ETV Bharat / opinion

మీ బ్యాంకు అకౌంట్​ ఎవరు వాడుతున్నారు? - పెరిగిపోతున్న మ్యూల్‌ అకౌంట్స్‌ నేరాలు

బ్యాంక్‌ ఖాతాల్లోకి చొరబడుతున్న సైబర్‌ నేరగాళ్లు - ఖాతాదారులకు తెలియకుండానే ఆర్థిక మోసాలు - దేశంలో పెరిగిపోతున్న మ్యూల్‌ అకౌంట్స్‌ నేరాలు - 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలంటున్న పోలీసులు

Mule Accounts
Mule Accounts (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : December 20, 2025 at 5:15 PM IST

6 Min Read
Choose ETV Bharat

Mule Accounts Scam : ఉన్నట్టుండి మీ స్నేహితుల నుంచో, లేదా తెలిసిన వ్యక్తుల నుంచో ఫోన్ కాల్ వస్తుంది. అర్జెంట్‌గా బ్యాంక్ అకౌంట్ నంబర్ కావాలని అడుగుతారు. ఎక్కడి నుంచో డబ్బు వచ్చేది ఉందని, కమీషన్ కూడా వస్తుందని ఆశ పెడతారు. ఆఫర్ బాగానే ఉంది కదా అని వివరాలన్నీ ఇచ్చేస్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది సైబర్ నేరస్థుల గేమ్. ఇలా వచ్చిన వివరాలను వాళ్ల నేరాల కోసం వాడేస్తారు. భారీగా అకౌంట్‌లోకి డబ్బు వచ్చి చేరుతుంది. ఇంత డబ్బెలా వచ్చింది అనుకునే లోపే విత్‌ డ్రా అవుతుంది. ఇలా వాళ్లకు కావాల్సిన ప్రతిసారీ మీ అకౌంట్‌ను వాడేసుకుంటారు. మీకు తెలియకుండానే మీరు సైబర్ నేరాల్లో భాగస్వాములవుతారు. ఈ తరహా మ్యూల్ అకౌంట్ మోసాలు ఇప్పుడు భారీగానే జరుగుతున్నాయి. ఒకటి అర శాతం కమీషన్‌ కోసం కొందరు బ్యాంక్ అధికారులే సైబర్ నేరస్థులతో చేతులు కలుపుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం.

కమీషన్ కోసం ఆశపడి : తెలిసిన వాళ్లు అడిగారని బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చేస్తున్నారా? ఎందుకు? ఏమిటి? అనే కారణాలు కనుక్కోవడం లేదా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. మీకు తెలియకుండానే మీ ఖాతా ద్వారా సైబర్ నేరాలు జరుగుతాయి. ఇదెలా సాధ్యం అనుకోవద్దు. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమే. తెలియకుండానే అకౌంట్ నంబర్లు ఇచ్చి ఇరుక్కుపోతున్న వారు కొందరైతే కమీషన్ కోసం ఆశపడి నంబర్లు ఇచ్చి ఆర్థిక నేరాల్లో పాలు పంచుకుంటున్న వారు మరి కొందరు. ఎలా జరుగుతున్నా సరే. ఈ బ్యాంక్ ఖాతాల ద్వారా భారీ స్థాయిలో సైబర్ మోసాలు నమోదవుతు న్నాయి. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్‌ల ద్వారా జరిగే నేరాలు సైబర్ మోసాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి.

ఖాతాదారులకు తెలియకుండానే సైబర్‌ నేరగాళ్ల ఆర్థిక మోసాలు (ETV)

8.5 లక్షల మేర మ్యూల్ ఖాతాలు : అసలు ఈ బ్యాంక్ ఖాతాల ద్వారా సైబర్ నేరాలు జరగడం ఏంటి? అసలు సైబర్ నేరస్థులు ఈ అకౌంట్స్‌ ఎలా వాడతారు? ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. ఏదైనా ఓ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఓ బాధితుడి నుంచి చోరీ చేసిన డబ్బును రకరకాల అకౌంట్స్‌లోకి బదిలీ చేస్తుంటారు నేరస్థులు. అంటే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్‌కు వెళ్లింది అని ఆరా తీసే లోపే మరో అకౌంట్‌కు డబ్బు బదిలీ అయిపోతుంది. ఇదంతా సైబర్ నేరస్థులకు ఓ ఆట. ట్రాక్ చేయకుండా ఉండేందుకు వేసే ఎత్తుగడ. అయితే ఇలా వాడిన బ్యాంక్ అకౌంట్స్‌ను మ్యూల్ అకౌంట్స్‌గా పిలుస్తారు. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసుల విచారణలో ముందుగా కనిపించేవి ఈ మ్యూల్ ఖాతాలే. వీటి ద్వారానే లక్షలు, కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ చర్చ రావడానికి కారణమేంటంటే..సీబీఐ అధికారికంగా ఇందుకు సంబంధించిన డేటా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 700 బ్యాంక్ శాఖల్లో 8.5 లక్షల మేర మ్యూల్ ఖాతాలను గుర్తించారు. అంటే ఇదంతా ఎంత వ్యవస్థీకృతంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

