ETV Bharat / opinion

ఇప్పటివరకు చూసిన మేడారం వేరు - ఇక నుంచి చూడబోయే జాతర వేరు

జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతర - జాతర సమయానికి రూపుదిద్దుకోనున్న శిల్పాలు - మేడారం శిల్పాలకు ప్రాణం పోస్టున్న ఆళ్లగడ్డ కళాకారులు - అహర్నిశలు శ్రమిస్తున్న శిల్ప కళాకారులు

Medaram Sammakka-Saralamma Jatara
Medaram Sammakka-Saralamma Jatara (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : December 26, 2025 at 2:13 PM IST

6 Min Read
Choose ETV Bharat

Medaram Sammakka-Saralamma Jatara : మేడారం సమ్మక్క-సారలమ్మలను ఒక్కసారి దర్శించుకుంటేనే జన్మ తరించింది అని భావించే భక్తులు కోట్లాది మంది. మరి ఆ తల్లులు కొలువైన గద్దెల ప్రాంగణాల్లో వందల ఏళ్లు నిలిచిపోయే సరికొత్త శిల్ప కళా అందాలను చెక్కే సేవలో పాల్గొనే అవకాశం లభిస్తే అంత కంటే మహద్భాగ్యం ఉంటుందా. ఆ మహద్భాగ్యాన్నే దక్కించుకున్నారు తమ ప్రతిభతో ఖండాంతరాల్లో ఖ్యాతిని దక్కించుకున్న నంద్యాల జిల్లాలోని శిల్ప కళాకారులు. బుధవారం ఆ తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పున:ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరగగా ఆలయం చుట్టూ ఏర్పాటు చేయనున్న మిగతా శిల్పాలకు ప్రాణం పోసే పనిలో నిమగ్నమయ్యారు వీరు. సమ్మక్క-సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుండగా ఆ లోపే ఆ తల్లుల ప్రాంగణాలకు సరికొత్త రూపు ఇచ్చేందుకు వందలాది మంది ఆళ్లగడ్డ శిల్పకళాకారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ఇప్పటివరకు చూసిన మేడారం వేరు - ఇక నుంచి చూడబోయే మేడారం వేరు (ETV)

ఆళ్లగడ్డ కళాకారులకు ఎన్నో ఆలయాల శిల్పాలను చెక్కిన అనుభవమే కాదు, సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. మొదట్లో శిరివెళ్ల మండలం గుంపర్‌మాన్‌దిన్నెలో ఉన్న వీరు 1952లో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వీరు దురుగడ్డ వంశానికి చెందినవారు. మొదట్లో దురుగడ్డ వీరభద్రాచారి, బాలవీరాచారి సోదరులు శిల్పాలు చెక్కడం ప్రారంభించారు. వారి బాటలోనే ప్రస్తుతం వందల మంది శిల్పులు ఆళ్లగడ్డలో శిల్పాలు చెక్కుతున్నారంటే అతిశయోక్తి కాదు. 2018లో శిల్పకళలో ఆళ్లగడ్డకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఎక్కడ ఆలయాలు నిర్మిస్తున్నా అక్కడ వీరు ఉండాల్సిందే. ఇక్కడ వంద శిల్పకళా మందిరాలు ఉన్నాయి. శిల్పులతో పాటు మొత్తం 2,500 మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పని చేస్తున్న శిల్పుల్లో 80 శాతం మంది 45 ఏళ్లలోపు వారు ఉండడం విశేషం. ఇందులో ఎక్కువ మంది వంశపారంపర్యంగా వృత్తిని నేర్చుకున్నవారే.

కోయ గిరిజనుల ఉనికి కోసం పోరాడి వీరమరణం పొందిన సమ్మక్క- సారలమ్మల జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. వారి ఆదివాసీ వంశానికి గొప్ప చరిత్ర ఉంది. ఆత్మగౌరవ ప్రతీక, శౌర్యం, త్యాగాలు ఆ వంశంతో ముడిపడి ఉన్నాయి. వాటన్నింటితో పాటు వారి చరిత్రతో ముడిపడిన ఇతర అంశాల ఆధారంగా ఆళ్లగడ్డ కళాకారులు అద్భుతమైన శిల్పాలకు ప్రాణం పోస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 1996లోనే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే మేడారం రూపురేఖలను మార్చాలని నిర్ణయించి పునరుద్ధరణ పనులను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. జాతర జరిగే ప్రతిసారిలా కాకుండా తాత్కాలిక పనులకు స్వస్తి పలికి మరో వందేళ్లయినా చెక్కుచెదరకుండా ఉండేలా పనులు చేపట్టారు.

గ్రానైట్‌తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలు, శిల్పాలను ఏర్పాటు చేయాలని భావించింది. పనులను ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల కోసం రూ.251 కోట్లను కేటాయించగా, ఇందులో గద్దెల విస్తరణ కోసం రూ.101కోట్లు ఖర్చు చేస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగంగా జరిగేలా చూస్తున్నారు.

