కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం - ప్రత్యేక ఆకర్షణగా ప్రభలు
కోటప్పకొండలో ఘనంగా సాగనున్న త్రికోటేశ్వరస్వామి జాతర - మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఉత్సవాలు - రాష్ట్రంలో అతిపెద్ద ఉత్సవంగా పేరుగాంచిన జాతర - కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర పండుగగా గుర్తింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 10:06 AM IST
|Updated : February 14, 2026 at 11:28 AM IST
Kotappakonda Prabhalu Festival : కోటప్పకొండ తిరునాళ్లు. రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన పండుగల్లో ఇదొకటి. ఉమ్మడి గుంటూరు వాసులకు ఎంతో ప్రత్యేకమైంది. మహాశివరాత్రి పర్వదినాన జరిగే వేడుకలకు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఐతే ఈ తిరునాళ్లలో ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే, ఈ ఉత్సవం ప్రభల పండగగా ప్రసిద్ధి గాంచింది. ఆయా గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసే ఎత్తైన ప్రభలు తరాలనాటి సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభలు లేకుండా కోటప్పకొండ తిరునాళ్లు జరిగినట్లు చరిత్రలో లేదు. గ్రామంలో పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏటా ప్రభలు కట్టుకుని కోటప్పకొండకు తరలివెళ్తారు. చేదుకో కోటయ్యా ఆదుకో కోటయ్యా అంటూ స్వామి వారికి మొక్కు చెల్లించుకుంటారు.
పల్నాడు ప్రాంతంలో మహా శివరాత్రి అనగానే అందరికి గుర్తుకువచ్చేది కోటప్పకొండ తిరునాళ్లు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చే ఈ జాతర రాష్ట్రంలోనే అతిపెద్ద ఉత్సవంగా పేరుగాంచింది. సర్కారు కూడా కోటప్పకొండ తిరునాళ్లను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఐతే, మహాశివరాత్రి వేళ కోటప్పకొండలో అందరి దృష్టిని ఆకర్షించేవి భారీ విద్యుత్ ప్రభలే. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 100 అడుగుల ఎత్తైన ప్రభలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రభలు కడితే కోటయ్య కొండ దిగి వస్తాడనే నమ్మకంతో ఇక్కడి ప్రజలు వందల ఏళ్లుగా వీటి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మహాశివరాత్రి సమయంలో శివనామస్మరణతో త్రికోటేశ్వర సన్నిధి మార్మోగుతున్న వేళ కోటప్పకొండలోని విద్యుత్ ప్రభలు ప్రత్యేక శోభకు తీసుకొస్తున్నాయి.
ఏటా తరలివస్తున్న లక్షలాదిమంది భక్తులు: త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. స్వామి వారి దర్శనం తర్వాత అందరి చూపు ఉండేది. నింగిని తాకేలా నిర్మించే ప్రభలపైనే. పడవపై తెరచాప మాదిరిగా నిర్మించే ప్రభలు విశేషంగా అకట్టుకుంటాయి. చిలకలూరి పేట మండలం కావూరు, కమ్మవారిపాలెం, మద్దిరాల, యడవల్లి, కోమటినేనివారి పాలెం, గోవింద పురం, గంగన్నపాలెం, బొప్పూడి నుంచి ప్రభలు తరలి రానున్నాయి. వీటితో పాటు నాదెండ్ల మండలం అప్పాపురం, అమీన్ సాహెబ్ పాలెం, కేసానుపల్లి చెందిన ప్రభలు కూడా కనువిందు చేయనున్నాయి.
సుమారు 7 కోట్లకు పైగా ఖర్చు: వీటితో సహా చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నం నుంచి ప్రభలు కలుపుకుంటే మొత్తంగా 11 విద్యుత్ ప్రభలు ఈ ఏడాది కొండకు తరలి రానున్నాయి. ఒకేచోట 10కిపైగా ప్రభలు నిర్మించే ప్రాంతంగా పురుషోత్తమపట్నం కోటప్పకొండ తిరునాళ్ల చరిత్రలోనే ప్రత్యేకత చాటుకుంటుంది. ఈ ప్రభల నిర్మాణానికి సుమారు 7 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.
ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో నెల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు. కలప, వెదురు బొంగులు, కొబ్బరి తాళ్లు, విద్యుత్ దీపాలతో ప్రభలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు నెల రోజులు శ్రమిస్తారు. ముందుగానే ఇరుసులు, రాతిచక్రాలు, డొలుపులు, కమ్ములు సిద్ధం చేస్తారు. వీటిని బిగించిన తరవాత క్రేన్ సాయంతో రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కోటప్పకొండకు కోలాహలంగా తీసుకెళ్తారు. తిరునాళ్లకు నిర్మిస్తున్న ప్రభల ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. 80 నుంచి 90 అడుగుల ఎత్తు ఉండే ఒక్కో ప్రభకు విద్యుత్తు దీపాల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జనరేటర్ సౌకర్యానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు, భోజనాలకు ఇలా ప్రభ నిర్మాణం నుంచి తిరిగి వచ్చే వరకు ఖర్చులు ఉంటాయి. మొత్తం 3 సార్లు ప్రభల ఉత్సవాలు జరుగుతాయి.
