ETV Bharat / opinion

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామం నుంచి పూర్తిగా సర్కార్​ చేతుల్లోకి - మెట్రో టికెట్‌ ధరల్లో ఏమైనా మార్పు వస్తుందా?

మెట్రోతో 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన ఎల్అండ్​టీ -వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా మెట్రో నిర్వహణ నుంచి వైదొలగిన ఎల్అండ్​టీ - షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​తో వంద శాతం ఈక్విటీ పొందిన ప్రభుత్వం -

ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
HYDERABAD METRO RAIL LIMITED (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2026 at 4:51 PM IST

|

Updated : May 2, 2026 at 5:35 PM IST

7 Min Read
Choose ETV Bharat

Government Takeover Hyderabad Metro : హైదరాబాద్‌ ప్రజా రవాణాకు జీవనాడిగా ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ పరమైంది. ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు లార్సెన్​ అండ్ టూబ్రో (ఎల్​ అండ్​ టీ) అధీనంలో ఉండగా, రూ.1,461.47 కోట్లతో వంద శాతం ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మారిన ఆర్థిక సమీకరణాలు, ఎల్​ అండ్ ​టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా ఆ సంస్థ మెట్రోలో తన వాటాను విక్రయించి ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. మరి తదుపరి ఏం జరగనుంది? ఆస్తులు, అప్పుల స్వాధీన ప్రక్రియపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుంది? సేవలు, టికెట్‌ ధరల్లో ఏమైనా మార్పు వస్తుందా? ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకుందాం.

రాజధాని హైదరాబాద్‌ స్వరూపం మార్చిన ప్రాజెక్టు మెట్రో రైలు. నగర వాసులకు ఆధునిక రవాణా వ్యవస్థను పరిచయం చేసిన ఈ ప్రాజెక్టులో కీలక అధ్యాయం ముగిసింది. మెట్రో రైలు ప్రాజెక్టుతో ఎల్‌ అండ్‌ టీకి ఉన్న సుమారు 15 ఏళ్ల బంధం ముగిసినట్లైంది. మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ద్వారా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.

షేర్​ పర్చేజ్ అగ్రిమెంట్​తో : మెట్రో రైలు ప్రాజెక్టును సర్కార్‌కు అప్పగించడంపై ప్రభుత్వం, ఎల్​ అండ్​ టీకి మధ్య కొంతకాలంగా సంప్రదింపులు జరిగాయి. బుధవారం ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌, ఎల్‌ అండ్‌ టీ మధ్య సచివాలయంలో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్, ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్‌లో తనకున్న మొత్తం వాటా హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌కు విక్రయించడానికి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత ఎల్అండ్ఎమ్​హెచ్ఆర్​ఎల్ అనుబంధంగా ఉండదని తెలిపింది. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్​ : ఈ ఒప్పందం ప్రకారం ఎల్​అండ్​టీ హామీతో ఎల్​టీఎంఆర్​హెచ్ఎల్ పై 2026, ఏప్రిల్ 30 నాటికి ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఐడీబీఐ) కేపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించనుంది.

"మెట్రోను తెలంగాణ ప్రభుత్వ పరం చేసుకోవడం అభినందనీయం. ఇక మెట్రో భవిష్యత్తులోనూ సురక్షితంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థలైతే లాభాలు వస్తే నిర్వహించి, నష్టాలు వస్తే ఆపేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యతో భవిష్యత్తులో కూడా ఆ సమస్య ఉండదు. ఇదివరకే బెంగళూరు, దిల్లీ, చెన్నై వంటి నగరాల్లోనూ ఆయా ప్రభుత్వాల పరిధిలోనే మెట్రో నడుస్తోంది" - కొండల్, రైల్వే ప్రాజెక్ట్స్ మాజీ చీఫ్ ఇంజినీర్

86 కోట్ల మంది ప్రయాణించారు : హైద‌రాబాద్‌లో ఎల్​అండ్​టీ మెట్రో రైలు హైదారాబాద్ లిమిటెడ్ సంస్థ 2017, నవంబర్ నుంచి 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాక‌పోక‌లు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల మంది ప్రయాణించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవ‌డంతో మొదటి దశ, ప్రతిపాదిత రెండో దశ నెట్‌వర్క్ రూప‌క‌ల్పన‌, ప‌నులు, ప్రణాళిక‌, అమలు, సేవల అమలు, సమన్వయం సాధ్యమవుతుంది. భ‌విష్యత్తులోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్​ అతి పెద్ద భాగస్వామ్యంగా : హైదరాబాద్ మెట్రో రైలు నేపథ్యాన్ని పరిశీలిస్తే, మొదటి దశ ప్రాజెక్ట్‌ టెండర్‌ను ఆరంభంలో మేటాస్ కన్సార్షియం దక్కించుకుంది. సత్యం కుంభకోణం నేపథ్యంలో ఈ టెండర్లు రద్దయ్యాయి. 2010లో రెండోసారి గ్లోబల్‌ టెండర్లు పిలవగా, ఎల్​అండ్​టీ రూ.1,458 కోట్ల అతి తక్కువ సర్దుబాటు వ్యయ నిధిని కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్య ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. ఒప్పందం ప్రకారం 71 కిలోమీటర్లకు రూ.12,132 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో నిర్మాణం, నిర్వహణ, ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించాలి. నిర్మాణంతో కలిపి ఒప్పందం కాలవ్యవధి 35 ఏళ్లు. మెట్రో డిపోలు, మాల్స్ కోసం కేటాయించిన 269 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసి వీటి ద్వారా 45 శాతం ఆదాయం రాబట్టుకోవాలని ఒప్పందంలో ఉంది. రియల్ ఎస్టేట్‌కు 50 ఏళ్ల వరకు భూముల లీజు గడువు ఇచ్చారు. ప్రయాణ ఛార్జీల ద్వారా 50 శాతం, ప్రకటనల ద్వారా మిగిలిన 5 శాతం రాబట్టుకోవాలనే లక్ష్యంతో ఎల్​ అండ్ ​టీ ముందుకెళ్లింది.

