ETV Bharat / opinion

మద్యం పాలసీ కేసు తీర్పులో ఏం ఉంది? - అసలేం జరిగింది

దిల్లీ మద్యం కేసులో ఊహించని కీలక మలుపు - ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మందికి విముక్తి - అసలు దిల్లీ మద్యం తీర్పులో ఏముంది?

SC verdict in Delhi liquor case
SC verdict in Delhi liquor case (ANI)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 10:42 PM IST

6 Min Read
Choose ETV Bharat

SC verdict in Delhi liquor case : దేశరాజకీయాల్లో కొన్నాళ్లుగా సంచలనాలకు కేంద్రబిందువుగా ఉన్న దిల్లీ మద్యం కేసులు ఊహించని కీలకమైన మలుపు తీసుకుంది. ఎన్నో అభియోగాలు, విమర్శలు, వాదనలు, మరెన్నో పరిణామాలు. మూడేళ్లలో చాలానే జరిగాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా ఇది రాజకీయ కుట్ర అన్నారు. ఆరోపణలు చేసిన వారు.. ముమ్మాటికీ తప్పు జరిగిందని వాదించారు. ఈ భిన్న వాదనలకు తెరదించుతూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ తీర్పు వెలువరించింది. దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి నిందితులుగా సీబీఐ ఛార్జ్‌షీట్‌లలో ఉన్న 23 మందిని అభియోగాల నుంచి విముక్తి చేసింది. విచారణకు తగిన ఆధారాలు లేవంది. వీరిలో దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోదియా, కవిత.. మరికొందరు ఉన్నారు. వీరిపై చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి సీబీఐ సరిపడా ఆధారాలు సమర్పించలేక పోయిందని కోర్టు అభిప్రాయ పడింది. అసలేంటీ దిల్లీ లిక్కర్ పాలసీ కేస్? ఎందుకు ఆరోపణలు వచ్చాయి? తీర్పు సమయంలో కోర్టు ఏం చెప్పింది.

దిల్లీ మద్యం కేసులో సుప్రీం కీలక తీర్పు : దిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నిందితులపై అభియోగాల నమోదుకు సరైన ఆధారాలు లేవన్న తీర్పు తర్వాత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలా భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు మూడేళ్లుగా ఈ కేసుపై రకరకాల వాదనలు జరుగుతున్నాయి. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చాయి సీబీఐ, ఈడీ. లిక్కర్ పాలసీలోని అక్రమాలకు వీరందరికీ సంబంధం ఉందని ఛార్జ్‌షీట్ దాఖలు చేశాయి. ఈ కేసులోనే దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిద్దరిలో కేజ్రీవాల్ 5 నెలలు, సిసోదియా 17 నెలలు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయితే కోర్టు మాత్రం వీరిద్దరితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 23 మందిని విముక్తి చేస్తూ తీర్పు వెలువరించడం కీలక పరిణామం. ఈ తీర్పుపైనే కేజ్రీవాల్ ఇలా స్పందించారు.

ఇంతకీ ఈ కేసులో తీర్పు వెలువరించినప్పుడు కోర్టు ఏం చెప్పింది? ఈ అంశాన్ని కాస్త వివరంగా చెప్పుకోవాలి. ముందుగా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారి పేర్లన్నింటినీ డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించింది కోర్టు. సీబీఐ సమర్పించిన ఆధారాలు సరిపోవని కోర్టు అభిప్రాయ పడింది. సరైన ఆధారాలు లేకుండానే వీరి పేర్లు కేసులో చేర్చారని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో ఎన్నో లోపాలున్నాయని గమనించినట్లు తెలిపింది. కవిత ఆడిటర్‌ బుచ్చిబాబు సహా అభియోగా లు మోపిన 23మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపింది. వారిపై ఉన్న అభియోగాలు నిరూపించడంలో సీబీఐ విఫలమైందని వ్యాఖ్యానించింది.

దిల్లీ రాజకీయాలను కుదిపేసిన కేసు : ఈ మద్యం కేసు దిల్లీ రాజకీయాల్ని కుదిపే సింది. మరి దిల్లీ లిక్కర్ పాలసీ ఎందుకంత వివాదాస్పదమైంది? విమర్శలు, ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు వివరంగా సమాధానాలు చెప్పుకోవాలంటే ముందు అసలీ లిక్కర్ పాలసీ ఏంటో తెలుసుకోవాలి. దిల్లీలో 2021 నవంబర్ 17వ తేదీన కొత్త మద్య విధానం ప్రవేశపెట్టింది అప్పటి కేజ్రీవాల్ సర్కార్. ఇందులో భాగంగానే..రిటైల్ లిక్కర్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగింది ప్రభుత్వం. అంతా ప్రైవేటీకరణ చేసింది. ఇందుకోసం 32 జోన్‌లు ఏర్పాటు చేసింది. ఒక్కో జోన్‌లో 27 దుకాణాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రిటైలర్స్ భారీ ఎత్తున డిస్కౌంట్స్‌ ఇవ్వడమే కాక సొంతగా ధరలు నిర్ణయించేందుకూ అవకాశం కల్పించింది ఈ పాలసీ. హోల్‌సేల్ ప్రాఫిట్ మార్జిన్స్‌ 5% నుంచి 12%కి పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే ఈ పాలసీపై విమర్శలు, సవాళ్లు ఎదురవడం వల్ల ఏడాది తరవాత రద్దు చేయాల్సి వచ్చింది.

