ETV Bharat / opinion

శీతల ప్రాంతాల్లోని నీటిలో మాత్రమే పెరిగే చేపలు - ఇప్పుడు మన హైదరాబాద్​లో

ఒక్కో చేప బరువు అరకేజీ నుంచి రెండున్నర కేజీలు - 50 కోట్ల వ్యయంతో అతి పెద్ద అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ రాస్ ట్రౌట్ ఫామ్‌ - మరిన్ని అవకాశాలు కల్పించనున్న కేంద్రం

Rainbow Trout Fish Forming In Telangana
Rainbow Trout Fish Forming In Telangana (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 3:06 PM IST

6 Min Read
Choose ETV Bharat

Rainbow Trout Fish Forming In Telangana : ఆక్వా రంగం అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్న సెక్టార్ ఇది. అందుకే ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ కారణంగానే కొన్ని అంకుర సంస్థలు పక్కా ప్రణాళికలతో ఆక్వా రంగంలోకి దిగుతున్నాయి. ఎక్కడో శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగే నాణ్యమైన, ఆరోగ్యకరమైన ట్రౌట్ చేపలు పెంచేందుకు ముందుకొచ్చింది స్మార్ట్ గ్రీన్ ఆక్వా కల్చర్ సంస్థ. చాలా ఖరీదైన ఈ చేపలు ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ శివారు‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ ఫార్మ్ ప్రారంభమైంది. ఉష్ణ మండలంలో ఈ చేపలు పెంచడం కాస్త కష్టమే. అయినా ఈ సవాలును సాంకేతికతతో అధిగమించింది ఈ సంస్థ. ఏఐ సాయంతో దేశంలోని తొలి రెయిన్‌ బో ట్రౌట్ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో : రెయిన్‌బో ట్రౌట్​ అనేది కోల్డ్ వాటర్ ఫిష్. అంటే శీతల ప్రాంతాల్లోని నీటిలో మాత్రమే ఉండగలిగే చేప. సాధారణంగా సముద్ర జలాల్లో ఉండే ఈ చేపలు సంతానోత్పత్తికి కోసం స్వచ్ఛమైన జలాల్లోకి వలస వెళ్తుంటాయి. ఒక్కో చేప బరువు అరకేజీ నుంచి రెండున్నర కేజీల వరకూ ఉంటుంది. ఇప్పుడీ చేప వివరాలన్నీ దేనికి అంటే? ఈ చేపలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరులో 50 కోట్ల వ్యయంతో అతి పెద్ద అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ రాస్ ట్రౌట్ ఫామ్‌ సిద్ధమైంది. ఇక్కడే ఈ రెయిన్‌ బ్రో ట్రౌట్ చేపలను ఉత్పత్తి చేయనున్నారు. భారత్‌లోనే ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

శీతల ప్రాంతాల్లోని నీటిలో మాత్రమే పెరిగే చేపలు ఇప్పుడు హైదరాబాద్ శివారు‌లో (ETV)

భారత్‌కు అరపారమైన అవకాశాలు : నిజానికి ప్రపంచవ్యాప్తంగా మత్స్య రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్‌ కూడా ఈ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. వ్యవసాయ అనుబంధమైన మత్స్య పరిశ్రమ బలోపేతం కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అందుకే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్, ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ రాస్‌ ట్రౌట్ కేంద్రం ఏర్పాటు అందులో భాగమే. స్మార్ట్‌ గ్రీన్ ఆక్వా కల్చర్ అనే అంకుర సంస్థ ఇందుకు ముందుకు వచ్చింది.

కేంద్రం ఏర్పాటుకు ఎన్నో కారణాలు : రాస్​ అంటే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఇందులో ట్రౌట్ చేపలు పెంచుతున్నారు కాబట్టి దీన్ని రాస్ ట్రౌట్ కేంద్రంగా పిలుస్తున్నారు. ఈ ఫార్మ్‌ను ప్రారంభించిన తరవాత కేంద్ర మంత్రులు స్వయంగా పలు విభాగాలను పరిశీలించారు. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్రీన్ ఆక్వా కల్చర్ పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఐతే, ఈ కేంద్రం ఏర్పాటుకు ఎన్నో కారణాలున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మార్కెట్ గురించి. స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ విధానంలో ఉత్పత్తి చేసిన చేపలకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ పెద్ద మార్కెట్ ఉంది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా, దుబాయ్ వంటి దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మిగతా చేపలతో పోల్చితే ఈ ట్రౌట్ రకం చేపలు నాణ్యంగా ఉంటాయి. రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువే. అందుకే విదేశాల్లో అంత డిమాండ్.

"ఈ చేపలకు ముఖ్యంగా కావాల్సింది నీళ్లు చల్లగా ఉండాలి. అలాగే వాటర్​ నిరంతరం ఫ్లో ఉెండాలి. వీటిని చెరువులో వేస్తే అవి చనిపోతాయి. అంతేకాకుండా ఆక్సిజన్ ఎక్కువగా ఉండాలి. ఆ మూడు పెరామీటర్స్​ అత్యంత ముఖ్యమైనవి. అందుకే వీటి కోసం స్టైన్​ లెస్​ స్టీల్​ ట్యాంక్​లను ఏర్పాటు చేశాం." - కొండా విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల ఎంపీ

ఉత్పత్తితో పాటు పెద్ద ఎత్తున ఉపాధి : ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు అంతే భారీగా లక్ష్యాలు పెట్టుకుంది సంస్థ. ముఖ్యంగా సాంకేతికతను వినియోగించుకునే విషయంలో ఓ అడుగు ముందే ఉంది. ఉష్ణమండల ప్రాంతమైనప్పటికీ సంవత్సరం అంతా ఈ చేపలను ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ ఉత్పత్తితో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కల్పించేందుకు సన్నద్ధమైంది.

