ETV Bharat / opinion

అడిడాస్ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ వరకు - 'స్వర్ణ కుప్పం'పై సీఎం చంద్రబాబు ఫోకస్​

సొంత నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు -వరుసగా వెల్లువెత్తుతున్న పెట్టుబడులు -దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా కుప్పం - ఒకప్పుడు ఇక్కడి నుంచి యువత వలసలు

Kuppam Towards Establishment Side
Kuppam Towards Establishment Side (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 9, 2026 at 12:47 PM IST

5 Min Read
Choose ETV Bharat

Kuppam Towards Establishment Side : కుప్పం ఒకప్పుడు ఈ ఊరు గురించి ప్రస్తావన వస్తే మారుమూల ప్రాంతమని, కరవు కోరల్లో చిక్కుకున్న నియోజకవర్గమని మాట్లాడుకునే వాళ్లు. ఇప్పుడు లెక్క మారింది. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో రూపురేఖలు మారుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు స్థానికంగా ఉపాధి లేక వలస బాట పట్టిన యువత, ఇప్పుడు సొంత ఊర్లోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకు తోంది. అందుకు కారణం వరుసగా పరిశ్రమలు కుప్పం ప్రాంతానికి క్యూ కట్టడం. ఫుట్‌వేర్ దిగ్గజం అడిడాస్ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కంపెనీల వరకు కుప్పం ఓ గమ్య స్థానమైంది. ఈ అభివృద్ధిపై స్థానికులు తెగ సంతోష పడుతున్నారు. వలసల కుప్పం ఇప్పుడు స్వర్ణ కుప్పం దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఈ ప్రగతి ఎలా సాధ్యమైంది? ఏయే సంస్థలు ఇక్కడికి తరలి వస్తున్నాయి?

అంతర్జాతీయ పరిశ్రమలకు కేరాఫ్‌ అడ్రస్‌: చిత్తూరు జిల్లా కుప్పం. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ నియోజకవర్గంలో ఉపాధి కరవై పొరుగున ఉన్న రాష్ట్రాల రాజధాని నగరాలకు పొట్ట చేతపట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. నాలుగు దశాబ్దాల క్రితం వరకూ ఇంతే. బెంగళూరు, చెన్నైకి వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోయేవి. ఇప్పుడు రోజులు మారాయి. తనను శాసనసభ్యుడిగా ఎన్నుకున్న రోజు నుంచే కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు. 1994లో ఆధునిక వ్యవసాయ పద్ధతులకు కేంద్రమైన కుప్పం 2026 సంవత్సరంలో అంతర్జాతీయ పరిశ్రమలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. గతంలో ఉపాధి కోసం వలస వెళ్లిన కుప్పం యువత ఇపుడు తిరిగి వస్తున్నారు. స్థానికంగానే ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఈ ప్రాంతానికి 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 30 పరిశ్రమలకు శంకుస్థాపనలు, ఒప్పందాలు జరిగాయి.

"మేము సెప్టెంబర్ 1వ తేదీన ఈ పరిశ్రమలను ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం కొన్ని ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా, దీనికి సంబంధించిన రెండవ దశ పనులను ఏప్రిల్ 2028లో ప్రారంభించబోతున్నాం. మేము కుప్పంలో ప్రపంచ నవకల్పన కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. మేము సుమారు 500 ప్రత్యక్ష ఉద్యోగాలను అందిస్తాం. మేము 8100 పరోక్ష ఉద్యోగాలను అందిస్తాం. అదనంగా, మేము సీడ్ కంపెనీలను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నాం.' - పెట్టుబడిదారులు

సింగిల్ విండో సిస్టమ్ : సాధారణంగా పరిశ్రమలకు ఒప్పందాలు, శంకుస్థాపనలు అట్టహాసంగా జరిగినా ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత ఉండదు. పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టిన రోజునే ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు పారిశ్రామికవేత్తలు జై కొట్టారు. పరిశ్రమల ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అవినీతి, కమీషన్లు లేకుండా భూమి, నీరు, విద్యుత్‌ వంటి 33 రకాల సదుపాయాలను ప్రభుత్వం వేగంగా అందిస్తోందని, అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తామని చెబుతున్నారు. పక్కా తేదీ చెప్పాలని చంద్రబాబు అడగ్గా కొందరు ఇన్వెస్టర్స్ ఇలా సమాధానం చెప్పారు.

