భారీగా పెరిగిన నిత్యవసరాల ధరలు - సతమతమవుతున్న సామాన్యుడు
నెల రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు - తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా సామాన్యుడికి ధరల సెగ - నెలలోనే కొన్ని ప్రాంతాల్లో రెట్టింపైన ఉల్లి ధరలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 3, 2026 at 2:27 PM IST
Rising Prices Of Essential Commodities : జీవకోటికి ప్రాణాధారం వర్షాలు. ఎల్‌నినో ప్రభావంతో గత మూడు నెలలుగా దేశంలో వానలు అంతంతమాత్రంగానే కురుస్తున్నాయి. ఫలితంగా అనేక రకాల పంటల దిగుబడులు తగ్గిపోయాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బియ్యం, చక్కెర, కూరగాయలు ఇలా ఏ వస్తువు ధరలు చూసినా గత నెల రోజుల వ్యవధిలో దాదాపు 50 శాతం పెరిగాయి.
తెలుగు రాష్ట్రాలదీ అదే పరిస్థితి. దీంతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. పెరిగిన బడ్జెట్‌ను భరించలేక సతమతం అవుతున్నాడు. పరిస్థితులు చూస్తూ ఉండే రాబోయే రోజుల్లో మరింత భారం మోయకతప్పని పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎల్‌నినో ఒక్కటే ధరల పెరుగుదలకు కారణమా. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా. వీటిని అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి.
50 శాతం ధరల పెంపు : వరుస పండగలు, పెళ్లిళ్లతో దేశమంతా ఒకటే సందడి. మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి. ఇలాంటి శుభకార్యాలు అంటే సాధారణంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో పులి మీద పుట్రలా నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బియ్యం, పప్పులు, చక్కెర, ఉల్లి, పాలు ఇలా రోజూ వినియోగించే వాటి ధరలు గత నెల రోజుల వ్యవధిలో కాస్త అటూ ఇటూగా 50శాతం పెరిగాయి. ఉల్లి ధరలైతే కొన్ని ప్రాంతాల్లో రెట్టింపయ్యాయి కూడా. పశ్చిమాసియా యుద్ధం తర్వాత గ్యాస్ సిలిండర్ ధర 90 రూపాయలు పెరగగా ఇప్పుడు దానికి నిత్యావసర వస్తువుల ధరలు తోడయ్యాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్యుడు సతమతం అవుతున్నాడు. నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడంతో ఈ భారాన్ని మోయలేకపోతున్నాడు. అయితే ఈ పెరుగుదల ఇక్కడితోనే ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మరింత భారం తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
దేశవ్యాప్తంగా నాణ్యమైన సన్న బియ్యం ధరలు రెండు నెలల క్రితం రకాన్ని బట్టి కిలో 50 రూపాయల నుంచి 55 రూపాయలు ఉండగా ఇప్పుడు 63 రూపాయల నుంచి 70 రూపాయల మధ్య ఉంటోంది. పైగా ఈ బియ్యం నాణ్యంగానూ ఉండడం లేదు. 26 కేజీల బియ్యం ధర నెల క్రితం 1650 రూపాయలు ఉండగా, ఇప్పుడు 1830 రూపాయలకు పెరిగింది. ఇక ఉల్లిగడ్డ ధర నెలరోజుల వ్యవధిలోనే రెట్టింపైంది. జూన్ మొదటి వారంతో పోలిస్తే వెల్లుల్లి ధరలు కూడా వంద శాతం పెరిగాయి. కూరగాయల స్టోర్లలో అయితే సాధారణ మార్కెట్ల కంటే వంద రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. వంట నూనెల ధరలు కేజీకి 4నుంచి 5రూపాయలు పెరిగాయి. అనేక రకాల కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. రోజూ వినియోగించే వస్తువులు కావడంతో వాటి ధరల పెరుగుదల వల్ల ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నారు.
