'రైల్ పార్సిల్' యాప్ సూపర్ సక్సెస్ - ఇంటి వద్దే పికప్, డెలివరీ చేసే సౌకర్యం
రైల్ పార్సిల్ యాప్‌నకు ఆదరణ - ఆరునెలలుగా విజయవంతంగా సేవలు - ఇంటివద్దే పికప్, డెలివరీ చేసే సౌకర్యం - హైదరాబాద్ డివిజన్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు

Published : August 27, 2026 at 3:06 PM IST
|Updated : August 27, 2026 at 5:09 PM IST
South Central Railway Rail Parcel App : ఒక్క క్లిక్ చేస్తే చాలు. అవసరమైనవన్నీ గుమ్మం ముందుకు వస్తున్నాయి. అంతగా మారింది.. టెక్నాలజీ. ఈ మార్పును ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది రైల్వే. దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దకే పార్సల్ పికప్, డెలివరీ అందించే రైల్ పార్సల్ యాప్‌ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వేకు ఉన్న నెట్ వర్క్ ఈ సేవలకు మరింత బలాన్నిచ్చింది. అత్యాధునిక సేవలను యాప్‌లో చేర్చడం ద్వారా వినియోగదారులకు మరింత చేరువైంది. యాప్‌లోనే పార్సల్ సర్వీస్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. చెల్లింపులనూ ఆన్‌లైన్‌లోనే చేసే సౌకర్యం ఉంది. ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ రైల్వే పార్సల్ యాప్‌నకు మంచి ఆదరణే లభించింది.
ఇంటివద్దే పికప్, డెలివరీ సౌకర్యం : ఒకప్పుడు రైల్వే పార్శిల్ ద్వారా ఓ వస్తువుని పంపాలంటే పెద్ద తతంగం. ఆ సేవలందించే స్టేషన్‌కి వెళ్లాలి. ఫామ్ నింపి, క్యూలో నిలబడి ప్యాక్ చేయించి పంపాలి. సామాన్యులు ఆ ఇబ్బందులేవీ పడకుండా కేవలం యాప్ ద్వారానే అదీ ఇంటికే తీసుకెళ్లేలా పార్శిల్ సేవల్ని ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ యాప్‌లో స్టేషన్-టు-స్టేషన్, స్టేషన్-టు-డోర్, డోర్-టు-స్టేషన్, డోర్-టు-డోర్ అనే ఆప్షన్‌లు తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడీ లాజిస్టిక్ సర్వీస్‌లు విజయవంతంగా 6 నెలలు పూర్తి చేసుకున్నాయి.
వినియోగదారుల అవసరాల మేరకు : ఈ సేవలను తీసుకొచ్చే ముందు దక్షిణ మధ్య రైల్వే కొంతకాలం పాటు మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించింది. వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు? డోర్ డెలివరీ సేవలు, మిడిల్ సేవలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇలా అన్నింటిపై అధ్యయనం చేసింది. ఆ తరవాతే రైల్ పార్సల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే - హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రైల్ పార్సల్ యాప్‌ని డెవలప్ చేశారు. ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్‌పై అధ్యయనం చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- ఐఐఎం బెంగళూరుతో అవగాహన ఒప్పందం చేసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే. రైల్ పార్సల్ యాప్ ఫస్ట్ మైల్ అంటే పికప్, మిడ్ మైల్ అంటే రైల్వే ద్వారా రవాణా, లాస్ట్ మైల్ అంటే డెలివరీ సేవలను డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా అనుసంధానించేలా ఈ యాప్ సేవలు తీసుకొచ్చారు. వినియోగదారులు ఇంటి నుంచి పార్సల్ సర్వీస్‌ను బుక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వన్‌స్టాప్ వేదికగా ఈ యాప్ ఉపయోగపడుతోంది.
"రైల్వే పార్సిల్ బుకింగ్‌లో గతంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి. అలాంటి సమస్యలు లేకుండా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. కొత్త విధానంలో తక్కువ ఖర్చుతోనే సులభంగా వినియోగదారుడి ముంగిటకు చేర్చడం జరుగుతుంది. వినియోగదారుడికి చాలా సమయం ఆదా అవుతుంది. పార్సిల్ చేసిన వస్తువు ఎక్కడుందో తెలుసుకునేందుకు లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. డోర్ పికప్, డోర్ డెలివరీ విధానం రైల్వే పార్సిల్ బుకింగ్‌లో ఉంటుంది. ప్రస్తుతానికి ఇది 7 నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం"- శ్రీధర్, ద.మ రైల్వే సీపీఆర్వో
7నగరాల్లో రైల్ పార్సిల్ యాప్ సేవలు : మొదటగా 7 నగరాల్లో రైల్ పార్సిల్ యాప్ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలలో ఈ సర్వీసులని అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఇతర మూడు లాజిస్టిక్ పార్ట్‌నర్స్‌తో కలిసి డోర్ టూ డోర్, మిడిల్ సర్వీసు, మెయిన్ డెలివరీ సర్వీసులు మొదలు పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ డివిజన్‌లో పార్సల్ సర్వీసులు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకూ రైల్ పార్సల్ యాప్‌ను 12,000 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 14,384 మేర స్టేషన్ టూ స్టేషన్ ఆర్డర్లు వచ్చాయి. 360 పార్సళ్లు ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సౌకర్యాన్ని పొందినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతానికి హైదరాబాద్ డివిజన్‌కు పరిమితమైన ఈ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్- ఈ రద్దీ రూట్లలో 11 వేల కిలోమీటర్ల మేర 'ఫోర్ ట్రాక్' లైన్లు- కేంద్రం మాస్టర్ ప్లాన్!
మూడు కొత్త యాప్స్ తీసుకొచ్చిన దక్షిణ రైల్వే- వాటి ఉపయోగాలు ఇవే!

