖలను ఈ లెఫ్ట్ కెనాల్ ఎలా మార్చుతుంది? ఇది అర్థం కావాలంటే ఇంకాస్త క్లియర్‌గా వివరాల్లోకి వెళ్లాలి.

నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు అంటున్నాం కదా. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలోనే సుమారు 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మిగతాది అంటే ఉత్తరాంధ్ర పరిధిలోని అనకాపల్లి, విశాఖ పరిధిలో సుమారు 1.64 లక్షల వరకూ ఆయకట్టు ఉంది. కాకినాడతో పోల్చుకుంటే ఆయకట్టు తక్కువగా ఉన్నా ఉత్తరాంధ్రకే ఇది ఎక్కువ ప్రయోజనాలు అందించనుంది. అదెలా అంటే ఎడమ కాలువ నుంచి వచ్చే ఈ గోదావరి నీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని సుమారు 4.8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. అంటే సుజల స్రవంతికి అనుసంధానం చేయడం ద్వారా భారీ మొత్తంలో ఉత్తరాంధ్రకే మేలు జరుగుతుంది. అందుకే దీన్ని గేమ్‌ఛేంజర్ అంటున్నారు.

మరి ఏమిటంత స్పెషల్? : గోదావరి జలాల రాకతో ఈ ప్రాంతంలో రానున్న అతి పెద్ద మార్పు ఏంటి అనేది చూస్తే వ్యవసాయ రంగ ముఖచిత్రం మునుపెన్నడూ లేని విధంగా మారనుంది. మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది ఈ ఎడమ కాలువ. ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర రైతులు సాగు చేయాలంటే వర్షపు నీటిపైనే ఆధారపడుతున్నారు. భూగర్భ జలాలు సరిపడా లేక పోవడం వల్ల వ్యవసాయానికి ఇబ్బందులు తప్పడం లేదు.

వరి, మొక్క జొన్న లాంటి పంటలు వేసిన ప్రతిసారీ పూర్తి స్థాయిలో వర్షాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. సరైన వర్షపాతం నమోదు కాకపోతే ఆ మేరకు నష్టపోవాల్సిందే. గోదావరి జలాలు అందుబాటులోకి వస్తే ఈ సమస్య తీరిపోతుంది. కేవలం వరితోనే ఆగిపోకుండా ఇక్కడి అన్నదాతలు చెరకు, పత్తిలాంటి పంటలు వేసుకు నేందుకూ అవకాశం దొరుకుతుంది. అంతే కాదు. కూరగాయలు, పండ్ల సాగుకూ వీలవుతుంది. తద్వారా వారి ఆదాయం పెరుగుతుంది. మరి ఈ లెఫ్ట్ కెనాల్‌ ప్రాజెక్ట్‌పై ఉత్తరాంధ్ర రైతులు ఏమనుకుంటున్నారో విందాం.

సవాళ్లు : కాలువ నిర్మాణంలో భాగంగా అనేక సవాళ్లను అధిగమిస్తూ పనులు చేపట్టారు. ఎత్తైన కొండల్ని తవ్వారు. ఏలేరు కాలువను, పంపా, తాండవ, వరాహ వంటి చిన్న నదులను కాలువ దాటాల్సి ఉంది. ఇందుకోసం సైఫన్‌లు, అక్విడక్టులు నిర్మించారు. ఇక పోలవరం ఎడమ కాలువ చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి, కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారిని మొత్తం 9 చోట్ల దాటుతుంది.అక్కడ కూడా వంతెనల నిర్మాణం చేపట్టారు. ఒక్కసారి ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏ విధంగా ఈ కాలువ నిర్మాణం కోసం శ్రమించారో.

పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో ఏళ్ల తరబడి పనులు సాగలేదు. అక్కడ ఉన్న కుమ్మరిలోవ గ్రామస్థులకు పునరావాస ప్యాకేజీపై ఒప్పందం కుదరకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. కాకినాడ జిల్లా కలెక్టర్, కాంట్రాక్ట్ సంస్థ, స్థానిక రెవెన్యూ అధికారులు వారితో చర్చించి, ఒప్పిం చారు. ఆ ఊరిని ఖాళీ చేయించడం ఒక ఎత్తు కాగా కొండల్ని తొలిచి కాలువ స్థాయికి తీసుకు రావడం మరో ఎత్తు. ముందుగా కొండను తొలవాలి. రెండోవైపు కాలువ గట్టు కోసం మట్టిని కట్టగా మలచాలి. ఇందుకోసం కొండల్ని దాదాపు 87 మీటర్ల మేర తొలచాల్సి వచ్చింది. సవాళ్లతో కూడిన ఈ పనులను పది నెలల్లోనే కొలిక్కి తీసుకొచ్చారు.

టైమ్‌లైన్​ : 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తొలి 2 ప్యాకేజీల్లో దాదాపు పనులు పూర్తయ్యాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు జలాశయానికి గోదావరి వరద జలాలు మళ్లించేందుకు నాడు ఆ పనులు వేగంగా చేశారు. ఆ తర్వాత ఏర్పడిన వైఎస్సార్సీపీ సర్కార్​లో ఎడమ కాలువ పనులను పట్టించుకోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీలైనంత త్వరగా అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని రంగంలోకి దిగింది. మిగిలిన పనులకు ఎంత ఖర్చవుతుందో లెక్కించింది. రూ.1028 కోట్ల విలువతో టెండర్లు పిలిచి 2025 జనవరి నాటికి గుత్తేదారులకు పనులు అప్పగించింది. అప్పటి నుంచే పనులు జోరందుకున్నాయి.

2025 అక్టోబర్‌లో గ్రౌండ్‌ వర్క్‌ చేశారు. ఈ ఏడాది మార్చిలో కాంట్రాక్ట్‌లలో మార్పులు చేర్పులు చేశారు. మే నెలలో జులైనాటికి ఈ పనులు పూర్తి కావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అంతే కాదు ఈ కాలువ నిర్మాణానికి సంబంధించిన పూర్తి స్థాయి స్ట్రక్చర్‌ను ఫైనలైజ్ చేశారు. తగ్గట్టుగానే జూన్‌లో పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన సొరంగ తవ్వకాల్లో వేగం పెంచింది. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జులై నాటికి ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయి. ఆగస్టు 14నే ప్రారంభించాలని అనుకున్నా కొన్ని అవాంతరాల కారణంగా ఇది కాస్త ఆలస్యమైంది. అయినా ఈ జాప్యం ఎక్కువ రోజులు కొనసాగకుండా త్వరలోనే పనులన్నీ పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.

విన్నారుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెప్పారో. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో కరవు అనే మాటే లేకుండా చేస్తారని చాలా స్పష్టంగా చెబుతున్నారాయన. తగ్గట్టుగానే పోలవరం ఫేజ్-1 పనులు జరుగుతున్నాయి. 2027 నాటికి ఇవి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది ప్రభుత్వం. ఆలోగానే ఎత్తిపోతల ద్వారా నీరందించేలా ప్లాన్ చేసింది. ఇక పూర్తి స్థాయిలో పోలవరం డ్యామ్ అందుబాటులోకి వస్తే ఈ ఎత్తిపోతలతో పని లేకుండానే నేరుగా కాలువల ద్వారా నీరు అందించొచ్చు. ఇవీ లెఫ్ట్ కెనాల్ పూర్తి వివరాలు. ఇక చివరగా ఒకే ఒక్క మాట చెప్పాలి. పోలవరం ఓ సాగు నీటి ప్రాజెక్ట్ మాత్రమే కాదు. నవ్యాంధ్ర ప్రగతికి ఒక గ్యారంటీ. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా 2027 నాటికి ఈ కల నిజమైతే ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్‌గా మారడం ఖాయం.


కరవు సీమకు "వెలుగు కొండ" - నెరవేరుతున్న దశాబ్దాల కల

రైతుల జీవితాల్లో ఆశాకిరణం 'హంద్రీనీవా సుజల స్రవంతి' - కరవు నేలపై పచ్చదనం