కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం - రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
కొన్నేళ్లుగా వాయిదా పడుతున్న నిర్మాణం - ఇప్పటివరకు నాలుగు సార్లు శంకుస్థాపనలు - అయినా నిర్మాణానికి నోచుకోని స్టీల్ ప్లాంట్ - ఈ సారి కచ్చితంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 2, 2026 at 2:00 PM IST
|Updated : July 2, 2026 at 2:07 PM IST
Kadapa Steel Plant : రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలి అన్నది కూటమి సర్కారు ఆలోచన. అందుకోసం జిల్లాల వారీగా వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఏళ్లుగా హామీలు, శంకుస్థాపనలకే పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడానికి సిద్ధమైంది. జులై 3న రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పునాది రాయి వేయనున్నారు. దీంతో రాయలసీమ వాసుల చిరకాల వాంఛ నెరవేరేందుకు అడుగు పడనుంది. మరి, ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం సీమ అభివృద్ధికి ఎలా తోడ్పడనుంది? స్థానికంగా ఎంతమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి? పూర్తి వివరాలు ఈ కథనంలో.
పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు : ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో కరవు కాటకాలు ఎక్కువ. సరైన వర్షాలు కురవక, పంటలు పండక పేదరికంలో మగ్గిపోయే పరిస్థితి ఉండేది. ఉపాధి కల్పించే పరిశ్రమలు కూడా సీమలో లేకపోవడంతో బతుకుదెరువు కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కానీ వలసలను పూర్తిగా అరికట్టాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకోసం కడప జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. అందుకే, కూటమి సర్కారు రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 3న సీఎం చంద్రబాబు ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
10,670 ఎకరాల భూముల కేటాయింపు : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. సీమ ప్రజల విజ్ఞప్తి మేరకు ఎన్నో ప్రభుత్వాలు కడప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చాయి. కానీ, 2 దశాబ్దాలుగా ఆ హామీలు అమలుకు నోచుకోలేదు. ఏకంగా 4 సార్లు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేయకుండా వదిలేశారు. మొదట 2007 జూన్ 10న నాటి సీఎం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణి ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్ పేరుతో శంకుస్థాపన చేశారు. దీని కోసం 10,670 ఎకరాల భూములను కేటాయించారు. జమ్మలమడుగు మండలంలో ప్లాంట్ పనులు మొదలు పెట్టారు. ఐతే, బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డిది. అప్పట్లో ఆయనపై ఓబులాపురం గనుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు సహా సీబీఐ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించటంతో ఈ ప్లాంట్ పనులు నిలిచిపోయాయి.
2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని అప్పటి UPA ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన NDA కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఇక్కడ ఫీజిబిలిటీ లేదనే వాదనలు తీసుకువస్తోందని అప్పటి సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతుందని ప్రకటించారు. దీంతో 2018 డిసెంబర్ 27న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 4 నెలలకే ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభంకాలేదు.
జిందాల్ సౌత్ వెస్ట్ సంస్థతో ఒప్పందం : 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్ 27న గతంలో చంద్రబాబు చేసిన ప్రదేశంలో కాకుండా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరిట అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. కానీ కరోనా ప్రభావంతో పనులు మొదలుకావడంలో జాప్యం జరిగిందని వైఎస్సార్సీపీ చెప్పుకొచ్చింది. దీంతో 2023 ఫిబ్రవరిలో వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌గా పేరు మార్చి మరోసారి జగన్ శంకుస్థాపన చేశారు.
2 దశల్లో ప్లాంట్ పూర్తి చేస్తామని ప్రకటించారు. 16 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. ప్లాంట్ నిర్మాణానికి JSW-జిందాల్ సౌత్ వెస్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పనులు ముందుకు కదల్లేదు. ఈ లోగా ప్రభుత్వం మారింది. సొంత జిల్లాలోనే 2సార్లు శంకుస్థాపనలు చేసిన జగన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టలేదని అరోపణలు ఉన్నాయి.
4 సార్లు శంకుస్థాపనలు : 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని తప్పకుండా చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే జులై 3న కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్యతీర్థం ఆలయ సమీపంలో ఉక్కు పరిశ్రమ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిందాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ముగ్గురు ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపనలు చేశారు. అందుకే, మరోసారి చంద్రబాబు శంకుస్థాపన చేయటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారికంగా JSW స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారని తెలిపింది.
స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 16,350 కోట్లు ఖర్చు : సుమారు 3,500 ఎకరాల్లో JSW సంస్థ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనుంది. దీని కోసం ఇప్పటికే APICC 1100 ఎకరాలు కేటాయించింది. మిగిలిన భూములు త్వరలో అప్పగించనుంది. దీని కోసం మొత్తంగా 16,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. మొదటి దశలో 4,500 కోట్ల రూపాయలతో 10 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పనులు ప్రారంభం కానున్నాయి. రెండో దశ పనులను 2034 ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నారు. దీని కోసం 11,850 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని ద్వారా 20 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నారు. మొత్తంగా రాయలసీమలో ఏర్పాటు అయ్యే ఉక్కు కర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
కడప ప్లాంట్‌ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నూతన పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకు ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నెస్ పద్ధతులను వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఎక్కువగా పర్యావరణం కలుషితం అవుతోంది. దీనికి భిన్నంగా కాలుష్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ సాంకేతికతను వినియోగించనున్నారు. దీనివల్ల పరిసరాలు కాలుష్యం బారిన పడకుండా పర్యావరణహితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ అవసరాల కోసం గండికోట నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
స్టీల్ ప్లాంట్ ద్వారా కడప జిల్లాను దక్షిణ భారత దేశంలోనే ఉక్కు కర్మాగార హబ్‌గా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దీనికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందటమే కాకుండా రాయలసీమ నుంచి పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు వలసలు తగ్గే అవకాశం ఉంది. స్థానికంగానే వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2029 ఏప్రిల్ నాటికి స్టీల్ ప్లాంట్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు - రూ.4,500 కోట్లతో తొలి దశ పనులు
'యాక్సెస్ కంట్రోల్'గా కడప- కర్నూలు హైవే - ఇక 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లొచ్చు