మేడారం శిల్పాల పనులు ఆళ్లగడ్డ కళాకారులకు : మేడారంలో గద్దెలు, ఆలయ నిర్మాణాలు ఎవరితో చేయించాలి అనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేసింది. ఆళ్లగడ్డ శిల్పకారుల గొప్పతనం తెలుసుకున్న తెలంగాణ సర్కారు ఎంతో నమ్మకంతో పనులన్నీ వారికే అప్పగించింది. ఈ పనులను గొప్ప బాధ్యతగా భావించిన శిల్పులు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. సమయం తక్కువగా ఉండటంతో వందలాది మంది శిల్పులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తూ పనులు చేస్తున్నారు. విశేషమైన ప్రతిభతో ఎంతో ఆకట్టుకునేలా శిల్పాలు చెక్కుతున్నారు. పనుల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరు ఆళ్లగడ్డలోనే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు. పూర్తయిన శిల్పాలను వెంటనే మేడారం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో శిల్పాలు, గద్దెలు మేడారం చేరుకున్నాయి.

ఒక్కో రాయి బరువు 100 టన్నుల పైనే : మేడారంలో గద్దెలు, ఆలయ నిర్మాణానికి కావాల్సిన శాండ్ స్టోన్, గ్రానైట్ రాళ్లను ఉమ్మడి కడప జిల్లా రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి ఆళ్లగడ్డకు తీసుకొచ్చారు. వీటిలో ఒక్కో దాని బరువు వంద టన్నులకుపైగా ఉంటుంది. వీటిపై గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలను శిల్పులు చెక్కుతున్నారు. ఏకశిల శిల్పాన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మేడారం తరలించే పనిలో ఉన్నారు. చారిత్రక కట్టడాల తరహాలో రాతి గోడలతో ప్రాకారం పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 మీటర్ల ప్రాకారం నిర్మాణం జరుగుతోంది. వీటి మధ్య ఎనిమిది స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. 40 అడుగులతో మూడు, 30 అడుగులతో ఐదు గోడలు ఉంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదురుగా కొంత దూరంలో 50 అడుగులతో ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు.

కోయల సంస్కృతి తెలిపేలా చిత్రాలు : కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా సమ్మక్క, సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా ఆళ్లగడ్డ శిల్పులు రాళ్లకు ప్రాణం పోస్తున్నారు. కోయల వద్ద దొరికిన 930 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఏడు వేల శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులకు అందమైన రూపు ఇస్తున్నారు. కోయల జీవనశైలి, ఆచార సంప్రదాయాలు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డు, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. వీటికి తోడు సమ్మక్క-సారలమ్మ వంశానికి చెందిన సుమారు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వారి చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

50 అడుగుల వెడల్పుతో ప్రధాన ద్వారం : 50 అడుగుల వెడల్పుతో మేడారంలో ప్రధాన ద్వారాన్ని నిర్మిస్తున్నారు. గద్దెల ముందు తెల్లని గ్రానైట్ స్తంభాలతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం ఎత్తు 25 అడుగులు కాగా 5 అడుగుల వెడల్పుతో రెండు వైపులా రెండేసి నిలువు స్తంభాలు, వాటిపై 80 అడుగుల పొడవైన అడ్డు స్తంభం, దాని మీద 60 అడుగుల పొడవైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకోనున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో 8 స్తంభాలను నిలుపుతున్నారు. వీటిపై సమ్మక్క సారక్కలు సహా 3, 4, 5, 6, 7 గొట్టు గోత్రాలను బొమ్మలుగా చెక్కారు.

గద్దెల చుట్టూ బయటివైపు శిలలపై ఆదివాసీ జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలు చెక్కుతున్నారు. ఆళ్లగడ్డలో ఈ పనుల్లో సుమారు 500 మంది కళాకారులు పాల్గొంటున్నారు. ఆళ్లగడ్డ నుంచి మేడారం సుమారు 600 కిలోమీటర్ల దూరం ఉండగా ఇక్కడి నుంచి శిల్పాలను తరలించి మేడారంలో ప్రతిష్ఠిస్తున్నారు.

శిల్పాలపై చిత్రాలు అదనపు ఆకర్షణ : మేడారంలో ప్రధాన ద్వారం ఎడమవైపు నిలువు పిల్లర్ కింది భాగంలో ఎడమ వైపు పిల్లర్ పూర్తిగా మూడో గొట్టు సారక్క వంశంవృక్షం సహా వడ్డే గోత్రం సిద్ధబోయిన, కొక్కెర వంశ వృక్షాలను తెలుపుతుంది. గోవిందరాజుల ప్రధాన గద్దెలపై తిరుపతి వెంకన్న నామాలు, శంఖు, స్వస్తిక్ వంటి చిత్రాలు ఉండగా పలు చోట్ల శివలింగాలు సైతం చెక్కారు. కోయ వంశీకుల్లో గోవిందరాజులు, బేరంబోయిన రాజు కాలాల్లో ప్రకృతి శక్తిగా వెంకన్నను, శివున్ని ఆరాధించినట్లు ఆదివాసీ మూలాలపై పరిశోధనలు చేసిన చిత్రకారులు చెబుతున్నారు. సమ్మక్క తల్లి కొలువుండే చిలకలగుట్ట వైపు నిర్మించిన స్వాగత తోరణం, దానిపై చెక్కిన 59 బొమ్మలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందులో సమ్మక్క వంశీయుల మూలాలు, కోయల సంస్కృతీ సాంప్రదాయాలు, వారు దైవంగా కొలిచే పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి.

మేడారానికి కొత్త కళ - పూర్తైన గద్దెల నిర్మాణం

డిసెంబరు 30 నాటికి మేడారం పనులు పూర్తికావాలి : సీఎం రేవంత్‌రెడ్డి