"ఇరాన్-అమెరికా ఘర్షణ కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నట్లే, దానికి సంబంధించిన ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అలాగే ఈ ఏడాది 'ఎల్ నినో' ప్రభావంతో రుతుపవన వర్షపాతం లోపించింది. తగినంత వర్షం లేకపోవడం ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో ధరలు పెరిగాయి" -డా. బచ్చు అనిల్ కుమార్, ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్
దాదాపు 10- 20 రూపాయల వరకు పెరిగిన ధరలు : తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో సోనామసూరీ, సన్నరకాలకు చెందిన బియ్యం కేజీ 55 రూపాయల నుంచి 75 రూపాయల మధ్య ఉంది. కందిపప్పు కేజీ 115 రూపాయల నుంచి 125 రూపాయల మధ్య పలుకుతోంది. మినపప్పు కేజీ 120 నుంచి 135 రూపాయల మధ్య ఉంది. పెసరపప్పు కేజీ 100 నుంచి 110 రూపాయల మధ్య, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు 185 రూపాయల నుంచి 195 రూపాయల మధ్య ఉంది. పల్లీ నూనె లీటరు 170 నుంచి 190 మధ్య, పామాయిల్ లీటర్ 95 నుంచి 105 రూపాయల మధ్య ఉంది. చక్కెర కేజీ 42 రూపాయల నుంచి 65 రూపాయల మధ్య ఉంది. కొన్ని ప్రాంతాల్లో 70 నుంచి 75రూపాయలు కూడా పలుకుతోంది. నాలుగు నెలల క్రితం కేజీ చక్కెర ధర కాస్త అటూ ఇటూగా 50 రూపాయలు ఉండేది. వెల్లుల్లి కేజీ 180 రూపాయల నుంచి 220 రూపాయల మధ్య ఉంది. పెద్ద ఉల్లిగడ్డ ధర మండీల్లో కేజీ 45 రూపాయలు ఉండగా, రీటైల్ మార్కెట్‌లో 50 రూపాయల నుంచి 59రూపాయల మధ్య ఉంది.
వెల్లుల్లి కేజీ 180 నుంచి 220 రూపాయల మధ్య ఉంది. ఇక టమాటా కేజీ 21రూపాయల నుంచి 25, ఆలుగడ్డ 30 రూపాయల నుంచి 35రూపాయల మధ్య ఉంది. పచ్చిమిర్చి ధర కేజీ 70రూపాయల వరకు పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూరగాయల ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అంటే కాస్త అటూ ఇటూగా ఉంటున్నాయి.
ఇతర రాష్ట్రాలల్లోనూ ఇదే పరిస్థితి : తెలంగాణలో కూడా గత కొన్ని రోజులతో పోలిస్తే కూరగాయలు, బియ్యం సహా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చిల్లర మార్కెట్లో సన్న బియ్యం రకాలు, నాణ్యత బట్టి కిలో ధర 60 నుంచి 75 రూపాయల మధ్య ఉంది. నెల కిందట క్వింటాల్ బియ్యం ధర 5500 నుంచి 5800 రూపాయల మధ్య ఉండగా, టోకు మార్కెట్లో ఇప్పుడు 6000 నుంచి 6500 రూపాయలు పలుకుతోంది. కంపెనీల వారీగా బాస్మతి బియ్యం ధర కిలో 100 నుంచి 200 రూపాయలు వరకు ఉంది. ఎర్ర ఉల్లిపాయ కిలో ధర నెల కిందట 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 రూపాయలు పెరిగింది. నాణ్యత బట్టి కిలో 70 రూపాయలు కూడా నడుస్తోంది. అదే తెల్ల ఉల్లిపాయ ఏకంగా కిలో ధర 100 రూపాయలకు చేరువులో ఉంది. హైదరాబాద్ జంట నగరాల్లో రైతుబజార్లలో కూరగాయల ధరలను పరిశీలిస్తే పచ్చిమిర్చి కిలో ధర 100 రూపాయలు ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇక క్యారట్ కిలో 50 రూపాయలు ఉండగా, బీన్స్ వంద, చిక్కుడు 60, టమాట 25 నుంచి 30 రూపాయల మధ్య ఉంది. బెండకాయ కిలో ధర 45 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య ఉండగా, కాకరకాయ కిలో ధర 50 రూపాయలు ఉంది. గత కొన్ని రోజులతో పోలిస్తే ఇది కాసింత ఎక్కువే.