ప్రభకు కోటప్పకొండ తిరునాళ్లలో ప్రత్యేక స్థానం: ప్రభలు కొండకు బయలుదేరే ముందు గ్రామంలో ఓ సారి నిర్వహిస్తారు. కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు ఇదే ఉత్సవం ఉంటుంది. తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాతా వేడుక చేసుకుంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయా గ్రామస్థులు ఎక్కడున్నా సొంతూరికి చేరుకుంటారు. అంతా కలిసి చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య అంటూ ప్రభలతో నడుస్తూ కొండకు చేరుకుంటారు. ప్రభలతో కొండకు వెళ్తే తమ గ్రామాలను, కుటుంబాలను స్వామివారు చల్లగా చూస్తారని భక్తుల నమ్మకం.
చిలకలూరిపేట మండలం కావూరు ప్రభకు కోటప్పకొండ తిరునాళ్లలో ప్రత్యేక స్థానం ఉంది. వందేళ్ల క్రితం ఈ గ్రామస్థులు చెక్క ప్రభను నిర్మించి కొండకు తరలించేవారు. కొన్నేళ్లుగా విద్యుత్ ప్రభను నిర్మించి కొండకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు కొండ వద్ద ఐతే, ప్రభ నిలిపేందుకు ప్రత్యేక స్థలం కేటాయించారు. అలాగే, ప్రభల నిర్మాణానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా అప్పట్లో ప్రత్యేక శిలాశాసనం వేయించారు. గ్రామంలోనూ ప్రభను, బండిని నిలిపేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు. గ్రామంలో ప్రభ నిర్మాణానికి కేతినేని, మద్దాలి, కోడె, రామలింగం, మేండ్రు, నాయుడు అనే ఆరు ముఠాలు బాధ్యత తీసుకుంటాయి. అయితే ఏటా వీటిలో ఓ ముఠా ప్రభల నిర్మిస్తుంది.
అర్ధ శతాబ్దానికి పైగా ప్రభలు నిర్మించే ఆనవాయితీ: నరసరావుపేట మండలం గురవాయపాలెం, యలమంద, నరసరావుపేట పట్టణం నుంచి కూడా విద్యుత్, చెక్కలతో చేసిన ప్రభలను పెద్ద ఎత్తున నిర్మిస్తుంటారు. మద్దిరాల గ్రామ ప్రభను ఎప్పటికప్పుడు వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. మొదట ఇనుప చక్రాలతో రూపొందించి ప్రత్యేకత చాటారు. తర్వాత ప్రభల మొత్తాన్ని ఇనుముతో నిర్మించి కొండకు తీసుకెళ్తున్నారు. అర్ధ శతాబ్దానికి పైగా ప్రభలు నిర్మించే ఆనవాయితీని గోవిందాపురం గ్రామస్థులు కొనసాగిస్తున్నారు. ప్రభల పండక్కి దేశ, విదేశాల్లో ఉన్న వారంతా తరలివస్తారు. శివయ్య స్మరణలో నిమగ్నం అవుతారు.
విద్యుత్ ప్రభలు తయారు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్కో ప్రభ తయారీ కోసం సుమారు నెల రోజుల ముందే పనులు ప్రారంభించాలి. అందుకే, గ్రామంలోని వారంతా ప్రభల నిర్మాణంలో భాగం అవుతారు. ఒక్కో ప్రభ 80 నుంచి 90 అడుగుల ఎత్తుంటుంది. ఎత్తైన విద్యుత్ ప్రభలు తయారు చేసేటప్పుడు యువకులు ప్రమాదాల బారిన పడిన సందర్భాలూ ఉన్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి విద్యుత్ ప్రభలు తయారు చేసినప్పటికీ భక్తిభావమే తప్ప కష్టపడుతున్నామనే భావన వారిలో ఎక్కడా కన్పించదు. కుటుంబ పెద్దల ఆదేశాలతో విద్యా వంతులు, యువత ప్రభలు తయారీలో పాల్గొంటారు. ప్రభలపై శివయ్య ప్రతిమతో పాటు తమకు నచ్చిన నాయకులు, సినీ నటుల బ్యానర్లు ఏర్పాటు చేస్తారు.
ప్రభల నిర్మాణం ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రభ తరలింపు సమయంలో వచ్చే ఆటంకాలు ఎక్కువగానే ఉంటాయి. మధ్యలో ప్రభ ఒరిగిపోవడం, ఇరుసులు విరిగిపోవడం జరుగు తుంటాయి. అయితే ప్రభకు ఇరువైపులా పంబతాళ్లు పట్టుకుని నియంత్రిస్తూ ఊరంతా ప్రభ వెంట ఉంటారు. గ్రామానికి చెందిన వాళ్లు ఎక్కడున్నా శివరాత్రి 3 రోజులపాటు ఊరిలోనే ఉండి పోతారు. తరతరాలుగా పాటిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ త్రికోటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