2022 జులైలో దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ ఈ మద్యం పాలసీపై ఓ రిపోర్ట్ తయారు చేసి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అందించారు. ఈ విధానంలో అవకతవకలు జరిగాయని, ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయని ప్రస్తావించారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సూచనల మేరకు సీబీఐ 2022 ఆగస్టులో ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. మొదట ఇందులో 15 మంది పేర్లను చేర్చింది. అప్పటి డిప్యుటీ సీఎం మనీశ్ సిసోదియా పేరు కూడా ఈ జాబితాలో ఉంది. తరవాత 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు రావడం వల్ల ఈడీ కూడా రంగంలోకి దిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పీఎంఎల్​ఏ కింద ఓ కేసు నమోదైంది. సౌత్ గ్రూప్‌ నుంచి ప్రతిగా వచ్చిన సొమ్ములో దాదాపు 45 కోట్ల రూపాయలు ఆప్ గోవా ఎన్నికల కోసం వినియోగించిందన్న అభియోగాలూ ఇందులో చేర్చింది.

అసలేంటీ దిల్లీ మద్యం కేసు : దిల్లీ లిక్కర్ పాలసీ అమలు, రద్దు మధ్యలో పలు అవకతవకలు జరిగాయన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఎక్సైజ్‌ పాలసీ సవరించేటప్పుడు వీరు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీలు ఆరోపించాయి. దక్షిణాదికి చెందిన కొందరు వ్యక్తులు ఆప్‌కు లాభం చేకూర్చేలా వ్యవహరించారని ప్రస్తావించాయి. అందుకే వీరందరికీ కలిపి సౌత్ గ్రూప్ అనే పేరు పెట్టింది. కవితతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవ్ మాగుంటతో పాటు శరత్ చంద్రారెడ్డి ఈ గ్రూప్‌ను కంట్రోల్ చేసినట్టు ఆరోపించాయి దర్యాప్తు సంస్థలు. అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, కవిత సీఏ బుచ్చిబాబు గోరంట్ల గ్రూప్ ప్రతినిధులుగా వ్యవహరించారని పేర్కొన్నాయి. లైసెన్స్‌ దారులకు అవసరమైన సాయం చేసి, ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు చెప్పాయి. కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకే ఈ పాలసీ తయారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పటి నుంచే దిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. అరెస్ట్‌లూ మొదలయ్యాయి.

ఎన్నో పరిణామాలు : ముందుగా సీబీఐ 23 మందిపై అభియోగాలు మోపుతూ ఛార్జ్‌షీట్ సిద్ధం చేసింది. వీరిలో దిల్లీ నాటి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, కవిత, ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి. శరత్ చంద్రా రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అభిషేక్ బోయిన్‌ పల్లి, అరుణ్ రామచంద్రి పిళ్లై సహా మరి కొందరి పేర్లున్నాయి. మనీశ్ సిసోదియా సన్నిహితుడు దినేశ్ అరోరా, మాగుంట రాఘవ్, పి. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. టైమ్‌లైన్ ప్రకారం చూస్తే.. ముందుగా అప్పటి ఆప్ కమ్యూనికేషన్ హెడ్ విజయ్ నాయర్‌ 2022 సెప్టెంబర్‌లో అరెస్ట్‌ అయ్యాడు. 2023 ఫిబ్రవరిలో మనీశ్ సిసోదియా అరెస్ట్ అయ్యారు. వెంటనే డిప్యుటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. 2023 అక్టోబర్‌లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, 2024 మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. అదే నెల 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అవడం అప్పట్లో సంచలనమైంది. ఈ అరెస్ట్ తరవాత 2024 సెప్టెంబర్‌లో సీఎం పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్.

లిక్కర్ పాలసీ కేసులో సుప్రీం తాజాగా తీర్పు : అరెస్టైన తరవాత 2024 మే 10వ తేదీన సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. జూన్ 1వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో మధ్యంతర బెయిల్‌కు అప్లై చేశారు కేజ్రీవాల్. జూన్ 2న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ తిహాడ్ జైలుకు వెళ్లి లొంగిపోయారు. అంతకు ముందు రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. 2024 జూన్ 20వ తేదీన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ లభించింది. కానీ ఈడీ సవాల్ చేయడం వల్ల ఆయన విడుదల కాలేదు. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా సెప్టెంబర్ 5వ తేదీన తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది. ఆ తరవాత 2024 సెప్టెంబర్ 13వ తేదీన కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. ఇక ఈ ఏడాది జనవరి 22న రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సమన్లు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని ఈడీ పెట్టిన 2 కేసులనూ కోర్టు తోసి పుచ్చింది. ఇప్పుడు లిక్కర్ పాలసీ కేసులో తీర్పు వెలువరించింది.

దిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు- కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

'న్యాయ వ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం నిలబడింది' : దిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై కవిత