పరిశ్రమల ఏర్పాటు యువతకు ఉపాధి : పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం సంతృప్తికరమైన స్థాయిలో పరిహారాన్ని అందజేసింది. సెటిల్మెంట్ భూములకు ఎకరాకు 35 లక్షలు, డీకేటీ భూములకు 16 లక్షల రూపాయల చొప్పున చెల్లించడంతో పాటు పండ్ల మొక్కలు, షెడ్ల వంటి వాటికి అదనపు పరిహారం చెల్లించడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. మరో వైపు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కానుండడం వల్ల చుట్టుపక్కల భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో ఎకరా 5 లక్షల నుంచి పది లక్షల రూపాయలు పలికిన భూములు కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు చేరాయి. పరిశ్రమల ఏర్పాటు యువతకు ఉపాధి అందిస్తుండగా పారిశ్రామిక అభివృద్ధి పరిసర ప్రాంతాల రైతులను లక్షాధికారులుగా మారుస్తోంది.

అనేక పరిశ్రమలతో జిల్లా అభివృద్ధి : ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌వేర్ తయారీ పరిశ్రమ అడిడాస్‌, విమాన శిక్షణ కోసం ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ, బ్యాటరీలు, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన సౌకర్యాలు కల్పిస్తోంది ప్రభుత్వం. అందుకే..ఈ ప్రాంత ప్రజలు తమ దశ తిరిగినట్టే అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో 30 పరిశ్రమలు వస్తుండడం వల్ల వేలాది మందికి ఉద్యోగాలు లభించనుంది. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో చేపట్టిన కార్యక్రమాలు పారిశ్రామిక వర్గాలను ఆకర్షించేలా చేశాయి. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసినప్పుడు కలిగిన ఆనందం కంటే కుప్పంలో పలు పరిశ్రమలకు ఒకేసారి శంకుస్థాపన చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్‌ పెట్టుబడి రాష్ట్ర ప్రతిష్ఠను పెంచితే కుప్పంలో ప్రారంభమవుతున్న పరిశ్రమలు వేలాది కుటుంబాల జీవితాలను మార్చనున్నాయని అభిప్రాయపడ్డారు.

"నేను కుప్పంను ఒక కొత్త కోణంలో చూస్తున్నాను. కుప్పం నాకు ఒక భావోద్వేగం. కుప్పం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందనే ఆలోచనతో నేను పథకాలను ప్రవేశపెడతాను. మీ అందరికీ మంచి ఉద్యోగాలు కల్పించే బాధ్యతను నేను తీసుకుంటాను. నేను ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగాలను అందిస్తాను. ఉద్యోగాలు కల్పించడం కాదు. నేను ఉద్యోగాలు కల్పించగలిగే స్థితిలో ఉండాలి." -చంద్రబాబు నాయుడు, సీఎం.

కుప్పంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థల జాబితాలో ఈమోటోరాడ్‌ సంస్థ కూడా చేరింది. రూ.30 కోట్ల పెట్టుబడితో కుప్పంలో ఎలక్ట్రిక్‌ సైకిళ్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా 600 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకోసం ఏడెకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపింది. కాన్పూర్‌ ఐఐటీ, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ పేర్కొంది. ఇక రాయలసీమలో రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కుప్పంలో జరిగిన సభలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇందులో ప్రైవేటు రంగం వాటా రూ.60 వేల కోట్లు కాగా ప్రభుత్వం రూ.40వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడించారు. కుప్పంలో రూ.117 కోట్లతో అధునాతన బస్‌స్టేషన్‌, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు.

10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి : కుప్పంలో ఏర్పాటు కానున్న అడిడాస్‌ పరిశ్రమ ద్వారా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చాలా ధీమాగా చెబుతోంది. అంతే కాదు. డెయిరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పౌల్ట్రీ పరిశ్రమలు వచ్చినందున10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి కుప్పం చేరుతుందనీ అంటోంది. డ్వాక్రా సంఘాల ద్వారా గడ్డి పెంచి కమ్యూనిటీ ఫోరమ్‌ల ద్వారా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చింది. స్వర్ణ కుప్పం కావాలి అనేదే తన ఆకాంక్ష అని మొదటి నుంచి చెబుతున్న చంద్రబాబు తగ్గట్టుగానే ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. త్వరలోనే ఇక్కడి నుంచి బంగారం ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పరిమితం కాకుండా కుప్పం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. నెట్‌జీరో గృహాల నిర్మాణంస్వచ్ఛ కుప్పంలో భాగంగా 70% పచ్చదనం విస్తరణ పర్యావరణానికి ముప్పు లేకుండా పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా ఒకప్పటి మారుమూల కుప్పం నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల డెస్టినేషన్‌గా మారుతోంది.

మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు చేస్తాం : సీఎం చంద్రబాబు

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేవారికి గొడ్డలి పార్టీ ఫండింగ్ చేస్తోంది: సీఎం చంద్రబాబు