ఉప్పు మడుల్లో కష్టాల సాగు - గిట్టుబాటు ధర రాక అల్లాడుతున్న రైతులు
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఉప్పు రైతుల కష్టాలు - శ్రమ, ఖర్చుతో పోల్చితే అరకొరగా గిట్టుబాటు ధరలు - ఉప్పు సాగు కోసం పెట్టుబడులు పెట్టే దళారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2026 at 1:38 PM IST
Ongole Salt Farmers Issues : మనం చేసే రోజువారీ వంటలో తప్పక వాడే పదార్థం ఏదీ అంటే వచ్చే సమాధానం ఉప్పు. ఇది లేని కూర ఊహించడానికే కష్టం. అలాంటి పదార్థానికి ఇప్పుడు కష్టం వచ్చింది. ఉప్పు పండించే రైతులు గిట్టుబాటు ధరలేక విలవిల్లాడుతున్నారు. తెచ్చిన అప్పులు పెరిగిపోయి నష్టాలను చవిచూస్తున్నారు. దళారులు సిండికేట్ కావటంతో వారు చెప్పిన ధరకే ఉత్పత్తిని విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఎర్పడింది. దీంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. సరైన సౌకర్యాలు కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం ఉప్పు రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం.
ధరలు లేక అల్లాడుతున్న రైతులు : ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరానికి చేరుకున్నాక ఎండలో తెల్లగా మెరిసే ఉప్పు మడులు ఒక అందమైన దృశ్యంలా కనిపిస్తాయి. ఆ తెల్లటి గుట్టల మీద పడే సూర్యకిరణాలు మిరుమిట్లు గొలిపిస్తాయి. కానీ ఆ వెలుగుల వెనుక వేలాది కుటుంబాల చెమట, కష్టాలు, అప్పుల భారంతో నిండిన జీవితం దాగి ఉంది. కారణం ఉప్పు పండించే రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడమే.
"సాధారణంగా ఇతర వృత్తులతో పోల్చితే ఉప్పు తయారీ ఎంతో శ్రమతో కూడుకున్న పని. రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని ఉప్పు చేతికి రాదు. అయితే ఇంత కష్టపడితే తీరా అమ్మబోతే సరైన ధర రాక పడ్డ శ్రమ అంతా వృధా అవుతోంది." -వెంకట్రావు, ఉప్పు రైతు, కొత్తపట్నం
ప్రభుత్వం స్పందించాలంటున్న రైతులు : గతేడాది మొంథా తుపాను ఉప్పు రైతులను పూర్తిగా దెబ్బతీసింది. ఈ ఏడాది పంటకు అధికంగా పెట్టుబడి వ్యయం అయిందని అయినా సరైన ధర మాత్రం రావడం లేదని రైతులు వాపోతున్నారు. పంట వేసేందుకు ముందుగా దళారులు పెట్టుబడులు పెట్టి, తీరా చేతికొచ్చేసరికి తక్కువ ధరకు అడుగుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఉప్పునకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
రోడ్లు వేయించాలని కోరుతున్న రైతులు : ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంతో పాటు మోటుమాల గ్రామంలో సుమారు 4 వేల 500 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. 800 మందికి పైగా రైతులు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మోటుమాలలో 3వేల ఎకరాల్లో 600 మంది సాగు చేస్తుండగా, కొత్తపట్నంలో 1500 ఎకరాల్లో, 200 మంది సాగు చేస్తున్నారు. గతంలో ఎకరాకు 70 వేల రూపాయల వరకు ఖర్చులయ్యేవి. కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో ప్రస్తుతం దానికి మించి పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి నెలకొంది. కనీసం పెట్టిన డబ్బులు కూడా రావడంలేదని రైతులు అంటున్నారు. గతంలో 17.5టన్నుల ఉప్పు ధర 70వేల రూపాయలు పలికేది. ప్రస్తుతం 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు మాత్రమే ఉంటోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉప్పు కొటారుల్లోకి లారీలు, ట్రాక్టర్లు వెళ్లి తిరిగి రావడానికి కూడా సరైన రోడ్లు కూడా లేవు. కాబట్టి ప్రభుత్వం రోడ్లు వేయించాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్‌ను కుడా రాయితీపై ఇస్తే ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని అంటున్నారు.