అంచనాలను మార్చేసిన ప్రాజెక్ట్​ : సాధారణంగా హిమాలయాలు, శీతల పర్వత ప్రాంతాలకే పరిమితమైన ‘రెయిన్‌బో ట్రౌట్’ చేపలు దక్షిణ భారతదేశపు ఉష్ణమండల వాతావరణంలో పెంచుతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చేపల సాగు అనేది ఆయా ప్రాంతాల వాతావరణంపై ఆధారపడి ఉండేది. కానీ, ఈ ప్రాజెక్ట్ ఆ అంచనాలను మార్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో నీటిని నిరంతరం శుద్ధి చేస్తారు. ఇందుకోసం వాటర్ రీసర్క్యులేషన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అందుకే ఇంత వేడి వాతావరణంలోనూ ఏడాది పొడవునా ఈ శీతల నీటి చేపలు పెంచవచ్చని చెబుతోంది స్మార్ట్ గ్రీన్ ఆక్వా కల్చర్ సంస్థ. ఇది కేవలం ఉత్పత్తి కేంద్రంగానే కాకుండా పరిశోధనా సంస్థగా కూడా పని చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ యువత, ఔత్సాహికులు, విద్యార్థులకు ఆటోమేషన్, బయోసెక్యూరిటీ, ఆధునిక ఆక్వాకల్చర్ పద్ధతులపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

మత్స్య రంగానికి రూ. 38వేల 572 కోట్ల ఖర్చు : మత్స్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 38 వేల 572 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంతకు ముందుతో పోల్చితే ఈ పెట్టుబడులు ఎక్కువే. అంటే ఈ రంగంపై కేంద్రం ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోత్సాహకాలకు తగ్గట్టుగా అంకురాలు కూడా రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. శీతల నీటి చేపలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ గ్రీన్ ఆక్వా కల్చర్ సంస్థ వీటిని ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాలకే ఇప్పటి వరకూ ఈ రెయిన్‌ బో ట్రౌట్ చేపల సాగు పరిమితమైంది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఈ వ్యాపారాన్ని విస్తరించేందుకు తొలి అడుగు పడినట్టైంది.

"ఈ చేపలు సాల్మన్​ జాతికి చెందినవి. వీటిని పెంచేందుకు 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. వీటికి సబ్సిడీ కనుక ఇస్తే ఇలాంటివి భారతదేశంలో మరిన్ని వచ్చో అవకాశం ఉంది." -వేణు దంతులూరి, వ్యవస్థాపకులు, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్, సొల్యూషన్స్ సంస్థ

ఈ చేప కిలో ధర రూ. 3 వేలు : మరి ఈ కేంద్రం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ఇది పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఫామ్-టు-కన్జ్యూమర్ మోడల్. 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ హేచరీ. 2 ఎకరాల విస్తీర్ణంలో గ్రో అవుట్ విస్తరించి ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 200 మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ గ్రో-అవుట్ ఫామ్‌లో 44 సర్క్యులర్ ట్యాంకులు ఉన్నాయి. ఏడాదికి 360 టన్నుల చేపలతో ఉత్పత్తి మొదలు పెట్టి క్రమంగా 1200 టన్నుల వరకూ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నది సంస్థ లక్ష్యం. దేశీయంగా ఈ చేప కిలో ధర 3 వేల రూపాయలు. అదే అమెరికా, జపాన్ దేశాల్లో కిలో 4 నుంచి 5 వేల రూపాయలు ధర పలుకుతుంది. పీఎం మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన కింద కేంద్రం పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. విదేశీ మార్కెట్ కోసం ఎన్​ఎఫ్​బీడీ, అపెడా సంస్థలు పూర్తి సమన్వయంతో మద్దతు ఇస్తున్నాయి.

ఆన్‌లైన్ స్టోర్ ద్వారా నేరుగా వినియోగదారులకు : సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కేంద్రంలో ప్రత్యేక హేచరీ యూనిట్లు, ఇండోర్ గ్రో-అవుట్ సిస్టమ్, ఆన్-సైట్ ప్రాసెసింగ్, కోల్డ్-చెయిన్ సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చేపలను నేరుగా వినియోగదారులకు అందించేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి అమెరికాకు ఈ చేపలను ఎగుమతి చేయాలనే ప్రణాళికలతో ఉంది సంస్థ. కాకపోతే ప్రస్తుతం అమెరికాతో వాణిజ్యం విషయంలో కొన్ని సమస్యలున్నాయి. ఇవన్నీ పరిష్కారం కాగానే ట్రౌట్ చేపల ఉత్పత్తి పెంచి ఎగుమతులు కూడా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తోంది.

సరైన ప్రణాళికలు ముఖ్యం : తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రాజెక్టు మొదలు కావడం మత్స్య రంగంలో కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. సరైన ప్రణాళికలు, సాంకేతికత ఉంటే ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించి ఉత్పత్తి పెంచుకోవచ్చు అని ఈ కేంద్రం ఏర్పాటుతో రుజువైంది. భవిష్యత్‌లో ఈ తరహా కంపెనీలు ముందుకొచ్చి మరిన్ని కేంద్రాలు నెలకొల్పితే ఆక్వారంగంలో అంచనాలకు తగ్గ లాభాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

విదేశాలకు మన ఊరి చేపలు - కోహెడలో 13 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎక్స్​పోర్ట్​ సెంటర్

చిన్నారుల గ్రౌండ్​ కోసం గ్రామస్థుల ఫండ్​ రైజింగ్​- చేపలు విక్రయిస్తూ నగదు సేకరణ