తీవ్రంగా నష్టపోయామన్న ఎల్ ​అండ్ ​టీ : మెట్రో రెండో దశ డీపీఆర్​లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలో నుంచి రెండో దశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయ పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్​అండ్​టీ నుంచి స్పష్టత రావాల్సి ఉందని కేంద్రం సూచించింది. ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6,000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఆ సంస్థ కేంద్రానికి తెలిపింది. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది.

"మెట్రో నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలు విధించింది. సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన నిధుల సమీకరణాలను పరిశీలించినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్ర ప్రభుత్వం మరో 40 శాతం, మిగితా 20 శాతం బ్యాంకులు లేదా ఫైనాన్స్​ల ద్వారా తీసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా ముందుకెళ్తేనే భారత పట్టణ రవాణా మంత్రిత్వ శాఖ రుణాల ఆమోదం, విస్తరణ పనులకు అంగీకరిస్తుంది" - అశోక్, రైల్వే ప్రాజెక్ట్స్ మాజీ చీఫ్ ఇంజినీర్

ప్రభుత్వ పరంతో ప్రయోజనం : మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతేడాది సెప్టెంబర్‌లో ఎల్​అండ్​టీ ప్రకటించిన తర్వాత తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్థిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన దిల్లీ మెట్రోరైల్ 3 నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలు అందజేశాయి. ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్​అండ్​టీ లీజు కింద ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది. అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్‌ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.

నిధుల సమీకరణలో ఎల్​అండ్​టీ రికార్డు : 2011లో మెట్రో ప్రాజెక్ట్‌కు అయ్యే నిధుల సమీకరణను అతి తక్కువ కాలంలో చేపట్టి అప్పట్లో ఎల్​అండ్​టీ రికార్డు సృష్టించింది. అప్పటికీ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.16,376 కోట్లు. అందులో బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.11,478 కోట్ల రుణం, ఎల్​అండ్​టీ ఈక్విటీ వాటా రూ.3,440 కోట్లు, కేంద్రం ఇచ్చే సర్దుబాటు వ్యయ నిధి రూ.1,458 కోట్లు ఉన్నాయి. మెట్రో ప్రాజెక్ట్ మొదటి దశ 2017 నవంబరు 29న అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి వ్యయం అదనంగా రూ.5 వేల కోట్లు పెరిగింది. ఎల్​అండ్​టీ ఖర్చు కాకుండా ఆస్తుల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసింది.

15 ఏళ్ల బంధానికి తెర : హైదరాబాద్ మహా నగర ముఖచిత్రాన్ని మార్చేసిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో నిర్మాణ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న ఎల్​అండ్​టీ చక్కని పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్ట్ కావడంతో పాటు, అనేక ఆటుపోట్లు, సవాళ్లు ఎదురైనా వాటన్నింటినీ సర్కారు తోడ్పాటుతో అధిగమించి హైదరాబాద్ వాసులకు ఆధునిక రవాణా వ్యవస్థను పరిచయం చేసింది. నాడు మెట్రోకు పునాది వేసినప్పటి నుంచి నేడు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వరకు ఈ సంస్థ ప్రభుత్వంతో కలిసి నడిచింది. మారిన ఆర్థిక సమీకరణాలు, సంస్థ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా మెట్రోలో తన వాటాను విక్రయించి ప్రాజెక్ట్ నుంచి ఎల్అండ్ టీ వైదొలిగింది. దాదాపు 15 ఏళ్లకుపైగా ఉన్న అనుబంధానికి ముగింపు పలికింది.

ఐఆర్​ఎఫ్​సీ సహకారంతో : మెట్రో రైల్‌ ప్రాజెక్టు స్వాధీనంలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్‌కు చెందిన 'కియోలిస్' సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. అందువల్ల మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్​అండ్​టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు, పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు.

మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించాల్సిన రూ.13,000 కోట్ల రుణాల కోసం 4 శాతం వడ్డీపైన నిధులు అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్​సీ) ఇప్పటికే ముందుకు వచ్చింది. ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్‌తో ఒప్పందం కూడా ఖరారైంది. మొదటి దశ మెట్రో ప్రాజెక్టు ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చిన తర్వాత రెండో దశ సహా భవిష్యత్తులో మరిన్ని విస్తరణ దశలు వేగవంతం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ - దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలతో కనెక్టివిటీ

ఏఐ వినియోగంతో విద్యుత్‌కు భారీగా డిమాండ్‌ - కరెంట్ వినియోగం తగ్గించేందుకు ప్రయోగాలు

Last Updated : May 2, 2026 at 5:35 PM IST