ఎకో టూరిజం హబ్‌గా 'సదాశివకోన' - పర్యాటక రంగానికి ఇక మహర్దశ
సదాశివకోనకు చేరుకునే మార్గంలో సెలయేళ్లు - దశలవారీగా అభివృద్ధి చేసేలా ఓ కార్యాచరణ - పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేలా కసరత్తు - ఇప్పటికే పలు ప్రాంతాలను గుర్తించిన అటవీశాఖ

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 29, 2026 at 8:07 PM IST
Sadashivakona Eco Tourism : దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్లు, పక్షుల కిలకిల రావాలు. ఇవన్నీ వింటుంటేనే మనసు ఎంతో ఆహ్లాదంగా మారుతుంది. పచ్చలహారం వేసుకున్నట్లుండే ప్రకృతి అందాల మధ్య నడిచి వెళ్లడం ఒక మధురానుభూతి. ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తిరుపతి జిల్లాలో ఇలాంటి అద్భుత పర్యాటక ప్రాంతాలకు కొదవే లేదు. అందులో సుందరమైన, రమణీయమైన ప్రదేశం 'సదాశివకోన'. ఆధ్యాత్మిక శోభతో పాటు ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని ప్రతిష్టాత్మక 'ఎకో టూరిజం హబ్'గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
సౌకర్యాలపై ప్రభుత్వ ఫోకస్ : సదాశివకోన ప్రకృతి అందాలకు పర్యాటకులు ముగ్ధులవుతున్నారు. ఇక్కడికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, కనీస వసతులు లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఈ సమస్యను కూటమి ప్రభుత్వం గుర్తించింది. సదాశివకోన అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని భావిస్తోంది. అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనికోసం అటవీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. 'కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం' ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 280 అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో సదాశివకోనను ప్రాధాన్యత గల ప్రాంతంగా ఎంపిక చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమవుతోంది.
సదాశివకోన పర్యాటకులకు నిజంగా ఒక స్వర్గధామం. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ అటవీ ప్రయాణ మార్గం నారాయణవనం వద్ద ఉన్న 'చెల్లూరు జలాశయం' నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గాడిమడుగు, ఆవుల మంద, వెయ్యి లింగాల కోన దాటుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత సదాశివకోన, అమ్మవారి కోన చేరుకుంటారు. దారి పొడవునా పచ్చని చెట్లు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి.
మండే ఎండల్లోనూ సెలయేళ్లు : సదాశివకోనలో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే మండు వేసవిలోనూ ఇక్కడ సెలయేళ్లు పారుతూనే ఉంటాయి. చెల్లూరు జలాశయం నుంచి సదాశివకోన వరకు వెళ్లే దారిలో ఎన్నో జలపాతాలు కనువిందు చేస్తాయి. సుమారు 15 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రయాణంలో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పరవశించిపోతారు. నిత్యం పర్యాటకులతో పాటు పౌర్ణమి, కార్తీక మాసం, సోమవారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
దారిపొడవునా మామిడి, అర్జున, జాలారి లాంటి భారీ వృక్షాలు చల్లని నీడనిస్తాయి. వీటి కింద పర్యాటకులు సేదదీరుతుంటారు. మొక్కల మడుగు, ఆవుల మంద, గాడి మడుగు లాంటి స్పాట్స్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. మార్గమధ్యంలో 'యానాది చెంగయ్య గుట్ట' వస్తుంది. అక్కడికి వెళ్లే భక్తులు ఆయనను స్మరించుకుంటూ రాళ్లను పేర్చి వెళ్లడం ఒక ఆనవాయితీ. ఎకో టూరిజం కింద త్వరలోనే ఇక్కడ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
మహా శివుని సదాశివకోన క్షేత్రం : సెలయేళ్లు, గుట్టలు దాటుకుని వెళ్తే ప్రముఖ శైవక్షేత్రం 'సదాశివకోన'కు చేరుకోవచ్చు. ఇక్కడి జలపాతాన్ని చూస్తే మహాకవి శ్రీనాథుడు చెప్పిన 'గంగ విడుము పార్వతి చాలును' అన్న పద్యం కచ్చితంగా గుర్తుకు వస్తుంది. మర్రి ఊడల నుంచి నీరు జాలువారుతున్న దృశ్యం సాక్షాత్తూ పరమశివుని జటాజూటాన్ని తలపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ క్షేత్రానికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మహాశివరాత్రి పర్వదినాన సుమారు 50,000 నుంచి 60,000 మంది భక్తులు పోటెత్తుతారు. ఇక్కడి పవిత్ర జలపాతంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సదాశివునితో పాటు సమీపంలోని కామాక్షి అమ్మవారు, రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుంటారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ స్వామివారికి విశేష పూజలు, అన్నదానం నిర్వహిస్తారు.
సదాశివకోనకు ఎలా వెళ్లాలి? : సదాశివకోనకు చేరుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. పుత్తూరు నుంచి నాగిలేరు వరకు వెళ్లాలి. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల మేర అడవిలో కాలినడకన చేరుకోవాలి. వడమాలపేట నుంచి కూడా సుమారు 8 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించాలి. గుడిమల్లం, పాపనాయుడుపేట వైపు నుంచి బైక్‌లు, జీపుల ద్వారా దాదాపు 14 నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించి నేరుగా స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు.
నిరుపయోగంగా ఎకో టూరిజం ప్రాజెక్టు - అరకు పర్యాటకంలో నిర్వహణ లోపాలు
ఎకో ఫ్రెండ్లీ 'నెట్ హౌస్'- అకాలవర్షాలు, కీటకాల సమస్యలకు చెక్- రైతులకు స్థిర ఆదాయం