పకడ్బందీగా ప్లాన్ : సైబర్ నేరగాళ్లు ఈ మ్యూల్ ఖాతాలు వినియోగిస్తున్నారు అని తేలింది సరే. కానీ అసలు వీళ్లకు ఇన్ని లక్షల ఖాతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ 2 విషయాలున్నాయి. ఇలాంటి మ్యూల్ అకౌంట్స్ కావాలంటే కొంత మందికి డబ్బు ఎర వేస్తారు. అంటే ఫలానా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తే ఇంత మొత్తం డబ్బు ఇస్తాం అని బేరాలు ఆడతారు. ఈ బేరం వర్కౌట్ అయిందంటే చాలు. ఆ బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తికి డబ్బు జమ చేసి అప్పటి నుంచి ఆ అకౌంట్ నంబర్‌ను సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన డబ్బు దారి మళ్లించడానికి వినియోగిస్తారు. కమీషన్ కోసం ఆశపడి చాలా మంది ఇలా బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా నాణేనికి ఓ వైపు. ఇక మరోవైపు చూస్తే మాత్రం కొందరు వినియోగదారులు తెలియకుండానే ఈ ఊబిలో కూరుకు పోతున్నారు. వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసి వారి పేరుతో బ్యాంక్ అకౌంట్ తీసుకుని వాటిని ఎడాపెడా వాడేస్తున్నారు. అంటే మీ పేరుమీద మీకు మరో బ్యాంక్ అకౌంట్ ఉందన్న సంగతి కూడా తెలియదు. అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారు.

"నిరుద్యోగులు, మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆఫర్ వస్తుంది. వాళ్లకు ఫలానా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పారు. సైబర్ నేరగాళ్లకు వివరాలు ఇస్తారు. అందులో డబ్బులు వేరే అకౌంట్​లోకి మళ్లించడం జరుగుతుంది. ఇలా రకరకాలుగా చేస్తారు."- పోరెడ్డి మాధవరెడ్డి, సైబర్ నిపుణులు

ఖాతాలపై బ్యాంక్‌లు నిఘా : దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా ఏటా కనీసం 20 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ స్థాయిలో డబ్బుని కొల్లగొడుతూ తప్పించుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతున్నాయి మ్యూల్ అకౌంట్స్. అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్‌లు తెరవడం, వెంటనే అందులో భారీ మొత్తంలో డబ్బు జమ అవడం. ఆ తరవాత విత్‌ డ్రా చేసుకోవడం. ఇదీ తంతు. మూడేళ్లుగా ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయి. అందుకే నగదు ఎక్కువ మొత్తంలో ఒకేసారి జమ అయినా, వెంటనే విత్‌ డ్రా అయినా అలాంటి ఖాతాలపై బ్యాంక్‌లు నిఘా పెడుతున్నాయి. ఈ నిఘా పెరిగే కొద్దీ మ్యూల్ అకౌంట్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యవస్థను ఇప్పుడు దేశమంతా విస్తరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అందుకే లక్షల సంఖ్యలో ఈ ఖాతాల లెక్క తేలింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న మొత్తంలో డబ్బులు జమ చేయడానికి సేవింగ్స్ అకౌంట్స్‌ను వాడుతున్నారు. అదే భారీ నగదు జమ చేయాల్సి వచ్చిన ప్పుడు మాత్రం కరెంట్ అకౌంట్స్‌ వినియోగిస్తున్నారు.

బ్యాంక్ అధికారుల అరెస్ట్ : తెలంగాణలోనూ మ్యూల్ అకౌంట్స్‌ భారీగానే గుర్తించారు. హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్స్ ఎప్పటికప్పుడు ఈ ఖాతాలపై నిఘా పెడుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఇలా మ్యూల్ అకౌంట్స్‌ను వాడుతూ భారీ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా కలిసి 127 మ్యూల్ ఖాతాలు తెరిచినట్టు గుర్తించారు. వీటి ద్వారా రూ.24 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ సమస్యను గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరహా ఖాతాలు గుర్తించేందుకు టెక్నాలజినీ వినియోగిస్తోంది. ఏఐతో పని చేసే MuleHunter.AI టూల్‌ను విస్తృతంగా వాడుతోంది. భారీ మొత్తంలో ఓ ఖాతాలో నగదు జమ అవడం, బదిలీ అవడం లాంటివి గుర్తించినప్పుడు వెంటనే బ్లాక్ చేస్తుంది ఈ టూల్. ఇక ఇలాంటి నేరాలను వెనక ఉండి నడిపిస్తున్న బ్యాంక్ అధికారులనూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఇదంతా జరుగుతోంది. మరి ఎలా గుర్తించాలి. తెలియకుండానే ఇందులో చిక్కుకున్న వాళ్లు ఎలా అప్రమత్తం కావాలి? పోలీసులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ప్రకారం ఎవరైనా సరే వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వేరే వాళ్ల కోసం బ్యాంక్ అకౌంట్స్ తెరవకూడదు. అంతే కాదు. ఈ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు. బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కూడా ఎవరితోనూ పంచుకోకూడదు. పొరపాటున ఈ వివరాలు అందిస్తే మీరు కూడా సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్నట్టే లెక్క. ఇక అనుమానాస్పద కాల్స్‌ను వెంటనే గుర్తించి సమాచారం అందించాలి. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆందోళన చెందకూడదు. అధికారులమని చెప్పి బెదిరించినా సరే అంత సులువుగా నమ్మకూడదు.

1930 హెల్ప్‌లైన్ నంబర్ : మీ ప్రమేయం లేకుండానే భారీ మొత్తంలో డబ్బులు జమ అయినా, విత్ డ్రా అయినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చేందుకు 1930 హెల్ప్‌లైన్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటారు.

ఈజీగా డబ్బులొస్తాయని 'ఖాతా'లు ఇస్తున్నారా? - కమీషన్​కు ఆశపడితే కటకటాలే!

అద్దెకు బ్యాంకు ఖాతాలు - చివరకు పోలీసుల ఎంట్రీతో సీన్​ రివర్స్​!