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతా ఎల్‌నినో ప్రధాన కారణంగా చెబుతున్నా అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ఈ సీజన్‌లో పండిన పంటలు వర్షాకాలం ముగిసిన తర్వాతే వస్తుంది. గత సీజన్‌లో ముగిసిన పంటలే ఇప్పుడు మార్కెట్‌లో ఉంటాయి. అందువల్ల వర్షాలు తగ్గడం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం లేదు. గత సీజన్‌లో పంట దిగుబడులు తగ్గడం ఒక కారణం. అయితే ప్రధాన కారణం మాత్రం ఎల్‌నినో పేరు చెప్పి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి వస్తువులను దాచిపెడుతున్నారు. వాటిని మార్కెట్‌లోకి రాకుండా అట్టి పెడుతున్నారు. ఇక పశ్చిమాసియా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల వల్ల సప్లై చైన్ దెబ్బతిన్నది. అందువల్ల వంటనూనెలు, గోధుమలు వంటి వస్తువుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఉల్లి విషయానికి వస్తే హైదరాబాద్‌కు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి తక్కువగా వస్తోంది. అయితే మహారాష్ట్రలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ పంట ఆలస్యమైంది. నిల్వ ఉన్న పంట తడిచిపోవడంతో సరఫరా తగ్గింది. కూరగాయల దిగుబడులు కూడా తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయాయి.
ఎల్నీనో ప్రభావం కూడా కారణం : ధరలు పెరిగినపుడు వాటి నియంత్రణకు చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. అందుకోసం ప్రధానంగా వ్యవసాయంలో ప్రత్యేక ప్రణాళికలు తీసుకురావాలి. ముఖ్యంగా రైతులకు సాగు, అమ్మకంతోపాటు నిల్వ సదుపాయాలు కల్పించాలి. నేరుగా ప్రభుత్వమే కొనేలా చర్యలు తీసుకోవాలి. సీజన్ బట్టి ఆహార పంటల ఉత్పత్తుల సాగు పెంచడం తగ్గించడం లాంటివి చేయాలి. దేశీయ అవసరాలను బట్టి అన్ని ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహించాలి. అలాగే ప్రజలను దోచుకుంటున్న దళారీ వ్యవస్థపై నిఘా పెట్టి రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అప్పుడు మాత్రమే ధరలు అదుపుచేసే ప్రయత్నం సఫలం అవుతుంది. ఎల్‌నినో వల్ల వర్షాలు చాలా తక్కువగా కురిసి దిగుబడులు తగ్గుతాయని నిపుణులు ఎప్పుడో హెచ్చరించారు. అందువల్ల ముందే అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ పని సరిగా నిర్వర్తించలేదనే విమర్శలు ఉన్నాయి. అందువల్ల వానాకాలం పంట దిగుబడులు రాకముందే ధరలు పెరుగుతున్న పరిస్థితి. ఎల్‌నినో పేరు చెప్పి కృత్రిమ కొరతతో వ్యాపారులు చేస్తున్న మాయాజాలం వల్లే ప్రస్తుత పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత కూరగాయలు, ఇతర పంటల దిగుబడి తగ్గితే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. ధరలు తగ్గడం మాట అటుంచితే పెరిగే సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
కొబ్బరి చిప్పలకు సరికొత్త రూపం - విదేశాలకు సైతం ఎగుమతులు
అరటి నారతో అలంకరణ వస్తువులు - మహిళల జీవితాలను మార్చేసిన ఆలోచన