ఇతర రాష్ట్రాలకు ఉప్పు ఎగుమతి : కొత్తపట్నం ప్రాంతం నుంచి ఏటా వెయ్యి లారీల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు ఉప్పు ఎగుమతి అవుతుంది. గోదావరి జిల్లాల్లోని రొయ్యల చెరువుల్లో నీటి కాఠిన్యతను పెంచడానికి కొత్తపట్నం ఉప్పు కీలకం. ఈ సారి దిగుబడి బాగా వచ్చినా దళారుల దందానే సాగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా దళారులు ముందుగానే డబ్బులు ఇస్తారు. పంట తమకే విక్రయించాలని ఒప్పందం చేసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర ఉన్నా దళారులు మార్కెట్లో ధర లేదని చెబుతూ తక్కువ మొత్తం ఇవ్వజూపుతున్నారని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులకు ముందుగానే డబ్బులు తీసుకున్నందున తప్పని సరిగా వారికే అమ్ముకోవాల్సి వస్తుందంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉప్పును మడుల నుంచి బయటకి తెచ్చిన తర్వాత ఆరబెట్టుకునే ప్రాంతాన్ని నట్టు అంటారు. ఆ స్థలం కూడా సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానిని కూడా ఏర్పాటు చేస్తే ఉప్పు రైతులకు ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు
70 కిలోల బస్తా 100 రూపాయలకే : గత ఏడాది 15 టన్నుల ఉప్పు ధర 75 వేల రూపాయలు పలికితే ఈసారి అదే ఉప్పు 35 వేల రూపాయలకే పరిమితమైంది. 70 కిలోల బస్తా కేవలం 100 రూపాయలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఉప్పు సాగు ఏడాదిలో కేవలం నాలుగు నుంచి ఐదు నెలలపాటు మాత్రమే జరుగుతుంది. ఈ కొద్దికాలంలోనే సంపాదించి ఏడాది గడపాలి. కానీ దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేక కుటుంబాలను నడపడం కష్టంగా మారుతోంది.
ఉప్పు తయారీలో అనేక ప్రక్రియలు : ఉప్పు సాగులో అనేక ప్రక్రియలు ఉంటాయి. సముద్రం సమీపంలో బోర్లు వేసి నీటిని తోడుతారు. ఆ నీటిలో కేవలం 5 శాతం కాఠిన్యత ఉంటుంది. ఆ నీటిని మడుల మాదిరిగా నిల్వ చేసి ఎండబెడతారు. కాఠిన్యత 18శాతం వచ్చే వరకు అలా చేయాలి. అది ఒకరోజులో జరిగేది ప్రక్రియ కాదు. రోజుల తరబడి సూర్యుడి కిరణాల కోసం ఎదురు చూడాలి. మడులు సిద్ధం చేయడమే ఒక కష్టమైన పని. బురదను తొలగించి నేలను గట్టిగా చేయడానికి కూలీలు కాళ్లతో తొక్కుతారు. అది గచ్చు మాదిరిగా మారిన తర్వాతే ఉప్పు తయారీ మొదలవుతుంది. తర్వాత నీటిని సాళ్ల రూపంలో మడుల్లోకి వదిలితే, సూర్యుడి వేడి కింద అది మెల్లగా స్ఫటికాలుగా మారుతుంది. వారానికి ఒకసారి ఉప్పు తయారవుతోంది.
అమ్మకాలకు లేని సరైన ధరలు : ఉప్పు సిద్ధమైన తర్వాత కూలీలు మడుల నుంచి తీసి గట్టుపై ఉన్న నట్టుల దగ్గర పోస్తారు. అక్కడ నీరు పూర్తిగా ఇంకిపోయి నాణ్యమైన ఉప్పు రూపం దాల్చుతుంది. కష్టపడి ఉప్పు నాణ్యంగా పండించినా ఆ తర్వాతే రైతులకు కష్టాలు ప్రారంభం అవుతాయి. తాము పండించిన పంటకు దళారులు ఎంత ధర నిర్ణయిస్తారోనని గుబులు రైతుల మదిలో మెదులుతూ ఉంటుంది. కూలీల ఖర్చు, నీటి నిర్వహణ, రవాణా మొత్తం కలిపి ఖర్చు భారంగా మారుతోంది. ఈ ఖర్చుల కోసం రైతులు అప్పులు తీసుకుంటారు. కానీ అమ్మకాలు జరిగే సమయానికి ధరలు పడిపోవడంతో అప్పులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వడ్డీ పెరిగిపోయి రైతులపై అధిక భారం పడుతోంది.
"గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి . కనీస మద్దతు ధర ప్రకటించడంతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దళారుల సిండికేట్‌పై నియంత్రణ చర్యలు తీసుకోవాలి". -కొత్తపట్నం ఉప్పు రైతులు
కుక్కను జో కొట్టిన కోతి- ప్రేమగా ఆడుకుంటున్న శునకం, వానరం
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం - భారీగా తరలి వచ్చిన భక్తులు

